తెలంగాణలో టిడిపికి హోం, ఇరిగేషన్‌ శాఖలు…!

తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పడిన మహా కూటమిలో ఇంకా సీట్లు సర్దుబాటు పూర్తికాలేదుగానీ….మంత్రి పదవుల పంపకం మాత్రం అప్పుడే అయిపోయిందట. మహా కూటమి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి హోం శాఖ, సాగునీటి సారుదల శాఖలను ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించిందట. ఇదే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ప్రధాన ప్రచారాంశంగా ఉంది.

మహా కూటమి పేరుతో కాంగ్రెస్‌, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను ఓడించి, కాంగ్రెస్‌ను అధికార పీఠంపై ప్రతిష్టించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంకణబద్ధులై పని చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ 12 సీట్లకే పరిమితమై పోటీ చేయడానికి సిద్దిపడింది. సీట్లు కాదు….కూటమి గెవడమే ముఖ్యమని తమ పార్టీ శ్రేణులకు చంద్రబాబు హితబోధ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నామినేటెడ్‌ పదవుల అడగవచ్చుని కూడా టి-టిడిపి నేతలకు సర్దిచెప్పారు.

తెలంగాణలో 12 సీట్ల్లలో మాత్రమే టిటిడి పోటీ చేస్తున్నా, అక్కడి ఎన్నికల్లో ఆ పార్టీ చూపుతున్న ఉత్సాహాన్ని గమనించిన టిఆర్‌ఎస్‌ నేతలు….టిడిపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్‌కు రూ.500 కోట్లు చంద్రబాబు నాయుడు సమకూర్చారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే…తమకు హోం శాఖ, నీటి పారుదల శాఖలు ఇవ్వాలని టిడిపి షరతులు పెట్టినట్లు టిఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఓటుకు నోటు కేసు నుంచి బయటపడటానికి హో శాఖ, సాగునీటి ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసుకోడానికి ఇరిగేషన్‌ శాఖను చంద్రబాబు అడిగారని, దీనికి కాంగ్రెస్‌ తలూపిందని టిఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల సభల్లో చెబుతున్నారు. కాంగ్రెస్‌ను అడ్డంపెట్టుకుని తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరి తెలంగాణలో మహా కూటమి గెలుస్తుందా? కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందా? తెలుగుదేశం పార్టీకి హోం, ఇరిగేషన్‌ మంత్రిత్వ శాఖలు లభిస్తాయా? ఇవన్నీ తేలాలంటే డిసెంబర్‌ 11వ తేదీ దాకా ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*