తెలంగాణకు జడిసి పోతురెడ్డిపాడులో నీటిని తగ్గించేశారా..!

రాయలసీమకు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పేటట్టు లేదు. గత పది సంవత్సరాలుగా ఎప్పుడూ లేని వరద ఈ ఏడు కృష్ణకు వచ్చింది. సీమకు అన్యాయం జరిగిందని భావించిన తెలుగుదేశం హయాంలో కూడా పైగా శ్రీ శైలం జలాశయానికి ఆశించినంత నీరు రాని గత సంవత్సరం కూడా ఆగష్టు 16 వతేది నుండి పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 24 వేల క్యూసెక్కులు రెగ్యులర్ గా విడుదల చేశారు. పైగా ఈ ఏడు లాగా వరద కూడా రాలేదు. గత ఏడు మొత్తంగా శ్రీ శైలం చేరింది – కేవలం 580 టియంసిలే. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 800 టియంసిలు చేరాయి. అయినా జలాశయానికి వరద రాగానే నీరు విడుదల చేయలేదు. 6వ తేదీ నుండి 2 వేలతో ప్రారంభించి తర్వాత 5 వేలతో ఇలా పెంచుకుంటూ పోయి ఒకదశలో అదీ ఒక రోజుమాత్రం 44 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.

ఈ లోపు తెలంగాణ ప్రభుత్వం కృష్ణ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఎపి చెప్పే లెక్కలు టెలిమెట్రీ రికార్డులకు తేడా వుందని, ఎపి ఎక్కువ మొత్తంలో నీరు వాడుకుంటోందని ఫిర్యాదు చేసింది. దీనిపై రాయలసీమలోనే కాకుండా రాష్ట్రం అంతటా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలకూ చేతులకు తేడా వుందని, అంతా కపట నాటకమని, రేపు తెలంగాణతో కలసి నదుల అనుసంధానం జరిగితే తమకు అన్యాయం తప్పదని సీమవాసులు కూడా ఆప్రమత్తమై ప్రకటనలు చేశారు. వరదలు సముద్రంలో కలిసేందుకైనా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించుతుందిగానీ ఎపి ఉపయోగించు కొంటే లెక్కలు ఆరా తీయడంపై అందరూ నిరసనలు తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలియకుండా జరిగిందేమోనని తొలుత కొందరు భావించారు. నేడు అది సరికాదని తేలి పోయింది. తెలంగాణ ఉద్దేశపూర్వకంగా చేసిందని బయట పడింది. ఎపి మీడియాలో అయితే రాలేదు గానీ తెలంగాణ లో టిఆర్ఎస్ పత్రిక” సమస్తే తెలంగాణ” లో శనివారం ఒక వార్త వచ్చింది. తెలంగాణ చేసిన ఫిర్యాదు పై బోర్డు స్పందిస్తూ… క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎపి గుట్టురట్టు చేసిందని, పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తప్పుడు లెక్కలు సీరియస్ గా తీసుకుని ఎపి జలవనరుల శాఖ ఈఎన్సీకి బోర్డు లేఖ రాసినట్లు వార్త వెలువడింది. ఈ వార్తతో పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి వరద వెల్లువెత్తుతున్న సమయంలో కూడా వరద నీరు ఎపి ఉపయోగించుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడటం లేదని తేలిపోయింది.

అయితే తెలంగాణ అభ్యంతరమో లేక మరేదైన కారణం వుందో తెలియదు గానీ ఎపి ప్రభుత్వం పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 44 వేల క్యూసెక్కులు ఒక రోజు విడుదల చేసి తిరిగి క్రమేణా తగ్గించుకుంటూ వచ్చి రెండు రోజులగా కేవలం 20 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. నీటి ఎద్దడి రోజుల్లోనే గత ఏడాది 24 వేల క్యూసెక్కుల రెగులర్ విడుదల చేస్తే ఈ ఏడు శ్రీ శైలం జలాశయం నిండుకుండలాగా వున్నా 20 వేలు మాత్రమే ఎందుకు విడుదల చేస్తున్నారో ప్రభుత్వం నుండి వివరణ లేదు. ఈ లోపు రాజధాని మార్పు మంటలు మొదలైనవి. రాయలసీమలోని యువత మేధావులు… ఇంకా చెప్పాలంటే సీమ ఉద్యమకారులు దృష్టి అంతా సీమలో రాజధాని పై మళ్లింది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో సీమకు సాగునీటి సరఫరాలో జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకొనే వారు లేకపోయారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కర్నూలు రాజధాని గురించి ప్రకటనలు చేస్తున్నారు. తక్షణ సాగునీటి గురించి పట్టించుకోవడం లేదు.

శ్రీ శైలంకు వరద వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు ముచ్చుమర్రి నుండి ఎత్తిపోతలు సాగించి తిరిగి ఆపేశారు. ఈ ఎత్తిపోతలు సాగిస్తే కెసి కెనాల్ కింద రైతులు నీరు అందివ్వవచ్చు. అలగనూరు జలాశయంలో 2.87 టియంసిల నీరు నిల్వ చేయవచ్చు. కానీ శనివారం మధ్యాహ్నం 11 గంటలకు 0.57 టియంసిల నీరు మాత్రమే ఉంది. కెసి కెనాల్ ఆయకట్టు గల నియోజకవర్గాలకు చెందిన నేతలు రాజధాని పై ప్రకటనలు చేస్తున్నారు గానీ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోక పోవడం సీమ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావించాలి.

ఇదిలావుండగా సాగర్ నిండుకుండలాగా వుంది. కిందకు నీరు విడుదల అవసరం లేదు. కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుదుత్పత్తికి శ్రీ శైలం జలాశయం నుండి 38,140 క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేస్తున్నది. వాస్తవంలో సీమ జిల్లాల్లోనే కాకుండా నెల్లూరు జిల్లాలో కూడా పలు జలాశయాలు ఖాళీగా వున్నాయి. వీటన్నింటినీ మించి చెన్నయ్ కి తాగు నీరు సరఫరా చేయవలసి వుంది. 20 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తే ఈ అవసరాలు ఏలా తీర్చుతారో వేచి చూడాల్సిందే.

     - వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*