తెలుగుగంగకు మంత్రి సోమిరెడ్డి మోకాలడ్డు…

ఈ ఏడు కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల రైతుల కడుపుకొట్టి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమశిలకు శ్రీ శైలం నుండి 51 టియంసిలు నీరు తరలించారు. శ్రీ శైలం నుండి 115 టియంసిలు వస్తే అందులో 51 టియంసిలు తరలించారు. కడప కర్నూలు జిల్లాలకు ఆవిరి పారుదల నష్టం పోగా మిగిలినవి-కేవలం 60 టియంసిలు. ఇందులో నికర జలాలు 29 టియంసిలు లు పోగా 30 టియంసిలు మాత్రమే మిగులు జలాలు. అదీ రెండు జిల్లాలకు. ఒక్క నెల్లూరు జిల్లా కు ఏకంగా 51 టియంసిలు ఇచ్చారు. ఇందులో నుండి చిత్తూరు జిల్లాకు నీరు సరఫరా కు మంత్రి సోమిరెడ్డి అనుమతి కావాలట.
ఆగస్టు 15 వతేదికి 17 టియంసిలు సోమశిల లో వుండగా మొత్తం 68 టియంసిలు నెల్లూరు జిల్లాకే వాడారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో టిడిపికి వ్యతిరేక గాలి వుందని అందుకోసం ముఖ్యమంత్రి మంత్రి సోమిరెడ్డి కలిసి ఈ నాటకం ఆడారని ప్రచారంలో వుంది.తెలుగు గంగలో భాగమెన చిత్తూరు జిల్లా ఆయకట్టు గురించి ముఖ్యమంత్రి కూడా పట్టించు కోలేదు.
తెలుగు గంగ పథకంలో భాగంగా చిత్తూరు జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అధికారయుతంగా  ఇవ్వాలి. అయితే తెలుగు గంగ పేరుతో సోమశిలకు తెచ్చుకున్న నీరు తొలి నుండి కూడా ఒక చుక్క ఇవ్వలేదు. జనవరి 15 వతేదికి సోమశిలలో 23 టియంసిలు కండలేరు లో 12 టియంసిలు నీరు వుంది. అయితే చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి సత్య వేడు నియోజకవర్గాలలో దాదాపు లక్ష ఎకరాల్లో కోతకు వచ్చే దశలో పంట వుంది. చెరువులో నీరు లేదు. బోర్లు వట్టి పోయాయి. ఈ దశలో కండలేరులో వుండే 12 టియంసిల నుండి రెండు టియంసిలు ఇస్తే కోట్లాది రూపాయలు విలువ గల పంట రైతుల చేతికి వస్తుందని ఎంత మొత్తు కున్నా అధికారులలో చలనం లేదు. తుదకు మాజీ ఎమ్మెల్యే యస్ సి వి నాయుడు మంత్రి ఉమ మహేశ్వర రావు అభ్యర్థించారు. ఆ పైన మంత్రి ఇంజనీరింగ్ ఛీఫ్ కు ఆదేశాలు ఇచ్చారు.
గమనార్హమైన అంశమేమంటే ఇంజనీరింగ్ చీఫ్ చెప్పినా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమతి లేనిదే నీళ్లు వదిలేది లేదని యస్ ఇ చెప్పారని ప్రచారం లోవుంది.ఇంత ఘోరం మరొకటి వుంటుందా?
ఆ యస్ ఇ కి ఇంజనీరింగ్ చీఫ్ అన్నా జలవనరుల శాఖ మంత్రి అన్నా లెక్కా లేదు. జిల్లాలో మంత్రి అండ వుంటే చాలని భావిస్తున్నారు. . తుదకు నామ మాత్రంగా నీరు వదిలి చేతులు దులుపు కున్నారు. మంత్రి సోమిరెడ్డి కనుసన్నలలో వుండే యస్ ఇ.  జలవనరుల శాఖ ఆదేశాలు పక్కన బడేశారంటే ఏమని భావించాలి?
ఆఖరున యస్ సి వి నాయుడు ముఖ్యమంత్రిని నేరులో కలసి మెమోరాండం ఇచ్చి రైతులలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని వెంకటగిరి సుళ్ళూరు పేట శ్రీ కాళహస్తి సత్య వేడు నియోజకవర్గాలో ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు తప్పవని చెప్పిన తర్వాత అది కూడా 800 క్యూసెక్కుల నీరు వదల తారని వార్తలు వచ్చాయి. దురదృష్టకరమేమంటే నెల్లూరు జిల్లా కోసం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర నాధ రెడ్డి గాని ఎమ్మెల్యేలు పట్టించుకోక పోవడమే.
– వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*