దళితులు మీ భుజాలపై ఎక్కాలనుకోవట్లేదు…గుళ్లోకిరాస్తే చాలు

చిలుకూరు దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్‌ ఓ దళిత భక్తుడిని తన భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లారు. ‘ముని వాహన సేవ’ పేరుతో నిర్వహించిన ఈ కర్యక్రమంపై దేశ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. దళితులను అంటరానివారిగా చూస్తే, ఇప్పటకి అనేక రూపాల్లో వివక్షకు గురవుతున్నారు. ఆలయంలోకి వెళ్లేవీల్లేదు. అందరితో సమానంగా కూర్చునే అవకాశం లేదు. మంచి దుస్తులు వేసుకునే భాగ్యం లేదు….ఇలా ఎన్నో రూపాల్లో వివక్ష కొనాసాగుతోంది. వివక్షను రూపుమాపేందుకు ఎన్నో చట్టాలున్నాయి. ఏవీ పని చేయడం లేదు.

ఈ నేపథ్యంలో రంగరాజన్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ముని వాహన సేవ కార్యక్రమం అందరి దృష్టినీ ఆకర్షించింది. వాస్తవంగా ఇది ఈ నాటి కార్యక్రమం కాదట….2700 సంవత్సరాల క్రితం తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథ స్వామి దేవాలయంలో జరిగింట. తిరుప్పాణాళ్వార్‌ అనే దళిత భక్తుడు శ్రీరంగంలోని దేవుణ్ని కీర్తిస్తూ కావేరి ఒడ్డున కూర్చుని పాటలు (పాశురాలు) పాడే వారు. అతను దళితుడు కావడంతో గుడిలోపలికి రాకుండా బయటే పాటలు పాడేవారు. ఆ గుడికి ప్రధాన అర్చకుడిగా ఉన్న లోకసారంగుడు.. కావేరి నదికి వచ్చినపుడు, తన్మయత్వంలో ఉన్న తిరుప్పాణాళ్వార్‌ పాటలు పాడుతూ కనిపిస్తాడు. లోకసారంగుడు వచ్చినా అతను పక్కకు తప్పుకోడు. దీంతో అతణ్ని పక్కకు తొలగమనడానికి లోకసారంగుడు రాయితో కొడతాడు. తిరుప్పాణాళ్వార్‌కి దెబ్బ తగిలి రక్తం వస్తుంది, అతను తేరుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే రంగనాథుడి తల నుంచి రక్త కారుతుంటుందట. దీంబతో తప్పు తెలుసుకుని…ఆ దళిత భక్తుడిని తన భుజాలపై మోసుకుని ఆలయంలోకి తీసుకెళ్లాడట. ఇది జరిగిందా..లేదా అనేది పక్కనపెడిగే….ఇప్పుడు చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ ముని వాహన సేవ నిర్వహించాల్సిన అవసరం వచ్చిందంటే…అప్పటికీ ఇప్పటికీ దళితుల పట్ల వివక్ష మారలేదనే కదా.

దళితులు తాము బ్రాహ్మణుల భుజాలపైన ఎక్కాలని కోరుకోవడం లేదు. అందరితో పాటు తమనూ ఆలయంలోకి రప్పిస్తే చాలని ఆశిస్తున్నారు. అందరితో పాటు తమనూ చదువుకోనిస్తే చాలని భావిస్తున్నారు. ఇప్పటికీ వేదం చదుకునే అవకాశం దళితులకు లేదు. అవకాశాలున్నాయని చెబుతున్నా….అవన్నీ ఉత్తిమాటలే.

దళితుల్లో చైతన్య పెరుగుతోంది. ప్రశ్నిస్తున్నారు. ఎదురుతిరుగుతున్నారు. ఆఖరికి వివక్షతో కూడుకున్న హిందూ మతమే తమకు వద్దనుకుని ఇతర మతాల్లోకి వెళ్లిపోతున్నారు. అంబేద్కర్‌ కూడా బౌద్ధం తీసుకున్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక దళితుల పట్ల వివక్ష మరింత తీవ్రమయింది. దళితులు తినే ఆహారంపైనా ఆంక్షలు విధించే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అలజడి బయలుదేరుతోంది. ఇవన్నీ గమనించిన రంగరాజన్‌ వంటి వాళ్లు…హిందూమతంలో ఉద్ధీపనం తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. వ్యక్తిగతంగా ఆయన్ను అభినందించాలి. అయితే…ఇది సరిపోతు….టిటిడి వంటి ఆలయాలే, ఈ దేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న మఠాలు చొరవ తీసుకుని హిందూమతంలోని వివక్షను అంతం చేయడానికి ప్రయత్నించాలి. అంతటితో సరిపోదు మతఛాందసులకు దూరంగా జరిగి, నిజమైన హిందూమతం అంటే ఏమిటో అందరికీ తెలిసేలా వ్యహరించాలి. అప్పుడే ‘ముని వాహన సేవ’కు ఫలితం దక్కుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*