తనను చంపడానికి ప్రయత్నించారంటున్న మాయావతి

దళిత వ్యతిరేక శక్తులు తనను చంపడానికి ప్రయత్నించాయని బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని షబ్బీర్‌పూర్‌లో జరిగిన హింసాకాండ సందర్భంగా తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్నారు.

‘2019లో బెహన్‌ జీ ప్రధానమంత్రి కాబోతున్నారని భీమ్‌ ఆర్మీ, బహుజన యూత్‌ మిషన్‌ లాంటి బోగస్‌ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ బీఎస్పీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. నన్ను ప్రధానమంత్రిని చేస్తామని చెప్పి దళిత మద్దతుదారుల నుంచి డబ్బులు గుంజుతూ, ర్యాలీల్లో పాల్గొనాలని అడుగుతున్నాయి. అగ్ర కులాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ దళితులను రెచ్చగొడుతున్నాయి. అగ్రకులాల వారు మా పార్టీలో చేరకుండా కుట్రలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దళిత వ్యతిరేక శక్తులు నన్ను చంపాలని చూశాయి. ఈ విషయాన్ని మేము ముందే పసిగట్టడంతో వారి పన్నాగం ఫలించలేదు. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడానికి అనుమతించకపోవడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇటువంటి శక్తుల ఉచ్చులో పడొద్దని దళిత జాతిని కోరుతున్నా. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని షబ్బీర్‌పూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు ఎంతో బాధాకరమ’ని మాయావతి పేర్కొన్నారు.

షబ్బీర్‌పూర్‌లో 2017, మే 15న జరిగిన కుల ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు 16 మంది గాయపడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*