ధర్మచక్రం ప్రత్యేకం : శ్రీవారి ఆలయం బయటే పరకామణి…!

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా వస్తున్న కానుకలను లెక్కించే పరకామణిని ఆలయం లోపల నుంచి బయటకు తరలించాలన్న ఆలోచనలో టీటీడీ అధికారులు ఉన్నారా? దీనిపై ప్రాథమిక చర్చలు సాగుతున్నాయి..?

అవును… పరకామణిని తిరుమల ఆలయం నుంచి బయటకు తరలించాలన్న ఆలోచన మొదలైంది. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో, సంపంగి ప్రాకారం లోపల, గర్భగుడి వెనుక వైపు కానుకల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు బంగారువాకిలి వద్దే హుండీ లెక్కింపు జరిగేది. దర్శనానికి వెళ్ళే భక్తులు హుండీ లెక్కింపును చూస్తూ వెళ్లేవారు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి పరకామణి తరలించారు. స్థలాభావం వల్లే అప్పట్లో పరకామణి స్థలాన్ని మార్పు చేశారు. అయినప్పటికీ స్థలం సరిపోకపోవడంతో అదే ప్రాంగణంలో గర్భగుడి కుడివైపు ఉన్న స్థలాన్ని కూడా పరకామణి పనుల కోసం కేటాయించారు.

ఇటీవల శ్రీవారి ఆలయంలో అష్ట బంధన మహాసంప్రోక్షణం తెలిసిందే. ఆ సందర్భంగా గర్భగుడికి కుడివైపు పరకామణి కోసం కేటాయించిన స్థలంలో యాగశాల ఏర్పాటు చేశారు. పూజాది కార్యక్రమాలు అక్కడే నిర్వహించారు. అయితే…ఆ తర్వాత మళ్లీ అక్కడ పరకామణి పనులు చేపట్టలేదు.

శ్రీ వెంకటేశ్వర స్వామికి వస్తున్న కానుకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు పరకామణి అంటే తిరుమలలో మాత్రమే ఉండేది. అక్కడ స్థలం సరిపోని కారణంగా చిల్లర నాణేలను లెక్కించే పనిని తిరుపతి కి మార్చారు. తిరుమల నుండి చిల్లరను తిరుపతికి తరలించి, టిటిడి పరిపాలనా భవనం వద్ద ఉన్న చిల్లర పరకామణిలో లెక్కిస్తున్నారు.

ప్రస్తుతం తిరుమల ఆలయం లోపల ఉన్న పరకామణిలో నోట్ల లెక్కింపు జరుగుతోంది. అదేవిధంగా బంగారు, వెండి ఆభరణాలను వేరు చేసి… విలువ లెక్కించి తిరుపతిలోని ట్రెజరీకి తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ పనులకు కూడా లోపలున్న పరకామణి సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో తిరుమలలోనే అధునాతన భవనాన్ని ఇందుకోసం నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ పేరుతో నిర్మించే ఈ భవనంలోకి పరకామణిని తరలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి 29.07.2019న స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి సమక్షంలో ప్రాథమికమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆగమ శాస్త్ర పరంగా ఏవైనా అభ్యంతరాలు ఉంటాయా అనే దానిపై పెద్ద జీయర్ స్వామితో చర్చించాలని సంబంధిత అధికారులను ధర్మారెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

అంతిమంగా శ్రీవారి ఆలయం నుంచి పరకామణిని బయటకు తరలించాలని నిర్ణయం తీసుకుంటే…దాని పై భక్తుల నుంచి, ఉద్యోగుల నుంచి స్పందన ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేం.

పరకామణిని బయటకు తరలించడం వల్ల భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ధర్మచక్రంతో చెప్పారు. అదేవిధంగా పరకామణి విధులకు వెళ్లినప్పుడైనా స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉద్యోగులకు ఉండేదని, పరకామణిని బయటకు తరలిస్తే ఆ అవకాశాన్ని కూడా కోల్పోతారని అంటున్నారు. అందుకే పరకామణి తరలింపు చర్యలను వ్యతిరేకించాలనే ఆలోచనలో ఉన్నారు.

  • ఆదిమూలం శేఖర్ , సంపాదకులు,‌ ధర్మ చక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*