తెలంగాణలో సిపిఎంతో టిడిపి పొత్తు సాధ్యమా?

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పొత్తులు, సమీకరణలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా చిరకాల శత్రువులైన కాంగ్రెస్‌-టిడిపి కలవడానికీ సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగుతున్నారని, ఆయన తెలంగాణలోని అన్ని పక్షాలనూ ఏకంచేసి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు చేయబోతున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. సిపిఎంను కూడా బాబు ఈ కూటమిలోకి తీసుకొస్తారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎంను తమ కూటమిలోకి తీసుకురావడం చంద్రబాబుకు సాధ్యమేనా?

సిపిఎం రాజకీయాలను సునిశితంగా పరిశీలించే ఎవరికైనా….తెలంగాణలో కాంగ్రెస్‌-టిడిపి కూటమిలో సిపిఎం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండబోదని అర్థమైపోతుంది. దేశ వ్యాపితంగా కాంగ్రెస్‌, బిజెపికి ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిని నిర్మించాలని వామపక్షాలు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేశాయి. నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటివి ఇందులో భాగంగానే ఆవిర్భవించాయి. అయితే ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అవకాశం దొరికనపుడల్లా కాంగ్రెస్‌తోనీ, బిజెపితోగానీ అంటకాగాయి. అందుకే ఇటువంటి పార్టీతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి సాధ్యం కాదని సిపిఎం స్పష్టమైన అభిప్రాయానికి వచ్చింది.

నిలకడైన, నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించడం కోసం ఆయా రాష్ట్రాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బిఎల్‌ఎఫ్‌ (బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌) ఏర్పాటయింది. అనేకమైన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలు ఇందులో ఉన్నాయి. బిఎల్‌ఎఫ్‌ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధపడుతోంది. ఈ పరిస్థితుల్లో సిపిఎం వెళ్లి కాంగ్రెస్‌-టిడిపి కూటమిలో కలిసే సూచనలు ఏమాత్రం లేవు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని సృష్టించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిపిఎం, సిపిఐ, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, జనసేన వంటి పార్టీలతో ఇటువంటి కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ టిడిపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వైసిపితో జత కట్టాలని చాలామంది కోరుకున్నా…వామపక్షాలు మాత్రం మూడో ప్రత్యామ్నాయం దిశగానే అడుగులు వేస్తున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే…ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో తెలుగుదేశంతో సిపిఎం జత కట్టే అవకాశమే లేదని తేలిపోతుంది. చంద్రబాబు ఎంత చాణిక్యుడైనా, ఆయన అవకాశవాద వ్యవహారం ఏమిటో తెలిసిన సిపిఎం ఆయన పార్టీ పొత్తుల్లోకి వెళ్లే అవకాశాలు లేవు. అయినా కెసిఆర్‌కు, చంద్రబాబుకు తేడా ఏముంది? కెసిఆర్‌ బిజెపి కనుసన్నల్లో నడుస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారుగానీ….ఆ బిజెపిని నిన్నటిదాకా మోసింది చంద్రబాబే…మళ్లీ అవసరమైతే బిజెపిని నెత్తికెత్తుకోడానికి చంద్రబాబు వెనుకాడరు…ఇదీ వామపక్షాల అభిప్రాయం. దీన్నిబట్టే తెలంగాణ ఎన్నికల పొత్తులు ఎలావుంటుందో అర్థం చేసుకోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*