తెలంగాణ టిడిపి నేతల ఆశలపై చంద్రబాబు నీళ్లు!

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నామమాత్రం అయిపోయింది. గత ఎన్నికల్లో గెలిచిన ఒకరిద్దరు కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూలమ్మినచోటే కట్టెలు అమ్మిన చందంగా ఉంది. అధికార దర్పం ప్రదర్శించి చోటే…బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, టిడిపి పొత్తు పెట్టుకుంటాయన్న వార్తలు వచ్చాయి. అదేవిధంగా కెఆర్‌సి ఇటీవల కాలంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కొత్త అజెండా ఎత్తుకున్నారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించడమేగాక….ఇందుకోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. బెంగుళూరు వెళ్లి దేవెగౌడతో చర్చించారు. చెన్నై వెళ్లి స్టాలిన్‌తో మాట్లాడారు. అఖిలేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌ వచ్చినపుడు ఆయనతో భీటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వామపక్షాలతోనూ మాట్లాడుతానని ప్రకటించారు. ఈ ప్రకటన తెలంగాణ తెలుగుదేశం నాయకుల్లో కొండంత ఆశలు రేపుతున్నాయి. ఫ్రంట్‌ ఏర్పడితే…వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పొత్తతో కాస్తయినా నిలబడవచ్చని ఆశిస్తున్నారు. అయితే…వాళ్ల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లేశారు. తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశమైన ఆయన కెసిఆర్‌ ఫ్రంట్‌ ప్రస్తావన వచ్చినపుడు ‘ఫ్రంటూ లేదు…ఏమీ లేదు. వాళ్ల పార్టీలో అంతర్గత సమస్యల వల్లే కెసిఆర్‌ ఏదో మాట్లాడుతున్నారు’ అని తేలిగ్గా తీసిపారేశారు. దీంతో తెలంగాణ టిడిపి నేతలు ఉసూరుమంటూ వెనుదిరిగారు.

కెసిఆర్‌ ఫ్రంట్‌ గురించి చంద్రబాబు నిజంగానే తేలిగ్గా తీసుకుంటున్నారా? ఇది అంత తేలిగ్గా చెప్పే అంశం కాదు. తెలంగాణలో చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. కేంద్రంలో బిజెపిని దృష్టిలో ఉంచుకుని బద్ధ శత్రువైన కాంగ్రెస్‌కు టిడిపి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం టిడిపి నేతలు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. కెసిఆర్‌ ఏమో కాంగ్రెస్‌, బిజెపి వ్యతిరేక ఫ్రంట్‌ అంటున్నారు. తెలంగాణలో కాగ్రెస్‌ పార్టీనే కెసిఆర్‌కు ప్రథమ శత్రులు. కాంగ్రెస్‌ ఎదుర్కోడానికే ఫ్రంట్‌ ఎత్తుగడ వేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కెసిఆర్‌ చెబుతున్న ఫ్రంట్‌ వెనుక మోడీ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. కాంగ్రెస్‌ను తిరిగి కోలుకోనీకుండా చేయడనికే మోడీ కెఆర్‌సిఆర్‌ను ముందుపెట్టి నడిపిస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో కెసిఆర్‌కు కాంగ్రెస్‌ ముఖ్యమైన శత్రువైనా…. ఆంధ్రప్రదేశ్‌లో బాబుకు ఆ పార్టీ అంతటి ప్రత్యర్థి ఏమీ కాదు. అందుకే కెసిఆర్‌ ఫ్రంట్‌ను తేలికగా తీసిపారేసినట్లు మాట్లాడివుంటారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే అటు తెలంగాణలోను, ఇటు ఏపిలోనూ టిడిపికి ప్రయోజనం. టిఆర్‌ఎస్‌తో ఉంటే ఏపిలో కాంగ్రెస్‌తో అవగాహనకు అవకాశం ఉండదు. టిఆర్‌ఎస్‌తో పొత్తువల్ల ఏపి ఒక్క ఓటు కూడా టిడిపికి రావు. కెసిఆర్‌తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఇక టిడిపి బలపడే అవకాశమే లేదు. ఏ విధంగా చూసినా కెసిఆర్‌ ఫ్రంట్‌లో చేరడం బాబుకు నష్టమే తప్ప లాభం లేదు. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఫ్రంట్‌ పేరుతో కెసిఆర్‌ తనను కలవాల్సిన వసరం లేదన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడ్డాక కాంగ్రెస్‌తో పొత్తు వ్యవహారాన్ని బహిర్గతం చేసే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*