తొండి ఆడేది…గెలిపించేది గరవ్నర్లే! కర్నాటక గవర్నర్‌ ఏం చేస్తారో?

ఎన్నికల్లో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే ఫర్వాలేదుగానీ…ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ రానపుడు…ఓట్లు వేసిన ప్రజలతో నిమిత్తం లేకుండా తమకు నచ్చిన వారిని (తనను నియమించిన పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూరేలా) గెలిపిస్తుంటారు. ఇందుకోసం నిబంధనలకు తనకు తోచిన భాష్యం చెప్పుకుని తొండి ఆట ఆడుతుంటారు. ఇప్పుడు కర్నాకట గవర్నర్‌ ఎలాంటి ఆట ఆడుతారనేదాని బట్టే ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయం కానుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 113 స్థానాలు కావాలి. బిజెపికి 104 వచ్చాయి. కాంగ్రెస్‌ 78కి పరిమితం అయింది. జెడిఎస్‌కు 38 స్థానాలు వచ్చాయి. ఇతరులు ఇద్దరు గెలిచారు. ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. ఇలాంటప్పుడే గవర్నర్‌ కీలక పాత్ర పోషిస్తుంటారు. వాస్తవంగానైతే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. కొంత గడువు ఇచ్చి బల నిరూపణ చేసుకోమని చెప్పాలి. అయితే ఇప్పుడు సీన్‌ మారింది. జెడిఎస్‌కు బేషరతుగా మద్దతిస్తానని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కాంగ్రెస్‌ కోరుతోంది. ఇద్దరికీ కలిపితే 116 స్థానాలు ఉంటాయి. స్వతంత్రలు ఇద్దరూ కూడా జెడిఎస్‌కే మద్దతు ఇస్తామంటున్నారు. అంటే బలం 118 అవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై బలం కంటే 5 స్థానాలు ఎక్కువే ఉన్నాయన్నమాట. ఇప్పుడు గవర్నగర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవర్ని ఆహ్వానిస్తారనేదాని బట్టి రాజకీయాలు ఉంటాయి.

సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ పేరుతో బిజెపిని ఆహ్వానిస్తే…రాత్రికి రాత్రి బలాబలాలు మారిపోయే ప్రమాదం ఉంటుంది. సహజంగానే గోడదూకే వాళ్లు ఉంటారు. మంత్రి పదువులు ఇస్తామని ఆశచూపో, డబ్బులు ఎరవేసో ఎదుటి పక్షం సభ్యులను లాగేసే అవకాశాలుంటాయి. కర్నాకట గవర్నర్‌ వజూభాయ్‌ బిజెపి నాయకుడే. అందులోనూ గుజరాత్‌ వాలా. ఆ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గానూ పని చేశారు. మోడీనే ఆయన్ను గవర్నర్‌గా తీసుకొచ్చారు. తనకు పదవి ఇచ్చిన బిజెపి రుణం తీర్చుకోవాలంటే బిజెపినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించే అవకాశాలున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా వెళదామనుకుంటే…జెడిఎస్‌ను ఆహ్వానించాలి. కాంగ్రెస్‌, జెడిఎస్‌లు ముందుగా గవర్నర్‌ను కలవకుంటే…సహజ సూత్రాలను అనుసరించి అతి పెద్ద పార్టీ అయిన బిజెపిని పిలవడానికి అవకాశం ఉండేది. ఇలాంటిది జరుగుతుందని అంచనా వేసి వేగంగా కదిలిన కాంగ్రెస్‌, జెడిఎస్‌ గవర్నర్‌ను కలిసి…తమ బలం ఏమిటో తెలియజేశాయి. ఇప్పుడు అనివార్యంగా జెడిఎస్‌కే అవకాశం ఇవ్వాలి.

అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తిన ప్రతిసారీ గవర్నర్లు తొండి ఆట ఆడుతూనే ఉన్నాయి. అంతెందుకు…మొన్న తమిళనాడు వ్యవహారాలనే చూస్తే, మొత్తం డ్రామాకు గవర్నరే కేంద్రబిందువయ్యారు. శశికళను తమ పార్టీ శాసనసభా నాయకురాలిగా ఎన్నుకుని గవర్నర్‌ వద్దకు వెళితే…ఆయన దాన్ని నానబెట్టారు. ఆమెపైన కేసులున్నాయని, తీర్పు వస్తుందంటూ దాదాపు 15 రోజులు ఎటూ తేల్చలేదు. కోర్టు తీర్పు వస్తుందని ఆయనకు ఎలా తెలుసో తెలియదు. ఆఖరికి కోర్టు తీర్పు వచ్చింది. ముఖ్యమంత్రి కావాల్సిన శశికళ జైలుకు వెళ్లారు. ఆమె అన్నాడిఎంకె శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యే సమయానికి తీర్పు రాలేదు. అంటే ఆ క్షణానికి ఆమె దోషికాదు. అయినా కోర్టు తీర్పు నెపంతో హైడ్రామా నడిపి, ఆఖరికి బిజెపి చెప్పుచేతల్లో ఉండే పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠపైన కూర్చోబెట్టారు. గరవ్నర్లు తొండి ఆట ఆడిన ఘటనలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. కేరళలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని (కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని) గవర్నర్‌ను అడ్డుపెట్టుకునే రద్దు చేశారు. మన రాష్ట్రంలో ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి పీఠం దించి, నాదేండ్ల భాస్కర్‌రావును ఎక్కించడంలో అప్పటి గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి బంటులాగా పని చేశారు. మొన్న గోవాలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటంలోనూ గవర్నర్‌ వివాదాస్పద నిర్ణయం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఉన్నా, కాంగ్రెస్‌ ఉన్నా గవర్నర్లను ఇలాగే ఉపయోగించుకుంటున్నాయి. కర్నాటకలోనూ అంత సజావుగా కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని అనుకోలేం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*