నాని, బిగ్‌బాస్‌ ఊపిరి పీల్చుకోవచ్చు!

అందరూ ఊహించినదే జరిగింది. బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బాబు గోగినేని బయటకు వచ్చేశారు. తొమ్మిదోవారం ఆయన ఎలిమినేట్‌ అవబోతున్నట్లు ముందుగానే సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ ఆదివారం రాత్రి ఎపిషోడ్‌లో ఆ ఊహాగానాలు నిజమయ్యాయి.

మేధావిగా, నాస్తికుడిగా, మానవహక్కుల ప్రచారకర్తగా విశేషమైన గుర్తింపు పొందిన బాబు గోగినేని బిగ్‌బాస్‌ షోకు వెళ్లడమే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. పనీపాట లేని పాల్గొనే ఈ షోలో గోగినేని వంటి వారు వెళ్లడం ఏమిటని చాలా మంది విమర్శించారు. అయితే….ఈ షోతో గోగినేనికి మరింత గుర్తింపు లభించింది. అరుదైన అనుభవమూ ఆయనకు దక్కింది. షోలో పాల్గొన్న వారందరినీ అడిషన్స్‌ ద్వారా ఎంపిక చేస్తే….బాబును మాత్రం షో నిర్వాహకులే ఆహ్వానించారు.

బాబు గోగినేని బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తనదైన శైలిలో ఉన్నారు. కొన్ని సందర్బాల్లో బిగ్‌బాస్‌ను ధిక్కరించి బిగ్గర్‌ బాస్‌ అని ముద్రవేసుకున్నారు. బాబు ఆలోచనలకు, అక్కడ షోలో ఉన్న మిగత వారి ఆలోచనలకు చాలా తేడా వున్నప్పటికీ సర్దుకుని ఇంట్లో ఉండేందుకు ప్రయత్నించారు.

ఇంట్లోని వారందరూ బాబు గోగినేనిలోని మేధస్సును, విజ్ఞానాన్ని గౌరవించారు. ఆయన్ను ఒక గురువులాగా చూశారు. అయితే….టాస్క్‌లలో కౌశల్‌తో, నూతన్‌ నాయుడితో తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ఆ ఇద్దరూ బాబును ఏకవచనంతో సంబోధించే దాకా వెళ్లింది. బాబు గోగినేనిని డీల్‌ చేయడం హోస్ట్‌గా నానీకి కూడా ఇబ్బందిగా మారింది. మిగతా సభ్యులను మాట్లాడినట్లు బాబు గోగినేనిని మాట్లాడలేకపోయారు నాని.

షో ఇంకో 40 రోజులు మాత్రమే ఉంటుంది. రానురాను టాస్క్‌లు తీవ్రంగానూ, కఠినంగానూ ఉంటాయి. షో రక్తికట్టాలంటే ఇవన్నీ తప్పవు. అటువంటప్పుడు బాబు వంటి వ్యక్తి అక్కడ ఉండటం బిగ్‌బాస్‌కు ఇబ్బందే అవుతుంది. ఈ నేపథ్యంలో బాబు గోగినేని ఎలిమినేషన్‌ ఖాయమన్న అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమయింది. ఊహించిన విధంగానే ఆయన ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు ఇక నాని, బిగ్‌బాస్‌ ఊపిరి పీల్చుకోవచ్చు.

బయటకు వస్తున్న బాబు గోగినేని బిగ్‌బాస్‌ షో రహస్యాలు ఏమైనా బయటపెడుతారా, వివాదాస్పద అంశాలను బయటకు వెల్లడిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హౌజ్‌లో మాట్లాడలేని అన్ని విషయాలనూ బయట మాట్లాడేందుకు వీలుంటుంది. లోపల మాట్లాడనా…బిగ్‌బాస్‌ తనకు నచ్చిన విషయాలను ప్రేక్షకులకు చూపించివుండకపోవచ్చు. అటువంటివి ఇంటర్వ్యూల్లో బాబు గోగినేని మాట్లాడే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*