నామినేటెడ్ పోస్టులు కోసం నేతల ఎదురుచూపులు…!

  • ఆరు నెలలైనా భర్తీ కాని కీలక పదవులు
  • స్థానిక పోరు తరువాతే భర్తీ కానున్నాయా..?

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

       శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా  కీలకమైన పోస్టులు భర్తీకి నోచుకోలేదు. దీంతో నేతలు కొంత అసంతృప్తి కి గురవుతున్నారు. అయితే స్థానిక పోరుకు జనవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో...ఆ  తరువాతే నామినేటెడ్ పోస్టులు భర్తీచేసే అవకాశం కన్పిస్తుంది. అంటే మరో మూడు నెలల వరకు ఆశావహులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నియోజకవర్గ పరిధిలో అత్యంత కీలకమైన దేవస్థాన పాలకమండలి ఛైర్మెన్ తోపాటు స్కిట్ కళాశాల ఛైర్మన్, శ్రీకాళహస్తి, తొట్టంబేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ లు , పట్టణంలోని పలు అనుబంధ ఆలయాల కమిటీలు ఉన్నాయి. ప్రధానమైన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కోసం పలువురు వైకాపా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ నేతలు అంజూరు శ్రీనివాసులు, కొండుగారి శ్రీరామమూర్తి, రేణిగుంటకు చెందిన తిరుమల రెడ్డి పేర్లు ఛైర్మెన్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ఇటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గిరి కోసం రైతు విభాగానికి చెందిన పలువురు వైకాపా నేతలు పోటీ పడుతున్నారు. స్కిట్ తో పాటు అనుబంధ ఆలయాల కమిటీల కోసం అనేక మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాపుగున్నేరి సింగిల్ విండోకు, టౌన్ బ్యాంకు కు మాత్రమే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన ఎమ్మెల్యే మిగిలిన పోస్టులు వ్యవహారం లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పోస్టులు భర్తీ అయితే పార్టీ కోసం పనిచేసిన సగం మంది నేతలను సంతృప్తి పరిచినట్లవుతుంది. మిగిలిన వారికి రెండేళ్ల తరువాత అవకాశం కల్పిస్తే సరిపోతుంది.

విబేధాలు వస్తాయనే జాప్యమా..?
స్థానిక సంస్థల
ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు భర్తీచేస్తే ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల ఎంపిపిలు , జెడ్పీటీసీ లతో పాటు కీలకమైన మున్సిపల్ చైర్మన్ కు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తన సత్తా చాటాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ముందుగానే నామినేటెడ్ పోస్టులు భర్తీచేస్తే నాయకుల మధ్య అభిప్రాయ బేదాలు ఏర్పడి పార్టీ కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం పోస్టులు పెండింగ్ ఉంటే అందరూ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. పైగా స్థానిక పోరులో కొందరికి కీలక పదవులు వచ్చే అవకాశం ఉండటంతో నామినేటెడ్ పోస్టులు ఎంపిక సులువయ్యే అవకాశం. ఉంది. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పదవులు పెండింగ్ పెడుతూ వస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ మరో మూడు నెలల తరువాతే భర్తీ అయ్యే అవకాశాలు ఉండటం నేతలను అసహనానికి గురిచేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*