తెలంగాణలో ఏపి పోలీసుల నిఘా : ఎన్నికల వేళ కొత్త వివాదం!

3D illustration of "POLICE INTELLIGENCE" title on the ground in a police arena

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త వివాదం రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు హైదరాబాద్‌లో మకాం వేసి ఎన్నికల అక్రమాలకు కుట్రలు చేస్తున్నారని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య మళ్లీ వివాదాలు, ఉద్రిక్తతలు సృష్టించే ప్రమాదం కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన జరిగినా…పదేళ్లపాటు అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ నగరం రాజధానిగా ఉంటుంది. ఇది విభజన చట్టంలో చెప్పిన మాట. అయితే…ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నేళ్ల క్రితమే అమరావతికి వచ్చేశారు. పాలనా యంత్రాంగాన్ని అమరావతికి రప్పించారు. హైదరాబాద్‌లో పలు కార్యాలయాలు ఉన్నా…వాటికి తాళాలు వేశారు. ప్రస్తుతం అమరావతి నుంచే పూర్థిస్థాయి పాలన సాగుతోంది.

ఇక్కడ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో జరిగిన పరిణామాలను చర్చించాలి. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు కోసం ఓ ఎంఎల్‌సికి డబ్బులు ఇస్తుండగా…తెలంగాణ పోలీసులో స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా వీడియో సాక్ష్యాలతో పట్టుకున్నారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తనకూ హైదరాబాద్‌లో పోలీసులున్నారని, తనకూ ఇంటలిజెన్స్‌ ఉందని, తానూ హైదరాబాద్‌లో పోలీస్‌ స్టేషన్లు పెడతానని అన్నారు. ఆ తరువాత ఏమయిందోగానీ….వెంటనే పాలనను హైదరాబాద్‌ నుంచి అమరావతికి మార్చేశారు.

ఓటుకు నోటు కేసులో కెసిఆర్‌తో కుదిరిన రాజీలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఉన్నఫలంగా అమరావతికి మారారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల సంగతి ఎలావున్నా….తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఏపి డిజిపి కార్యాలయంలో 100 మందిదాకా ఇంటిలిజెన్స్‌ పోలీసులను నియమించిందని, ఈ పోలీసులు తెలంగాణ గడ్డపై నిఘా వ్యవహారాలకు పాల్పడుతున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఇంటలిజెన్స్‌ పోలీసులకు తెలంగాణలో ఏమి పని అని నిలదీస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచడానికి పోలీసులను ఉపయోగించుకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఏపి పోలీసుల వ్యవహారంపై హిందూ దినపత్రిక కూడా ఓ కథనాన్ని ప్రచురించింది.

ఇప్పుడు చర్చనీయాంశం ఏమంటే….పాలనను పూర్తిగా హైదరాబాద్‌ నుంచి అమరావతికి మార్చిన తరువాత…హైదరాబాద్‌లో ఏపి పోలీసుల అవసరం ఏమటనేదే…? తెలంగాణలో కాంగ్రెస్‌-టిడిపి కలిసి పోటీ చేస్తాయన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ ఎక్కడ ఏమి చేస్తోందో తెలుసుకోడానికి నిఘా పోలీసులను వినియోగిస్తారా అనేది ప్రశ్న. ఏపి నిఘా పోలీసులు హైదరాబాద్‌లో ఉండటం తప్పులేదుగానీ…వారి నిఘా ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలి తప్ప…తెలంగాణలో కాదు. ఏపి పోలీసులు తెలంగాణలో నిఘా వేయడం సరైనది కాదు….రేపు తెలంగాణ పోలీసులు ఏపిలో నిఘావేయొచ్చా…ఇది టిడిఆర్‌ఎస్‌ వాదన.

టిఆర్‌ఎస్‌ అయితే దీన్ని చాలా సీరియస్‌గానే తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిపై ఇంకా స్పందించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలకు అజ్యం పోయకుండా చూడాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపైనా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*