తిరుమల స్థానికుల అరణ్య రోదన! టిటిడి ఛైర్మన్‌ తీరుపై అసంతృప్తి!

తిరుమల వాసులు స్వదేశంలోనే కాందిశీకులు (వలసదారులు) మాదిరిగా జీవిస్తున్నారు. టిటిడి అధికారుల పెత్తనం కింద నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడానికే జీవిస్తున్నట్లుంది వాళ్ల పరిస్థితి. అన్నింటికీ అవస్థలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. భయంభయంగా గడపాల్సిన దుస్థితి. ఎప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటారో తెలియదు. ఎప్పుడు దుకాణాలు మూసేమంటారో చెప్పలేం. ఎప్పుడు తిరుపతి అలిపిరి టోల్‌గేట్‌లోనే వెనక్కి పంపేస్తారో ఊహించలేం. అందుకే తిరుమల వాసుల్లో తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన గూడుట్టుకున్నాయి.

తిరుమల మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో వందల కుటుంబాలను దశాబ్దాల క్రితమే తిరుపతికి దింపేశారు. ఇప్పటికీ బాలాజీ నగర్‌, ఆర్‌బి సెంటర్‌లో మాత్రమే 1200 కుటుంబాలు ఉన్నాయి. నిర్వాసితులైన తిరుమల వాసులకు ఒకప్పుడు దుకాణాలు కేటాయించారు. కాలక్రమంలో దుకాణ లైసెన్సులు పొందిన వారు మరణించారు. వారసత్వం ప్రకారం ఆ దుకాణ లైసెన్సులను వారి పిల్లల పేర్లతో మార్చాలి. సహజంగా జరిగిపోవాల్సిన ఈ ప్రక్రియ కోసం సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు. అదేవిధంగా దశాబ్దాల క్రితం 84 మందికి టెండరు షాపుల పేరుతో దుకాణాలు కేటాయించారు. ఇప్పుడు వాటిని వేలం వేయాలని చూస్తున్నారు. ఆ మధ్య నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. ‘మా బతుకులు ఏంకావాలి’ అంటూ దుకాణదారులు ఆందోళనకు దిగడంతో అప్పుడు తాత్కాలికంగా వేలం ఆలోచన విరమించుకున్నారు. అయినా ప్రమాదం తొలగిపోలేదు. ఇది మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఇక ఆర్‌బి సెంటర్‌లో 84 ఇళ్లు ఉన్నాయి. గత ఏడాది కోర్టులో కేసు గెలిచిన టిటిడి…ఆ ఇళ్లను స్వాధీనం చేసుకోడానికి సిద్ధమయింది. ఆ ఇళ్లవారు ఆందోళనకు దిగడంతో, రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్ల స్వాధీనాన్ని వాయిదా వేశారు. ఆ 84 కుటుంబాలను తిరుపతికి తరలించాలన్నది టిటిడి అధికారుల ఆలోచన. తాము చానవైనా చస్తాంగానీ తిరుమల విడిచి వెళ్లబోమని వారు భీష్మించుకున్నారు. ఎప్పటికైనా ఆ ఇళ్లను ఖాళీ చేయించాలన్న ఆలోచనలో టిటిడి ఉంది. అదేవిధంగా బాలాజీ నగర్‌లో దాదాపు 30 ఏళ్ల క్రితం కొన్ని ఇళ్లు చేతులు మారాయి. అయినా వాటి యాజమాన్య హక్కులు మాత్రం మారలేదు. దీని కోసం కూడా అక్కడివారు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఉపాధి చూపాల్సిన నిర్వాసితులున్నారు. హాకర్‌ లైసెన్సుల కోసం టిటిడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేదు.

ఇక ఇప్పటికే వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఏదో ఒకపేరుతో అపరాధిం విధిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తరచూ దుకాణాలు మూసేస్తున్నారు. తాజాగా బోర్డు ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ స్వయంగా, అర్ధరాత్రిపూట తనిఖీలు నిర్వహించి, కేటాయించిన స్థలం కంటే కొంత ఎక్కువగా ఆక్రమించుకున్నారన్న పేరుతో దుకాణాలపై చర్యలకు ఆదేశించారు. ఒక దుకాణంలో ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నాయన్న పేరుతో రూ.75 వేల ఫైన్‌ విధించారు. తిరుమలవాసులు తాము కోరుకున్న పండ్లు తినడానికీ వీల్లేదు. కర్జూజ పండ్లను తిరుమలకు తీసుకెళ్లకూడదు. ఆ కర్జాజా తొక్కల కోసం పందులు వస్తాయని, ఆ పందుల కోసం పులులు వస్తాయన్న కారణం చూపించి కర్జాజాను తిరుమలకు తీసుకెళ్లనీకుండా నిషేధించారు. ఇక దీపావళికి, చావులకు ఉపయోగించే బాణసంచానూ తిరుమలకు అనుమతించరు.

ఇలా ఎన్నో సమస్యలతో తిరుమలవాసులు, వ్యాపారులు సతమతం అవుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఎన్నికల సమయంలో ఓట్లు కోసం తప్ప స్థానికుల సమస్యలను ఆలకించడానికి, పరిష్కరించడానికి తిరుమలకు వచ్చిన నాయకుడే లేరంటే అతిశయోక్తికాదు. టిటిడి అధికారులు చెప్పిందే శాసనం. తమకు అన్యాయం జరిగిందని భావించి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే…ఇక వాళ్ల పని అయిపోయినట్లే. ఈ నేపథ్యంలో విసిగిపోయిన స్థానికులు….ఎన్నికల వేళనైనా సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో తిరుపతిలో ఆదివారంనాడు సమావేశమయ్యారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ సమావేశానికి తుడా ఛైర్మన్‌ నరసింహయాదవ్‌, టిటిడి నగర అధ్యక్షులు దంపూరు భాస్కర్‌ యాదవ్‌ తదితర అధికార పార్టీ నేతలు హాజరయ్యారు. టిటిడి ఛైర్మన్‌ సుధాకర్‌ యాదవ్‌ తీరు బాగోలేదని ఆ నాయకుల ముందే నిర్మొహమాటంగా చెప్పారు స్థానికులు. ఏదైనా స‌మ‌స్య చెప్ప‌డానికి వెళ్ల‌నపుడు టిటిడి అధికారుల‌ను త‌మ‌ను త‌క్కువ‌గా చూస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. తాము ఇక్క‌డే పుట్టి పెరిగిన విష‌యం కూడా అధికారుల‌కు తెలియ‌ద‌ని, వారికి తెలిసేలా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌మ స‌మ‌స్య‌లు విన‌డానికి బోర్డుకు కూడా ఓపిక లేద‌ని వాపోయారు. దీంతో స్పందించిన నేతలు…రెండు బోర్డు సమావేశాల్లోపు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలా పరిష్కరించకుంటే ఓట్లు కోసం కూడా తాము తిరుమలకు రాబోమని చెప్పారు. మరి సమస్యలు పరిష్కారం అవుతాయా? ఏమో చూద్దాం!

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*