తిరుమ‌ల స్థానికుల గోడు టిటిడికి ప‌ట్ట‌దా..!

తిరుమల వాసులు స్వదేశంలోనే కాందిశీకులు (వలసదారులు) మాదిరిగా జీవిస్తున్నారు. టిటిడి అధికారుల పెత్తనం కింద నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలకు ఓట్లు వేయడానికే జీవిస్తున్నట్లుంది వాళ్ల పరిస్థితి. అన్నింటికీ అవస్థలే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. భయంభయంగా గడపాల్సిన దుస్థితి. ఎప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటారో తెలియదు. ఎప్పుడు దుకాణాలు మూసేమంటారో చెప్పలేం. ఎప్పుడు తిరుపతి అలిపిరి టోల్‌గేట్‌లోనే వెనక్కి పంపేస్తారో ఊహించలేం. అందుకే తిరుమల వాసుల్లో తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన గూడుట్టుకున్నాయి.

తిరుమల మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో వందల కుటుంబాలను దశాబ్దాల క్రితమే తిరుపతికి దింపేశారు. ఇప్పటికీ బాలాజీ నగర్‌, ఆర్‌బి సెంటర్‌లో మాత్రమే 1200 కుటుంబాలు ఉన్నాయి. నిర్వాసితులైన తిరుమల వాసులకు ఒకప్పుడు దుకాణాలు కేటాయించారు. కాలక్రమంలో దుకాణ లైసెన్సులు పొందిన వారు మరణించారు. వారసత్వం ప్రకారం ఆ దుకాణ లైసెన్సులను వారి పిల్లల పేర్లతో మార్చాలి. సహజంగా జరిగిపోవాల్సిన ఈ ప్రక్రియ కోసం సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు.

దశాబ్దాలు గడుస్తున్నా నిర్వాసితులకు ఉపాధి చూపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 100 మందికిపైగా నిర్వాసితులకు దుకాణాలు కేటాయించాల్సివుంది. తమకు బతుకుదెరవు కల్పించండి మొర్రో అని నిర్వాసితులు మొత్తుకుంటుంటే…వారిని పక్కనపెట్టేసి, తిరుమలలో అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్న వారికి హాకర్‌ లైసెన్సులు కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. స్థానికులు కాని 450 మందికి హాకర్‌ లైసెన్సులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారని, ఇందులో ఒక్కో లైసెన్సుకు రూ.25 లక్షలు దండుకున్నారని, ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని బాధితులు విమర్శిస్తున్నారు.

అదేవిధంగా దశాబ్దాల క్రితం 84 మందికి టెండరు షాపుల పేరుతో దుకాణాలు కేటాయించారు. ఇప్పుడు వాటిని వేలం వేయాలని చూస్తున్నారు. ఆ మధ్య నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. ‘మా బతుకులు ఏంకావాలి’ అంటూ దుకాణదారులు ఆందోళనకు దిగడంతో అప్పుడు తాత్కాలికంగా వేలం ఆలోచన విరమించుకున్నారు. అయినా ప్రమాదం తొలగిపోలేదు. ఇది మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉంది.

ఇక ఆర్‌బి సెంటర్‌లో 84 ఇళ్లు ఉన్నాయి. గత ఏడాది కోర్టులో కేసు గెలిచిన టిటిడి…ఆ ఇళ్లను స్వాధీనం చేసుకోడానికి సిద్ధమయింది. ఆ ఇళ్లవారు ఆందోళనకు దిగడంతో, రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఇళ్ల స్వాధీనాన్ని వాయిదా వేశారు. ఆ 84 కుటుంబాలను తిరుపతికి తరలించాలన్నది టిటిడి అధికారుల ఆలోచన. తాము చానవైనా చస్తాంగానీ తిరుమల విడిచి వెళ్లబోమని వారు భీష్మించుకున్నారు. ఎప్పటికైనా ఆ ఇళ్లను ఖాళీ చేయించాలన్న ఆలోచనలో టిటిడి ఉంది. అదేవిధంగా బాలాజీ నగర్‌లో దాదాపు 30 ఏళ్ల క్రితం కొన్ని ఇళ్లు చేతులు మారాయి. అయినా వాటి యాజమాన్య హక్కులు మాత్రం మారలేదు. దీని కోసం కూడా అక్కడివారు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఉపాధి చూపాల్సిన నిర్వాసితులున్నారు. హాకర్‌ లైసెన్సుల కోసం టిటిడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేదు.

ఇక ఇప్పటికే వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఏదో ఒకపేరుతో అపరాధిం విధిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తరచూ దుకాణాలు మూసేస్తున్నారు. ఒక దుకాణంలో ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నాయన్న పేరుతో రూ.75 వేల ఫైన్‌ విధించారు. తిరుమలవాసులు తాము కోరుకున్న పండ్లు తినడానికీ వీల్లేదు. కర్జూజ పండ్లను తిరుమలకు తీసుకెళ్లకూడదు. ఆ కర్జాజా తొక్కల కోసం పందులు వస్తాయని, ఆ పందుల కోసం పులులు వస్తాయన్న కారణం చూపించి కర్జాజాను తిరుమలకు తీసుకెళ్లనీకుండా నిషేధించారు. ఇక దీపావళికి, చావులకు ఉపయోగించే బాణసంచానూ తిరుమలకు అనుమతించరు.

ఇలా ఎన్నో సమస్యలతో తిరుమలవాసులు, వ్యాపారులు సతమతం అవుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఎన్నికల సమయంలో ఓట్లు కోసం తప్ప స్థానికుల సమస్యలను ఆలకించడానికి, పరిష్కరించడానికి తిరుమలకు వచ్చిన నాయకుడే లేరంటే అతిశయోక్తికాదు. టిటిడి అధికారులు చెప్పిందే శాసనం. తమకు అన్యాయం జరిగిందని భావించి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే…ఇక వాళ్ల పని అయిపోయినట్లే. ఈ నేపథ్యంలో విసిగిపోయిన స్థానికులు….ఎన్నికల వేళనైనా సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఆందోళనబాట పట్టారు. తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమై టిటిడి పరిపాలనా భవనం వద్ద రిలే దీక్షలకు పూనుకున్నారు. తిరుమ‌ల‌లో దుకాణాలు బంద్ చేయ‌డానికీ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్పటికైనా టిటిడి అధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారా? తిరుమల స్థానికులకు న్యాయం చేస్తారా? ఏమో చూద్దాం..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*