దేవేంద్ర రెడ్డి గారూ…టిటిడి అప్రతిష్టపాలైనా ఫర్వాలేదా…! సమాచారం ఇచ్చే తీరిక లేదా..!!

ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుని‌ ఆస్తులు అమ్మేస్తోందని కొన్ని‌ రాజకీయ పక్షాలు దుష్ర్పచారం చేస్తున్నా…దానికి తగిన రీతిలో జవాబు ఇవ్వడానికి కూడా టిటిడిలోని కొందరు అధికారులు చొరవ చూపడం లేదు.‌ ఇటువంటి ప్రచారాన్ని అడ్డుకోడానికి‌ ఎం చేయాలో కూడా ఆలోచించడం లేదు. మీడియా ప్రతినిధులు ఎవరైనా చొరవ తీసుకుని ఫలానా సమాచారం కావాలని అడిగినా ఇచ్చే ఓపిక, తీరిక లేదు.

టిటిడి ఆస్తులకు సంబంధించి పూర్తి సమాచారం ఎస్టేట్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. దేశ వ్యాపితంగావు ఉన్న టిటిడి స్థలాలు అనేక చోట్ల అన్యాక్రాంతం అయ్యాయి. దీంతో టిటిడి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలోనే చిన్నచిన్న ఆస్తులను విక్రయించాలని భావించింది. అయితే దీనిపై రాజకీయ దుమారం టిటిడి రేగడంతో వెనక్కి తగ్గింది.

ఈ పరిస్థితుల్లో టిటిడి ఎస్టేట్ విభాగం సరైన రీతిలో వ్యవహరించివుంటే ఈ పరిస్థితి‌ వచ్చేది కాదు. టిటిడి ఆస్తులను ఎందుకు విక్రయించాలనుకుందో, ఇప్పటికే‌ స్వామివారి ఆస్తులు అన్యాక్రాంతమై టిటిడి‌ ఎన్ని అవస్థలు పడుతోందో…ఈ పూర్వరంగం మొత్తం ఎస్టేట్ విభాగం మీడియాకు చెప్పి వుంటే…భక్తులు, ప్రజలు అర్థం చేసుకుని ఉండేవారు. టిటిడి తీసుకున్న నిర్ణయం సరైనదేనని సమర్ధించే వారు. ఎస్టేట్ అధికారిగా ఉన్న దేవేంద్ర రెడ్డి ఆ పని చేయలేదు.

ఈ సమాచారం కోసం ధర్మచక్రం మూడు రోజులుగా ఆయన వెంటపడుతోంది. అయినా సమాచారం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఇటువంటి సమయంలో, టిటిడి నిర్ణయాన్ని బలపరిచే సమాచారాన్ని దాచిపెట్టుకోవడం వల్ల జరిగే నష్టం ఎవరికో అధికారులకు అర్థమైనట్లు లేదు. టిటిడి పరువును, తమకు టిటిడిలో కొలువు కట్టబెట్టిన ప్రభుత్వ ప్రతిష్టను కాపాడాలన్న తాపత్రయం ఉంటే ఇలా చేస్తారా అనేది ప్రశ్న. ఇప్పటికైనా టిటిడి ఎస్టేట్ విభాగం సరైన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. అన్యాక్రాంతమైన టిటిడి ఆస్తులను రక్షించుకోడానికి చేస్తున్న కృషిని బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. దానివల్ల టిటిడిపై భక్తుల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. అదేవిధంగా కొందురు చెస్తున్న అసత్య ప్రచారానికి తెరపడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*