ధర్మచక్రం ఎఫెక్ట్‌ – నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ మార్పు – ఆలయంలో ఈవో తనిఖీలు

శ్రీకాళహస్తి ఆలయం, ఆలయానికి అనుబంధంగా నడుస్తున్న జ్ఞానప్రసూనాంబిక నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించి ధర్మచక్రం ప్రచురించిన కథనాలపై సంబంధిత అధికారులు స్పందించారు.

ప్రిన్సిపాల్ తొల‌గింపు … అర్హత లేకున్నా ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న జ్ఞానాంబిక నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌కె బేగంనను విధుల నుంచి తప్పించారు. ఆ స్థానంలో ఎం.శ్యామలకు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆలయ ఈవో శ్రీరామ రామస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ‘అమ్మా జ్ఞానాంబిక…నర్సింగ్‌ విద్యార్థిను కష్టాలు చూడవమ్మా…’ అంటూ రెండు రోజుల క్రితం ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఈవో వేగంగా స్పందించారు. కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించారు. అక్రమాలను అరికట్టడంలో విఫలమవడం, వయో పరిమితి దాటినా ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న బేగంపై వేటు వేశారు. దీంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉపకారవేతనలు సక్రమంగా అందుతాయన్న ఆశను వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ శ్యామలా మాట్లాడుతూ…కళాశాలలో ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఈవో శ్రీరామ రామస్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆలయంలో ఈవో తనిఖీలు : ‘ముక్కంటీ మూడోకన్ను తెరువు’ అంటూ వారం క్రితం ధర్మచక్రం ప్రచురించిన కథనంతో ఈవో శ్రీరామ రామస్వామి కొరడా ఝుళిపించారు. ఆయన ఆలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాహు-కేతు పూజా మండపాలను పరిశీలించారు. పూజలు చేయించుకునే భక్తుల నుంచి దక్షిణ పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. దళారులపై నిఘావుంచాలని సిబ్బందికి సూచించారు. భక్తులను మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే లగేజీ కేంద్రీలలలో నిర్ణీత ధరలే వసూలు చేయాలని, అధికంగా వసూలు చేస్తే టెడరు రద్దు చేస్తామని హెచ్చరించారు.

భద్రత కట్టుదిట్టం : జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగిస్తూ అధికరణ 370 రద్దు చేసిన నేపథ్యంలో తమిళనాడులోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో…శ్రీకాళహస్తి ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. స్వామి అమ్మావార్తలను దర్శించుకోడానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. తనిఖీలపై ఈవో శ్రీరామ రామస్వామి భద్రతా సిబ్బందికి సూచలను చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*