‘ధర్మ’సందేహం తీరుస్తారా…బ్రేక్‌ దర్శనం పాపమంతా మీడియాదేనా..!

తిరుమల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎవి ధర్మారెడ్డి 02.08.2019న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శ్రీవారి బ్రేక్‌ దర్శనంలో తీసుకొచ్చిన మార్పులు, ఇందులో జరుగుతున్న వ్యవహారాల గురించి వివరించారు.

మొన్నటిదాకా ఉన్న ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 దర్శనాల విధానాన్ని రద్దు చేసి; ప్రోటోకాల్‌, నాన్‌ ప్రోటోకాల్‌ పేరుతో రెండు రకాల దర్శనాలు మాత్రమే అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రోటోకాల్‌ కేటగిరీ కింది అత్యంత ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. ఈ సంఖ్య ఏ రోజూ 50 మించలేదన్నారు.

గతంలో ప్రోటోకాల్‌ పేరుతో ఇచ్చిన ఎల్‌ 1 దర్శనాల వివరాలు చూస్తే…ఒక్కోరోజు 600 టికెట్లు కూడా ఇచ్చారని వెల్లడించారు. అందుకే ఎల్‌ 1 దర్శనాలకే రెండు గంటల సమయం పట్టేదన్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను బాగా తగ్గించడంతో 15 – 20 నిమిషాల్లోనే పూర్తవుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రెండు గంటల సమయం ఆదా అవుతోందన్నారు.

గతంలో ప్రోటోకాల్‌ పరిధిలోకి రాని వారికి కూడా ఎల్‌ 1 టికెట్లు కేటాయించారని, అందుకే వందల మంది ఆ కేటగిరీ కింద దర్శనం చేసుకునేవారని తెలిపారు. మరి….ఈ పాపం ఎవరిది? ఎవరికంటే వారికి ఎల్‌ 1 టికెట్లు ఇచ్చిన తప్పు సంబంధిత అధికారులది కాదా? అలా ఇస్తుంటే…ఉన్నతాధికారులు ఏమి చేసినట్లు? ఎప్పుడూ ప్రశ్నించలేదా? మాకెందుకులే అని వదిలేశారా?

ఇక మీడియా విషయానికొద్దాం….తాను ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతి సిఫార్సు లేఖనూ స్వయంగా చూసి టికెట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ధర్మారెడ్డి. ఈ క్రమంలో…ఒక రోజు మీడియా ప్రతినిధుల నుంచి 150 టికెట్లుకు లేఖలు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఊరూపేరు లేని పత్రికల పేరుతో, తాను ఎప్పుడూ వినని పత్రికల పేరుతో దర్శనాల కోసం లేఖలు అందాయన్నారు.

అందుకే….ఈ లేఖలు పెట్టిన వాళ్లు ఎవరతో తెలుసుకోవాలన్న కుతూహలంతో… లేఖలు పెట్టిన వారందరినీ పిలిచి మాట్లాడాకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే….లేఖలు పెట్టిన వారిలో ముగ్గురు మినహా ఎవరూ తన వద్దకు వచ్చి మాట్లాడలేదన్నారు. కొందర్ని ఫోన్‌ చేసి పిలిచినా రాలేదని చెప్పారు.

టికెట్ల కోసం లేఖలు పెట్టిన వారిని ఫోన్‌ చేసి పిలిచినా ఎందుకు రాలేదు…టికెట్లు వొద్దనుకున్నారా? అధికారులు వివరాలు ఆరా తీస్తే…ఆ టికెట్లు ఎవరికో అమ్ముకోడానికి పెట్టినవని తెలిసిపోతుందని అనుకున్నారా? ధర్మారెడ్డి బహిరంగంగా చెప్పలేదుగానీ….కొందరు మీడియా ప్రతినిధులు టికెట్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఊరూపేరూ లేని పత్రికల పేరుతోనూ టికెట్లు ఇచ్చారని విస్మయం వ్యక్తం చేస్తున్న ధర్మారెడ్డి కూడా శోధించాల్సిన అంశం ఏమంటే….అలాంటి వారికి టికెట్లు ఎలా ఇచ్చారు? ఎవరి వారిని ప్రోత్సహించారు?

టికెట్ల మంజూరుకు కేంద్రంగా ఉన్న జెఈవో కార్యాలయ సిబ్బందే…ఇటువంటి టికెట్ల వెనుక ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఎవరి పేరుతోనే ఒకరి పేరుతో లేఖలు పెట్టించడం, టికెట్లు కేటాయించడం, వాటిని బయట అమ్ముకోవడం…ఇదీ చాలాకాలంగా జరుగుతున్న తంతు. ఈ విషయాలు సంబంధిత అధికారులకు తెలియదనుకోవాలా? తెలిసినా చూసీచూడనట్లు ఊరుకున్నారనుకోవాలా?

ఆ మాటకొస్తే….ధర్మారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు ఎల్‌ 1 తరహా దర్శనానికి వచ్చే విఐపిలు 50కి మించడం లేదు…మరి మొన్నటిదాకా 600 టికెట్లు ఇచ్చారంటే ఆ తప్పు ఎవరిది? టికెట్లు కావాలని అడిగిన వాళ్లదా..! ఇచ్చిన వాళ్లదా..!

గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని చింతించడం వల్ల ప్రయోజనం లేదు. స్వామివారి బ్రేక్‌ దర్శనం టికెట్లలో మీడియా పేరుతో జరిగే అక్రమాలైనా, ఇంకో డిపార్టుమెంటు పేరుతో జరిగే మోసాలైనా కట్టడి చేయాల్సిందే. ఇది జరగాలంటే ముందుగా ఇందులోని ‘రహస్యా’నికి మంగళంపాడాలి. ఏ రోజు ఎవరికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారో పేర్లతో సహా టిటిడి వెబ్‌సైట్‌లో వెల్లడించాలి. ఒకవేళ ఒక సంస్థ పేరుతో, ఆ సంస్థ యజమానులకు తెలియకుండా ఎవరైనా టికెట్లు తీసుకుంటున్నా వెంటనే తెలిసిపోతుంది. అదేవిధంగా పదేపదే టికెట్లు తీసుకునే వారూ వెనకంజ వేస్తారు. అధికారులూ విచ్చలివిడిగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉండదు.

ఈ అంశాన్ని ధర్మచక్రం గత కొన్నేళ్లుగా అధికారులు, ఛైర్మన్ల దృష్టికి తీసుకెళుతూనే ఉంది. ఎవరూ సీనియస్‌గా పట్టించుకోవడం లేదు. ఇదే ఇష్టాగోష్టి సమావేశంలో ధర్మారెడ్డి దృష్టికి, ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి దృష్టికి…ధర్మచక్రం ప్రతినిధి ‘టికెట్లలో పారదర్శకత’ అంశాన్ని తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా టిటిడిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలన్న పట్టుదలతో ఉన్నారు కనుక…పూర్తిస్థాయి బోర్డు ఏర్పాటయిన తరువాత, మొదటి బోర్డు సమావేశంలోనే ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరవుంది.

– ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*