తూర్పున సూరీడు…కుప్పంలో చంద్రబాబు!

ఇది తెలుగుదేశం నాయకులు చెబుతున్నమాట. సూరీడు తూర్పునే ఉదయిస్తాడనేది ఎంత సార్వజనీన వాస్తవమో, చంద్రబాబు నాయుడు కుప్పంలోనే పోటీ చేస్తాడనేది కూడా అంతే వాస్తవమని ఆ పార్టీ నాయకులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా చెప్పడం వెనుక కారణాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గడచిన 30 ఏళ్లుగా కుప్పం నుంచే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం మారుతారన్న వార్తలొచ్చాయి. కుప్పంను లోకేష్‌కు కేటాయించి, ఆయన నంద్యాలకు వెళుతారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నాయకులు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్టిపరిస్థితుల్లోనూ కుప్పం నియోజకవర్గాన్ని వీడబోరని నాయకులు చెబుతున్నారు. ఇది ప్రతిపక్షాలు కావాలనే చేస్తున్న దుష్ప్రచారమని అంటున్నారు.

2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న సిఎం తనయుడు లోకేష్‌ కోసం కొంతకాలంగా నియోజకవర్గ అన్వేషణ జరుగుతోంది. కృష్ణజిల్లాలోని గుడివాడ, పెనమలూరు, చిత్తూరు జిల్లాలో కుప్పం, చంద్రగిరి…ఈ నాలుగు నియోజకవర్గాలను పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే…లోకేష్‌ సిఎం అవుతారన్నది బహిరంగ రహస్యం. అప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. అందుకే కుప్పంను లోకేష్‌కు అప్పగించి, చంద్రబాబు తాత్కాలికంగా ఏదైనా నియోజకవర్గంలో పోటీ చేసి, ఆ తరువాత రాజీనామా చేసి, ఏ రాజ్యసభ సభ్యత్వం ద్వారానో ఢిల్లీకి వెళ్లాలన్నది టిడిపి యోచన. ఈ వ్యూహం ఎన్నికలకు ముందే బహిర్గతమైతే….ఆ ప్రభావం పార్టీ గెలుపు ఓటములపై పడే ప్రమాదం ఉంది. సిఎం అభ్యర్థి మారిపోతున్నారంటే ఆలోచనలో పడే అవకాశాలున్నాయి. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే….చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారని చెప్పడం కోసం కుప్పంలోనే పోటీ చేయాలని తుది నిర్ణయానికి వచ్చారు. అందుకే చంద్రబాబు కుప్పం నుంచి ఎక్కడికీ వెళ్లబోరంటూ టిడిపి నాయకులు ప్రచారం చేయాల్సివస్తోంది.

ఇదిలావుండగా లోకేష్‌కు చంద్రగిరి నియోజకవర్గం ఖరారైనట్లే చెప్పాలి. ఎందుకంటే తాను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటంచారు. ‘నేను పోటీ చేయకున్నా…చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రన్నకు కానుకగా అందిద్దాం’ అని గల్లా అరుణ కుమారి బహిరంగ సభల్లో చెబుతున్నారు. ఇక్కడి నుంచి పోటీచేసే లోకేష్‌ను గెలిపించాలన్నదే గల్లా మాటల్లోని అర్థమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*