తిరుమల స్థానికుల సమస్యలకు మోక్షం లేదా?

తిరుమలవాసుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన టిటిడి అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు. పాలక మండలి తీర్మానాన్ని కూడా అటకెక్కించి నిర్లిప్తంగా కూర్చున్నారు. దీంతో తిరుమల స్థానికుల్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.

తిరుమలవాసులు తమ సమస్యల పరిష్కారం కోసం చాలాకాలంగా ఇటు టిటిడి అధికారులకు, అటు ప్రభుత్వ పెద్దలకు వినతులు చేస్తున్నారు. అయినా పరిష్కారం కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమీతుమీ తేల్చుకోడానికి టిటిడి పరిపాలనా భవనం ఎదుట దీక్షలకు దిగారు. ఎన్నికల సమయంలో ఈ ఆందోళన ఇలాగే కొనసాగితే రాజకీయంగా నష్టపోవాల్సివస్తుందని కంగారుపడిన అధికార పార్టీ నాయకులు….ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చారు. దీంతో కొన్ని సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరిలో జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు.

వ్యాపారం సరిగా జరగిన ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను మార్చడం, టీ దుకాణాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడం వంటి కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని బోర్డు సమావేశంలో ఛైర్మన్‌ స్వయంగా చెప్పారు. ఇప్పటిదాకా అధికారులు కార్యాచరణ మొదలుపెట్టలేదు. ఎన్నికల నియమావళి నెపం చూపుతూ బోర్డు తీర్మానాన్ని మూలనపడేశారు. ఇంకా చెప్పాలంటే….దీనికి సంబంధించి బోర్డ తీర్మానం కాపీని టిటిడి వెబ్‌వైట్‌ కూడా ఉంచలేదు. ఆ నెలలో చేసిన తీర్మానాలకు సంబంధించిన అన్ని కాపీలను వెబ్‌సైట్‌లో పెట్టారుగానీ….తిరుమల వాసుల సమస్యలపై చేసిన తీర్మానం మాత్రం అందులో లేదు.

పాలక మండలి చేసిన నిర్ణయాన్ని అమలు చేయడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బోర్డు నిర్ణయాల్లో అధికారుల అభీష్టానికి వ్యతిరేకమైనవి కొన్ని ఉండటం వల్ల….ఉద్దేశపూర్వకంగానే ఆ నిర్ణయాలను అమలు చేయకుండా నాన్చుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు అమలు చేయకుంటే….కొత్త ప్రభుత్వంలో సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికలు పూర్తయినందున ఇప్పటికైనా బోర్డు నిర్ణయాల అమలుకు అధికారలు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు ఆ దిశగా కదులుతారా…లేక కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత చూద్దాంలే అని వాయిదా వేస్తారా…అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*