ధర్మాన్ని వెనక్కి తీసుకోవడం టిటిడికి ధర్మమా!

కరోనా కష్టకాలంలో పేదలకు పిడికెడు అన్నం అందించడం కోసం జిల్లాకు కోటి రూపాయల వంతున 13 జిల్లాలకు రూ.13 కోట్లు మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టిటిడి వెనక్కి తీసుకుంది. అదేవిధంగా తిరుపతిలో పేదలకు అందిస్తున్న ఆహారాన్ని…వసల కూలీకే పరిమితం చేయాలని కూడా నిర్ణయించినట్లు ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు.

ఈనెల 20 నుంచి వ్యవసాయ పనులు, భవన నిర్మాణ పనులు చేసుకోడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినందున, ఇక ఆహారం సరఫరా చేయాల్సిన అవసరం లేదని భావించి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సహేతుకంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈనె 20 నుంచి లాక్‌ డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చివుండొచ్చుగానీ…. వాస్తవంగానైతే జనజీవనం సాధారణ స్థితికి చేరుకోలేదు. ఇప్పటికీ ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. వెళ్లినా పని దొరకని దుస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు ఆహార అవసరం కచ్చితంగా ఉంది.
 
కరోనా నియంత్రణకు జరుగుతున్న ప్రయత్నాల్లో టిటిడి తనవంతు పాత్రను పోషిస్తోంది. స్విమ్స్‌ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, పరికరాల కోసం రూ.19 కోట్ల కేటాయించింది. తిరుపతి, చుట్టుపక్క ఉన్న పేదల ఆకలి తీర్చడం కోసం రోజూ వేలాది ఆహార పొట్లాలు సరఫరా చేస్తోంది. ఉద్యోగులకు ఆయుర్వేద మందులు అందుబాటులోకి తెచ్చింది. తిరుచానూరులో కొత్తగా నిర్మించిన పద్మావతి నియాలన్ని క్యారెంటైన్‌ కేంద్రంగా వినియోగిస్తోంది. టిటిడి వసతి గృహాల్లో వలస కూలీలకు, అనాథలకు ఆశ్రయం ఇస్తోంది.  అదేవిధంగా జిల్లాకు రూ.కోటి వంతున నిధులు ఇవ్వాని నిర్ణయించింది. ఇవన్నీ ప్రజల ప్రశంసలను అందుకున్నాయి.

కరోనా సహాయ చర్యకు టిటిడి నిధులు కేటాయించడాన్ని కొందరు ఛాందసులు విమర్శించారు. అలాంటివారు ఎప్పుడూ ఉన్నారు. టిటిడిపైన దుష్ప్రచారం చేయడం, ఆసత్య ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నవారు ఉన్నారు. కాణిపాకం వంటి చోట్ల సత్రాల్లో క్వారెంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తే…దానిపైనా విమర్శలు చేసినవారు ఉన్నారు. ఇటువంటి అమానవీయ ప్రకటనను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మానవ సేవే మాధవ సేవ అనే ధర్మసూక్తిని కేంద్రంగా చేసుకుని పని చేస్తున్న ఆధ్యాత్మిక సంస్థ టిటిడి. పది మందికీ అన్నం పెట్టడం వల్ల పుణ్యమే తప్ప పాపం కాదు.

నిబంధనను సడలించడం వల్ల నిజంగానే… పేదలకు ఆహారం అవసరం లేదని భావిస్తే…ఆ నిధులను వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేయవచ్చు. క్వారంటైన్‌లో ఉన్నవారికి ఆహారం కోసం వెచ్చించవచ్చు. అంతేగానీ…మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకోవడం ఏమాత్రం భావ్యంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా అనేది కొన్ని తరాలలో ఎన్నడూ రాని విషాదం. విపత్తు. ఇటువంటి సమయంలో టిటిడి వంటి ఆర్థిక పరిపుష్టివున్న ఆధ్యాత్మిక సంస్థ విస్తృతంగా సేవలందించి ప్రజకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. అంతేగానీ….ఎవరో ఏదో విమర్శలు చేశారని….ఇచ్చిన విరాళాన్ని (దానాన్ని) వెనిక్క తీసుకోవడం టిటిడికి ధర్మం కాదు. దీనిపైన టిటిడి పెద్దలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.
– ఆదిమూలం శేఖర్‌, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*