నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ మారిపోయింది!

రాష్ట్ర ప్రజలందరూ చేయాల్సిన ప్రతిజ్ఞ ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. పార్టీ రాజకీయ విధానాలను బట్టి అది మారిపోకూడదు. అలామారిపోయిందంటే అది ప్రతిజ్ఞ కాదు. అవకాశవాద రాజకీయ ప్రజ్ఞ అవుతుంది. నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ అవకాశవాద రాజకీయ ప్రజ్ఞలాగే ఉంది. 2017 నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞకు, 2018 నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞకు చాలా తేడాలున్నాయి. అప్పుడు బిజెపి మనసు నొప్పించని రీతిలో, కాంగ్రెస్‌ను ఇరికించే తీరగా ప్రతిజ్ఞ ఉండగా…ఇప్పుడు బిజెపిపైకి జనాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందడానికి ఉపయోగపడేలా ఉంది.

2018 నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞలో….’నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలతో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి సమాయత్తంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంలోని అంశాలు, నాటి ప్రధాని హామీలు అమయ్యేవరకు ధర్మ పోరాటాన్ని కొనసాగిద్దాం’ అనే వాక్యాలున్నాయి. అయితే…2017 నాటి ప్రతిజ్ఞలు ఇలాంటి వాక్యాలేవీ లేవు. 2022 నాటికి దేశంలోనే తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంల్నోఏ అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం….’ అనే జనరల్‌ వాక్యాలు మాత్రమే ఉన్నాయి. ఈసారి వచ్చేసరికి నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు….’ వచ్చి చేరాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి బిజెపి ఎంత కారణమో…టిడిపి కూడా అంతే కారణం. ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన ఆందోళనలను ప్రభుత్వం అపహాస్యం చేసింది. ఉద్యమకారులపై కేసులు పెట్టించింది. రాజకీయ కారణాలతో బిజెపి నుంచి విడగొట్టుకున్న టిడిపి…రాష్ట్రానికి బిజెపి వల్లే నష్టం జరిగిందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. పైగా ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయాలంటోంది. అవకాశవాదంతో కూడిన ప్రతిజ్ఞను ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు?

రాష్ట్ర ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయాలంటే…అందుకు తగినట్లుగానే అదివుండాలి. తెలుగుదేశం రాజకీయ విధానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రతిజ్ఞ మారిపోతే…ప్రతిజ్ఞ అనే మాటకే అర్థంలేకుండాపోతుంది. వచ్చే ఏడాది నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ఇప్పుడున్న విధంగానే ఉంటుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాంగ్రెస్‌తో అవగాహన కుదిరితే….గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న ‘అశాస్త్రీయ విభజన…’ అనే మాటను తీసేసినా తీసేయవచ్చు.

2017

2018

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*