తిరుమ‌ల‌లో భక్తుల కోసం భక్తి, పౌరాణిక చిత్రాలు ప్రదర్శించాలి

శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో వేచి ఉండే భక్తుల కోసం భక్తి, పౌరాణిక చిత్రాలు ప్రదర్శించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే వేలాది మంది భక్తుల కోసం స్వామివారి వైభవంతోపాటు పలు ఆధ్యాత్మిక విషయాలను, తిరుమల సమాచారాన్ని తెలియజేస్తున్నామని, పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా ఇంకా ఎలాంటి అంశాలు ప్రదర్శించాలనే విషయమై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవిని ఆదేశించారు. అదేవిధంగా, టిటిడి రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, ఎస్వీబీసీ ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై కూడా భక్తుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన విద్యుత్‌ కటౌట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. అటవీ విభాగం, ఉద్యానవన విభాగాలకు పని విభజన చేపట్టి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తిరుమలలో ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. తిరుమలలోని పలు కాటేజీల్లో చలికి ఇబ్బందులు లేకుండా భక్తులకు అదనపు దుప్పట్లు, దిండ్లు అందిస్తున్న విధానానికి మంచి స్పందన వస్తోందని, ఈ సౌకర్యాన్ని మరిన్ని కాటేజీలకు విస్తరించాలని కోరారు.
సప్తగిరి మాసపత్రిక చందాదారుల చిరునామాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుని పత్రిక సక్రమంగా అందేలా చూడాలని ఈవో ఆదేశించారు. వచ్చే సంవత్సరం టిటిడి డైరీలు, క్యాలెండర్లను వేగంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని భక్తులకు చేరవేసేందుకు తపాలా శాఖ అధికారులతో చర్చించాలని తిరుపతి జెఈవోను కోరారు. తిరుపతిలో భక్తులు టిటిడి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కురుక్షేత్ర, హైదరాబాద్‌, ఉపమాక, అనంతవరం, పిఠాపురం, తుమ్మూరు, పార్వతీపురం, సీతంపేట ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులపై ఈవో సమీక్షించారు.
ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో  పోల భాస్కర్‌, సివిఎస్‌వో  గోపినాథ్‌జెట్టి, చీఫ్‌ ఇంజినీర్‌  చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో ఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*