నల్లారికి చంద్రబాబు తీవ్ర అన్యాయం..!

కాంగ్రెస్‌ నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని భుజాలపైకి ఎత్తుకుని ఊరేగిస్తున్నారు. ఆయన ఘనతను ఊరూవాడా కీర్తిస్తున్నారు. చంద్రబాబు అంతటి గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు కాంగ్రెస్‌లోనూ ఎవరూ లేరన్నట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి చంద్రబాబుపైన ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కావాలంటే ఆ మాత్రం ప్రయాస తప్పదు. అయితే…మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతున్నారు. ఆయన వినిపించీ వినిపించకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. ఆక్రోశమో, ఆవేదనో అర్థంగాని విధంగా మాట్లాడుతున్నారు. నల్లారిలోని ఈ ధోరణికి కారణాలు లేకపోలేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మంగళం పాడేసింది. కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు తాగునీటిని అందించే బృహత్తర పథకానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. టెండర్లు కూడా పూర్తయిన ఈ పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. ఈ పథకం పూర్తయివుంటే కరువు జిల్లాలో కిరణ్‌ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయేది. కిరణ్‌ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం ఎక్కడా కనిపించడం లేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రవేశపెట్టిన మంచి పథకం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌. చంద్రబాబు నాయుడు దాన్ని అటకెక్కించారు. ఇక రైతులు వ్యవసాయం కోసం లక్ష లోపు రుణం తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లిస్తే వడ్డీ లేకుండా చేశారు. అదీ ఇప్పుడు కనిపించడం లేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించిన పథకాలన్నింటికీ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పనిగట్టుకుని రద్దు చేసింది.

చంద్రబాబు నాయుడు తమతో పొత్తుపెట్టుకునేదాకా కాంగ్రెస్‌ నాయకులు ఈ అంశాలన్నీ మాట్లాడుతూ వచ్చారు. పొత్తు తరువాత ఆ విమర్శల జోలికి వెళ్లడం లేదు. తన పథకాలన్నింటినీ రద్దు చేసిన చంద్రబాబు నాయుడి పట్ల అందరిలాగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉండలేరు గదా..! స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిరణ్‌….రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. అయితే స్వరం కాస్త తగ్గించి మాట్లాడారు.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌కు దూరమై…సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి, గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరువాత కిరణ్‌ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. అటూ ఇటూ చూసేలోపే చంద్రబాబు కూడా తన పక్కనే ఉన్నారు. దీంతో మింగలేక కక్కలేక సర్దుకుపోతున్నారు. కిరణ్‌కు ఇష్టమైన క్రికెట్‌ భాషలో చెప్పాలంటే…బలమైన బంతిని విసిరి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌ను ఫెవీలియన్‌ దారి పట్టించాలని ఉన్నా….బంతిని బలంగా విసరలేని స్థితిలో ఉన్నారు. పాపం కిరణ్‌.

ఇటువంటి ఆసక్తికర విశ్లేషణల కోసం ధర్మచక్రం ఛానల్‌ను సబ్‌స్రైబ్‌ చేయండి. పక్కనే ఉన్న బెల్‌ బటన్‌ నొక్కితే ఈ వార్తలు ఎప్పటికప్పుడు మీరు వస్తూవుంటాయి.

https://youtu.be/pwN0icEnUo4?t=12

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*