నానీని కూడా ‘ఒరేయ్‌…’ అంటాడేమో!

రెండో వారానికే బిగ్‌బాస్‌ షో నుంచి నిష్క్రమించి, అదృష్టవశాత్తు మరీ రీ ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ప్రవేశించిన నూతన్‌ నాయుడు వింతగా ప్రవర్తిస్తున్నారు. మొదటిసారి వెళ్లినపుడు తన మాటల గారిడీతో అందర్నీ మాయ చేయొచ్చుని భావించి బోల్తాపడిన నూతన్‌ నాయుడు ఇప్పుడు మరీ చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇంటిలోని సభ్యులందరినీ ‘ఒరేయ్‌ ఒరేయ్‌…’ అని సంబోధిస్తూ, తనకు తాను పెద్దరికం తెచ్చిపెట్టుకుని పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎబ్బెట్టుగా ఉంటోంది.

కౌశల్‌లో ఎంతోకాలంగా స్నేహం ఉన్నవాడిలా ‘రేయ్‌..రేయ్‌…’అని సంబోధించడం మొదలుపెట్టి, గణేష్‌, సామ్రాట్‌లను కూడా అదే పదంతో పిలుస్తున్నారు. సోమవారంనాటి ఎపిషోడ్‌ చూస్తే….కనీసం 50 – 60 సార్లు అతని నోటి నుంచి ‘రేయ్‌…’ అనే పదం వినిపించింది. నూతన్‌ ఎవరినైతే రేయ్‌ అని పిలుస్తున్నారో…వాళ్లు తిరిగి అంతే చొరవతో అతన్ని పిలవడం లేదు. ఓ టాస్క్‌ ఆడుతున్నప్పుడు కౌశల్‌ స్పందిస్తూ…’నూతన్‌ నాయుడు గారూ…’ అని ఎంతో గౌరవంగా పిలిచారు. ఆ ఇద్దరి మధ్య గారూ అని పిలుచుకునే సంబంధమే తప్ప….రేయ్‌ అని సంబోధించుకునే చనువు కనిపించదు. అయినా నూతన్‌ రేయ్‌ అనే మాటను వదలడం లేదు.

ఓ సందర్భంలో సామ్రాట్‌ వద్దకు వెళ్లి….’రేయ్‌…నువ్వు వయసులో నాకంటే చిన్నగానే ఉంటావు’ అని వయసును గుర్తు చేసి, రేయ్‌ అని పదేపదే సంబోధించడం మొదలుపెట్టాడు. గణేష్‌ విషయంలోనూ అదే ధోరణి కనిపించింది. అమిత్‌, బాబు గోగినేని, తనిష్‌లను పేరు పెట్టి పిలుస్తున్నారు. బాబు గోగినేనిని తప్పితే అందర్నీ రేయ్‌ అని పిలిచేలావున్నాడు నూతన్‌ నాయుడు. రేయ్‌ అని పిలిస్తే అందరూ తన ఆధీనంలోకి వస్తారని భావించాడో ఏమోగానీ…చూసేవాళ్లకు మాత్రం సంస్కార రహితంగా సంబోధోస్తున్నాడన్న భావన ఏర్పడుతోంది.

తాను కూడా బాబు గోగినేని అంతటి మేధావిని అనే భావన నూతన్‌ నాయుడిలో కనిపిస్తోంది. గోగినేని వయసు రీత్యా, మేథస్సు రీత్యా ఇంటిలో అందరికీ పెద్దగా ఉంటున్నారు. ఇంటి సభ్యులంతా ఆయన్ను అదే రీతిలో గౌరవిస్తున్నారు. అటువంటి గౌరవం, పెద్దరికం తనకెందుకు ఇవ్వరో చూద్దాం అని అనుకున్నారో ఏమోగానీ….నూతన్‌ నాయుడు వింతగా ప్రవర్తిస్తున్నారు. వాస్తవంగా బాబు గోగినేని ఒక్క గణేష్‌ను తప్ప ఎవర్నీ రేయ్‌ అని పిలవరు. అదీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప గణేష్‌నూ ఏకవచనంతో పిలవరు. అదేవిధంగా నూతన్‌ నాయుడు సంభాషణలు మొత్తం అసహజంగా ఉంటున్నాయి. ఏదో సూత్రాలు, సిద్ధాంతాలు చెబుతున్నట్లు మాట్లాడుతున్నారు. ఇలా నాటకీయంగా వ్యవహరించే వారిని బిగ్‌బాస్‌ ప్రేక్షకులు అంగీకరించరు. ఈ విషయాన్ని నూతన్‌ నాయుడు ఇక తెలుసుకునే అవకాశం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*