తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) హుషారు!

తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయోగం జరుగుతోంది. దళిత, బహుజనులు, కమ్యూనిస్టులు కలిసి ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) ఈ ఎన్నికల్లో తలపడేందుకు ఉరకలేస్తోంది. తెలంగాణలో దళితులు, గిరిజనులు, బిసిలు కలిస్తే 90 శాతానికిపైగా ఉంటారు. అయినా రాజకీయాల్లో వారికి దక్కుతున్న వాట నామమాత్రమే. అందుకే ఈ వర్గాలను ఏకం చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) – సిపిఎం పూనుకుంది. బిఎల్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సిపిఎంతో పాటు అనేక చిన్నచిన్న రాజకీయా పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత గిరిజన సంఘాలు, బిసి సంఘాలు ఉన్నాయి. ప్రజా యుద్ధనౌక గద్దర్‌, బహుజన మేధావి కంచె ఐలయ్య వంటి ప్రముఖులూ బిఎల్‌ఎఫ్‌తో భుజంభుజం కలిపి అడుగులేస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన బిఎల్‌ఎఫ్‌ తొలి విడతగా 27 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరంతా ప్రజా ఉద్యమాల్లో ఉన్నవారే. ఈ 27 మందిలో ఎస్‌సి-7, ఎస్‌టి-3, బిసి-14, మైనారిటీ-1, ఓసి-2 ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. బిసిలకు మొత్తం 65 సీట్లు కేటాయిస్తామని బిఎల్‌ఎఫ్‌ ముఖ్యనేత తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బిసి ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ ముందుకు తెచ్చారు. గద్దర్‌ కూడా బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను ఓడిస్తామంటూ కాంగ్రెస్‌, టిడిపి కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో కోదండరామ్‌ పార్టీ కూడా ఉంది. ప్రస్తుతానికి సిపిఐ కూడా మహా కూటమితో వెళ్లాలన్న ఆలోచనలో ఉంది. అయినా…బిఎల్‌ఎఫ్‌ అటు టిఆర్‌ఎస్‌తోగానీ, ఇటు మహాకూటమితోగానీ వెళ్లకుండా….నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు ముందుకు తెస్తోంది.

blf list

ఈ కూటమి ఎంత ప్రభావం చూపుతుంది, ఎంత శాతం ఓట్లను తెచ్చుకుంటుంది అనే అంశాన్ని పక్కనపెడితే…భవిష్యత్‌ రాజకీయ సమీకరణలకు బిఎల్‌ఎఫ్‌ నాందీ ప్రస్తావన అవుతుందనడంలో సందేహం లేదు. ఆర్‌.కృష్ణయ్యను గత ఎన్నికల్లోనే టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా…ఆ పార్టీకి పెద్దగా సీట్లు రాలేదని, ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే…గత ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. అప్పట్లో తెలంగాణ భావోద్వాగాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికీ ఉండొచ్చుగానీ…గత ఎన్నికలంతగా లేదు. అందుకే బహుజనులు, దళితులు బిఎల్‌ఎఫ్‌ వైపు ఎంతోకొంత మొగ్గుచూపుతారని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో ఏర్పాటైన బిఎల్‌ఎఫ్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శంగా మారే సూచనలూ కనిపిస్తున్నాయి. పెత్తందారీ అగ్రకుల నాయకత్వంలోని పార్టీల కబంధహస్తాల నుంచి బయటపడటానికి బహుజనలు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ బిఎల్‌ఎఫ్‌ కొత్త ఊపిరిని ఇచ్చేలావుంది. ఈ ఎన్నికల్లో ఒకమోస్తరు ఫలితాలు సాధించినా….ఆ తరువాత బిఎల్‌ఎఫ్‌ చూపబోయే ప్రభావం గణనీయంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*