దళిత ఉద్యమంలో ‘పులి’కేక!

తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమాలు వెనకపట్టు పడుతున్నాయని, కొందరు నాయకులు రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో ఉద్యమాన్ని పాలక పార్టీలకు తాకట్టుపెడుతున్నారని ఆవేదన తీవ్రమవుతున్న తరుణంలో…తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమం…సామాజిక ఉద్యమాల ఉధృతిని కోరుకుంటున్న వారిలో కొత్త ఆశలను చిగురింపజేసింది. నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఎస్‌సి, ఎస్‌సి అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ చట్టాన్ని పరిరక్షించుకోడానికి చేపట్టిన ఉద్యమంలో భాగంగా…విముక్త చిరుతలై కట్చి (విసికె) పార్టీ ఆధ్వర్యంలో ‘పొలికేక’ పేరుతో నిర్వహించిన సభ విజయవంతమయింది. మహతి సభా మందిరంలో జరిగిన సభకు వందలాది దళిత మేధావులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తరలివచ్చారు. తిరుపతిలో దళిత ఉద్యమానికి సంబంధించి ఇంత పెద్ద సభ జరగడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం అని చెప్పారు. తమిళనాడుకు చెందిన విసికె పార్టీ నేత, మాజీ ఎంపి తిరుమావలవన్‌ తిరుపతికి వచ్చి ఇంతటి సభను నిర్వహించడం ఆశ్చర్యపరచింది. ఇదే పార్టీ కొన్ని నెలల క్రితం మదనపల్లెలోనూ ఇటువంటి సభనే నిర్వహించింది. అయితే దానికి పెద్దగా ఫోకస్‌ రాలేదు. తిరుపతిలో పెద్దపెద్ద దళిత నేతలున్నా ఇటువంటి సభ నిర్వహించిన దాఖలాలు లేవు. విముక్త చిరుతలై కట్చి అంటే విముక్తి కల్పించి పులుల పార్టీ అని అర్థం. ‘పొలికేక’ పేరుతో నిర్వహించిన ఈ సభ తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమానికి ‘పులికేక’గా చెప్పాలి.

బిజెపి రూపంలో మనువాదులు ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి…లౌకికవాదంపైన, రాజ్యాంగంపైన దాడికి దిగుతున్న నేపథ్యంలో ఎస్‌సి, ఎస్‌టి చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో దేశంలోని 40 కోట్ల మంది దళితుల రక్షణకు ముప్పుముంచుకొస్తోంది. మనువాదులను ఎదుర్కోకుంటే దళిత, బడుగు, బలహీనవర్గాలకు మనుగడ లేదు. ఇది లాల్‌-నీల్‌ ఐక్యతతోనే సాధ్యమని ఆచరణలో రుజువవుతోంది. దీన్ని తిరుమావలన్‌ గుర్తించారు. దేశంలో దళితులకు అండగా ఉంటున్నది వామపక్షాలేనని ఆయన ఈ సభలో పదేపదే చెప్పారు. ఈ సభకు సిపిఐ, సిపిఎం రాష్ట్ర నేతలను ఆహ్వానించారు. మదనపల్లెలో నిర్వహించిన సభకూ ఈ రెండు పార్టీల నేతలూ హాజరయ్యారు. వాస్తవంగా తిరుపతి సభకు ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ కూడా హాజరుకావాల్సింది. అనారోగ్యం వల్ల ఆఖరు నిమిషంలో ఆయన రాలేకపోయారు. మదనపల్లె సభలో గద్దర్‌ పాల్గొని ప్రసంగించారు. లాల్‌-నీల్‌ ఐక్యత నినాదానికి ఇది ఆచరణ రూపమన్నమాట. త్వరలో వామపక్షాల ఆధ్వర్యంలో రాజమండ్రిలో దళిత, గిరిజన భారీ సభ నిర్వహించనున్నారు.

తాను ఆంధ్రప్రదేశ్‌కు చుట్టపుచూపుగానో అతిథిగానో రాలేదని, ఇక్కడి దళితులకు తోడుగా అండగా ఉండేందుకే వచ్చానని తిరుమావలవన్‌ ప్రకటించారు. విసికె ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ప్రచార ఉద్యమం చేపట్టనున్నట్లు తిరుమావలవన్‌ ప్రకటించారు. కేంద్రం ఎస్‌సి, ఎస్‌టి చట్టాన్ని నీరుగార్చుతుంటే దానికి వ్యతిరేకంగా ఉత్తర భారత దేశం భగభగా రగిలిపోయినా….దక్షిణ భారత దేశంలో అంత స్పందన లేదని అన్నారు. అందుకే దళిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ దళిత ఉద్యమాలను ఉరకలెత్తించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సభలో మాట్లాడిన సిపిఎం కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ….ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా తమ పార్టీలు అక్కడ ఉంటాయని ప్రకటించారు. సెల్‌ఫోన్‌ ద్వారా మాట్లాడిన గద్దర్‌….ఓట్ల విప్లవం రావాలన్నారు. మన ఓట్లు మనమే వేసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లలోనైనా దళితులు, పేదలు గెలవాలని పిలుపునిచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీం ఇచ్చిన తీర్పు అమలు కాకుండా తక్షణం ఆర్డినెన్స్‌ తేవాలని సభ డిమాండ్‌ చేసింది. అదేవిధంగా ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని నాయకులు కోరారు.

రాష్ట్రంలో లౌకిక ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని, వచ్చే ఎన్నికల్లో ఇటువంటి శక్తులతోనే కలిసి పని చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి. వామపక్షాలు, దళిత గిరిజన, బహుజన సంఘాలు, పార్టీలు ఒకతాటిపైకి వచ్చి పోటీచేస్తే భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేసినట్లు అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) ఏర్పాటయింది. 2019 ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బిఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని నేతలు ప్రకటించారు. అటువంటి ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగాలి. అందులో విసికె వంటి పార్టీలూ కలవాలి. అప్పుడే ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చడానికి, బహుజనుల చేతుల్లోకి తీసుకోడానికి మార్గం ఏర్పడుతుంది. ఏమైనా తిరుపతిలో నిర్వహించిన సభ ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమాలకే కాకుండా కొత్త రాజకీయాలకూ ఊతమిస్తుందనడంలో సందేహం లేదు.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*