తొలి అవార్డును త్యాగం చేసిన దేవ‌ర‌కొండ విజ‌య్‌!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవ‌ర‌కొండ విజ‌య్‌….త‌న తొలి అవార్డును ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోసం త్యాగం చేసిన తీరుపై స‌ర్వత్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. సాధార‌ణంగా తొలి అవార్డును భద్రంగా దాచుకుంటారు. ఆయ‌న త‌న అవార్డును ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. 65వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో అర్జున్‌ రెడ్డి చిత్రానికి విజయ్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు(సీఎంఆర్‌ఎఫ్‌) ఇవ్వనున్నట్టు విజయ్‌ ట్వీట్‌ చేశారు. ‘నేను ఈ అవార్డు గెలిచాను. నేను ఏదైతే చేయాలో అది చేసినప్పుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పుడు, ఇండస్ట్రీ నుంచి గౌరవంతో పాటు డబ్బులు పొందినప్పుడు గెలిచినట్టు అనిపించింది. అమ్మ నాన్నకు సొంతిల్లు కొనిచ్చినప్పుడు, అందరు నాపై ప్రేమ కురిపించినప్పుడు గెలిచినట్టు అనిపించింది. నాకు ఈ అవార్డు ఒక బోనస్‌ లాంటింది. దీన్ని ప్రభుత్వం అంగీకరిస్తే సీఎంఆర్‌ఎఫ్‌కు సోమవారం వెళ్లి ఇచ్చేస్తా.. నా ఇంట్లో ఉండటం కంటే నేను పుట్టిన నగరానికి ఇది ఉపయోగపడటం కావాలి. రోజు ట్విటర్‌లో చూస్తుంటా కేటీఆర్‌ అన్న సాయం అడిగిన ఎంతో మందికి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి సాయం చేస్తూ ఉంటారు. నా అవార్డును వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బులు వారు వాడుకోవచ్చు. దీంతో నా తొలి అవార్డుకు గుర్తింపు దక్కుతుంది. ఇది ఎలా జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది కమిట్‌ అయ్యా. దీన్ని సాకారం చేయడానికి కృషి చేస్తాను’ అని విజయ్‌ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘విజయ్‌ నువ్వు ఫిలింపేర్‌ అవార్డు అందుకున్నందుకు శుభాకాంక్షలు. సీఎంఆర్‌ఎఫ్‌కు సాయం చేయడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందం కల్గించింది’అని ట్వీట్‌ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*