ద్రౌపది లాగా సిఎం రమేష్‌ శపథం!

మహాభారతంలో ద్రౌపది గురించి తెలుసుకదా…ఆమెను నిండుసభలో వస్త్రాపహరణం చేసిన కౌరవులను అంతమొందించేదాకా తన జుత్తు ముడేయబోనని శపథం చేస్తుంది. ఆదేవిధంగా టిడిపి ఎంపి సిఎం రమేష్‌…తిరుమల శ్రీవారి సాక్షిగా ఒక శపథం చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యేదాకా గెడ్డం తీయబోనని ప్రతినబూనారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన కేంద్రం నుంచి ఎటువంటి హామీ లభించకుండానే దీక్ష విరమించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అదలావుంచితే…దీక్ష అనంతరం శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ….కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యేదాకా గెడ్డం తీయబోనని చెప్పారు. అయినా ఈ దీక్ష ఇప్పుడు చేపట్టి ఏమి ప్రయోజనం? ఆరు నెలల్లో ఉక్కు పరిశ్రమ సంగతి తేల్చుతామని చెప్పి, తేల్చకుండా నాన్చినపుడే ఇటువంటి శపథం చేసివుంటే..ఈ నాలుగేళ్లలో కేంద్రంలో స్పందన ఉండేదేమో. అయినా ఆయన శపథం నెరవేరుతుందో…లేక దీక్ష లాగే మధ్యలోనే ఈ శపథాన్నీ పక్కనపెట్టి గెడ్డం తీసేయాల్సివస్తుందో వేచి చూడాల్సిందే.

అదేవిధంగా మరో విచిత్రమైన వ్యాఖ్య కూడా చేశారు. తన దీక్ష కొనసాగుతోందని, ద్రవాహారం తప్ప, ఘనాహారం ఏదీ తీసుకోవడం లేదని అన్నారు. ఇది దీక్ష కొనసాగించడం ఎలాఅవుతుందో ఆయనకే తెలియాలి. సహజంగా పది రోజులు నిరాహార దీక్షలో ఉన్నప్పుడు వెంటనే ఘనహారం తీసుకునేందుకు డాక్టర్లు అనుమతించరు. ఎక్కువ రోజులు అన్నం తిననపుడు కడుపులో జీర్ణ వ్యవస్థ గాడితప్పివుంటుంది. అందుకే తేలికగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాలే తీసుకోమని వైద్యులు చెబుతారు. ఈ పనే రమేష్‌ చేస్తున్నారు. అయితే…దీనికి ఆయన దీక్ష అని పేరు పెడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*