తూర్పున మైనింగ్‌ మాఫియా…ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..!

  • వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మైనింగ్‌ వ్యాపారం మూడూ పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. క్వారీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. త్వకాల్లో నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారగణం మామూళ్ల మత్తులో జోగుతోంది.

తూర్పు మండలాలలైన తొట్టంబేడు, బుబ్చినాయుడు కండ్రిగ, వరదయ్యపాళెం, కెవిబిపురం, నగరి, పుత్తూరు తదితర మండలాల్లో పెద్ద సంఖ్యలో క్వారీలున్నాయి. ఈ క్వారీల నిర్వాహకులందరూ చాలా వరకు బడా బాబులే. వీరికి అధికారులు, రాజకీయ నాయకులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. దీంతో క్వారీ, క్రషర్‌ వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు.

పర్యావరణ అనుమతులు లేకున్నా…: కంకర క్వారీలు, క్రషర్లు నిర్వహించాలంటే పర్యావరణ శాఖ, అగ్నిమాపక శాఖ, గనుల శాఖ అనుమతులు తప్పనిసరి. తవ్వకాలకు పరిధి ఉంటుంది. అయితే క్వారీ, క్రిషర్ల నిర్వాహకులు చాలామంది నిబంధనలు పాటించడం లేదు. సుమారుగా ఏడాది కాలంగా పాత క్వారీలకు పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేఉద. అయినా తవ్వకాలు మాత్రం నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

అనుమతి ఒకచోట…తవ్వకాలు ఇంకోచోట : క్వారీల తవ్వకాల కోసం రెవెన్యూ వారు భూమిని కేటాయిస్తారు. ఈ భూమిలోనే తవ్వకాలు చేపట్టాలి. తూర్పు మండలాల్లోని క్వారీల నిర్వాహకులు మాత్రం తమకు కేటాయించిన స్థలంలో కాకుండా మరోచోట తవ్వకాలు చేస్తున్నారు. అలాగే అనుమతించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేస్తున్నారు.

పన్ను ఎగవేత : క్వారీ, క్రషర్ల నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా టోకరా వేస్తున్నారు. నిబంధనల ప్రకారం క్యూబిక్‌ మీటర్‌కు రూ.75 చెల్లించాలి. పన్ను మరో రూ.20 ఉంటుంది. మొత్తంగా ఒక క్యూబిగ్‌ మీటర్‌కు రూ.95 చెల్లించాలి. అయిత…ఏడాది కాలంగా పన్ను చెల్లించకుండానే తవ్వకాలు సాగిస్తున్నారు.

యథేచ్ఛగా అక్రమ రవాణా : క్వారీలో 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, 6 ఎంఎం కంకరు తయారు చేస్తున్నారు. వీటితో పాటు కంకర దుమ్ము కూడా తయారు చేస్తారు. తమిళనాడు రాష్ట్రంలో 12 ఎంఎం, 6 ఎంఎం కంకరతో పాటు దుమ్ముకూ చాలా గిరాకీ ఉంది. దీంతో తూర్పు మండలాల నుంచి రోజూ 150 నుంచి 200 లారీల కంకరు, కంకరు దుమ్మును తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. వీటికి అనుమతులు లేవు. పైసా పన్ను చెల్లించడం లేదు.

నిబంధనలు అతిక్రమించి : కంకరు, దుమ్ము తరలింపులో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. పది టన్నుల సామర్థ్యంగల లారీలో 16 టన్నులు నింపుతున్నారు. 14 టన్నుల లారీలో 20 టన్నులు లోడ్‌ చేస్తున్నారు. 20 టన్నుల సామర్థ్యంగల లారీలో 30 టన్నులు నింపుకుని వెళుతున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన రవాణా శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. అడపాదడపా తనిఖీలు నిర్వహించి లారీలను సీజ్‌ చేస్తున్నా…అవి మామూళ్లు ఇవ్వనివి మాత్రమే. మామూళ్లు చెల్లించేవారికి దాడుల సమాచారాన్ని ముందుగానే చేరవేస్తున్నారు. కంకరు, దుమ్ము రవాణాచేస్తున్న లారీలకు వే బిల్లులు కూడా ఉండటం లేదు.

కొత్త క్వారీల పేరుతో… : కొత్త క్వారీల పేరుతో పాత వాటిలోనే తవ్వకాలు సాగిస్తున్నారు. మన జిల్లాలో ఏడాదిగా పాత క్వారీల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం లేదు. కొంతమంది కొత్త క్వారీలకు అనుమతులు సంపాదింఆచరు. అయితే అక్కడ తవ్వకం చేయడానికి వ్యయం ఎక్కువగా అవుతుందని గ్రహించి….పాత క్వారీల్లోనే తవ్వకాలు చేస్తున్నారు. పర్యావరణం రీత్యా ఏ క్వారీలోనైనా పరిమితికి మించి తవ్వకూడదు.

ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్‌ : క్వారీల్లో బ్లాస్టింగ్‌ చేయడానికి పరిమితులున్నాయి. ఎక్కువ లోతునాట్లు వేసి నల్లమందు పేల్చకూడదు. అయితే…ఒకేసారి పెద్ద మొత్తంలో బండను పేల్చడం కోసం లోతుగా నాట్లువేసి నల్లమందు పేల్చుతున్నారు. ఇలా చేయడం వల్ల క్వారీలకు సమీపంలోని ఇళ్లు దెబ్బతింటున్నాయి. పక్కాగృహాల గోడులు కూడా నిలువునా చీలిపోతున్నాయి. బ్లాస్టింగ్‌ సమయంలో రళ్లు ఇళ్లమీద పడుతుండటంతో…ఆయా గ్రామాల ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. తొట్టంబేడు మండలంలోని సాంబయ్యపాళెంలో ప్రభుత్వ పాఠశాల గోడలు ఇలాగే దెబ్బతిన్నాయి. కిటికీలు కూడా విరిగిపోయాయి. ఈ పాఠశాల విద్యార్థులు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఇక నల్లమందు పేల్చడానికి…అనుమతి ఉన్న (లైసెన్సు) వ్యక్తులు అవసరం. అయితే చాలా క్వారీల్లో లైసెన్సు లేని వ్యక్తులతోనే ఈ పనులు చేయిస్తున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

కాలుష్యపు కోరల్లో…: క్వారీల పరిసర ప్రాంతాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నాయి. గాలి, నీరు కాలుష్యం అవుతున్నాయి. ఫలితంగా జనాలు రోగాల బారిన పడుతున్నారు. పలువురు అర్ధాంతరంగా తవువు చాలిస్తున్నారు. ఫ్లోరైడ్‌ కారనంగా పిల్లలు, పెద్దలు ఇబ్బందిపడుతున్నారు. చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చినట్లు తయారవుతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి…: క్వారీల్లో అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ముగినిపోతున్నారు. గనులు, అగ్నిమాపక, రవాణా, పోలీసు శాఖల వారికి క్వారీల నిర్వాహకులు నెలసరి మామూళ్లు సమర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగాలంటే గనుల అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*