దొడ్డిదారిలో శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశం…టిటిడిలో ఇదో చేతివాటం..!

బుట్ట పండ్లు ఇస్తే చాలు మ‌హాద్వార ప్ర‌వేశం
– ప‌ర‌దాలు ఇచ్చేవ్య‌క్తికీ అరుదైన గౌర‌వం
– ఈ తంతులోని ర‌హ‌స్యం ఏమిటి?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే…ఎంతటి వారైనా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాల్సివుటుంది. దేశ ప్రధాన, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, గవర్నలర్లు, ముఖ్యమంత్రులు, కొందరు మతాధిపతులు మాత్రమే మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి…స్వామిని దర్శించుకునే వీలుంది. కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన వారైనా క్యూకాంప్లెక్స్‌ నుంచి వెళ్లాల్సిందే.

అయితే…మహద్వార ప్రవేశానికి దొంగదార్లు కనిపెట్టారు కొందరు టిటిడి అధికారులు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి….కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఏడాదికి నాలుగు పర్యాయాలు పరదాలు (తెరలు) బహూకరిస్తుంటారు. వీటి విలువ మూడు నాలుగు వేల రూపాయలు ఉండొచ్చు. అటువంటి వ్యక్తికి మహద్వార ప్రవేశం కల్పించారు. శ్రీవారికి కోట్ల రూపాయల కానుకలు ఇచ్చిన వారంతా క్యూలో వెళితే…ఈయన గారు మాత్రం మహద్వార ప్రవేశం చేయడమేగాదు కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం సేవలో పాల్గొని, హడావుడి చేస్తుంటారు. ఆయనతో పాటు ఇంకో వ్యక్తికి కూడా ఆలయ ప్రవేశ అవకాశం కల్పించడం మరీ విడ్డూరం.

అదేవిధంగా…చెన్నైకి చెందిన ఓ వ్యక్తి వారంవారం పండ్లు, ఫలాలు సమర్పిస్తుంటారు. వీటి విలువ వేల రూపాయల్లో మాత్రమే ఉంటుంది. ఆయనకు కూడా నెలకు నాలుగు సార్లు…మహాద్వార ప్రవేశం కల్పించారు. ఆయన కార్లో పండ్ల బుట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయట. శ్రీనివాసునికి ఎన్ని బుట్టల పండ్లు ఇస్తున్నారోగానీ….ఆలయంలో పనిచేసే ముఖ్యమైన అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే పండ్ల బుట్టలు బాగానే అందిస్తారట. అందులోనూ….అరుదైన విదేశీ ఫలాలు కూడా బుట్టలో ఉంటాయి…ఇంకేముందీ… వాటిని హాయిగా ఆరగిస్తున్నారు. ఈ ఆరగింపులో ఆయన గారి మహాద్వార ప్రవేశం అక్రమమా సక్రమమా అని పట్టించుకున్నవారు లేరు.

ఇంకా కర్నాటకకు చెందిన కొందరు ఊరూపేరూ లేని వారికీ మఠాధిపతుల పేరుతో మహాద్వార ప్రవేశం, స్వాగత మర్యాదలు వంటివి గడచిన్న కొన్ని ఏళ్లలో ఏర్పాటు చేశారట. మఠాధిపతుల పేరుతో జరిగినా, దాతల పేరుతో జరిగినా మహాద్వార ప్రవేశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగివుంటాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇంకా ఎవరెవరికి ఈ విధమైన మహాద్వారా ప్రవేశ భాగ్యాన్ని కల్పించారో తెలియదుగానీ…తిరుమల స్పెషల్‌ ఆఫీసర్‌గా వచ్చిన ధర్మారెడ్డి ఈ మహాద్వార ప్రవేశాలపై దృష్టి సారించారు. మొన్నటిదాకా పని చేసిన ఉన్నతాధికారుల ప్రత్యేక శ్రద్ధ వల్లే….కొందరికి మహాద్వార ప్రవేశాలు లభించాయని ధర్మారెడ్డి నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అడ్డదారిలో జరిగిన మహాద్వార ప్రవేశాలకు మంగళం పాడేందుకు ధర్మారెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఇది మంచి పరిణామమే.

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*