నారావారిపల్లి వద్ద ఉద్రిక్తత!

– సిఎం స్వగ్రామంలోని ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన వామపక్షాల నేతలు
– దేశ సరిహద్దులను మూసేసినట్లు నారావారిపల్లి దారిని మూసేసిన పోలీసులు
– పాత్రికేయులూ వెళ్లకూడదంటూ ఆంక్షలు
– వాదోపవాదాల అనంతరం ఆస్పత్రిని సందర్శించకుండానే వెనుదిరిగిన నేతలు
– నారావారిపల్లికి మళ్లీ వస్తామని ప్రకటన

ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారిపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్లిన సిపిఐ, సిపిఎం నేతలకు పోలీసుల నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. పాత్రికేయులు సహా ఎవరూ నారావారిపల్లిలోకి వెళ్లకూడదంటూ కొన్ని కిలోమీటర్ల దూరంలోని రంగంపేట క్రాస్‌లోనే, నారావారిపల్లి రోడ్డుకు అడ్డంగా బ్యారీకేట్లు పెట్టి దారి మూసేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు తదితర ముఖ్యనాయకులు ఉన్నా పోలీసులు అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆస్పత్రిని సందర్శించకుండానే వామపక్ష నేతలు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే…

రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించే లక్ష్యంతో వామపక్షాలు గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 15న విజయవాడలో భారీ సభ నిర్వహించనున్నాయి. దీనికి ముందు ‘బస్సు యాత్ర’లతో రెండు బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో, అనంతపురం నుంచి బయలుదేరి బస్సుయాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది. తిరుపతిలో సభ అనంతరం పీలేరుకు వెళుతూ…మార్గమధ్యంలో నారావారిపల్లిలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను సందర్శించాలనుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు….భాకరాపేట క్రాస్‌లోనే నారావారిపల్లి రోడ్డుకు అడ్డంగా బ్యారీకేట్లు పెట్టి దారి మూసేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. నారావారిపల్లిలో ఏదో శాంతిభద్రతల సమస్య ఉందేమో అనే విధంగా…సాధారణ ప్రజలను కూడా కొన్ని గంటల పాటు గ్రామంలోకి అనుమతించలేదు. వామపక్ష నేతలు బస్సు దిగి బ్యారీకేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులంతా అడ్డుపడ్డారు. తాము ఆందోళనలు వంటి చేయడానికి రాలేదని, సిఎం స్వగ్రామంలోని ఆస్పత్రిలో ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో చూద్దామని వచ్చామని నేతలు పదేపదే చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ముఖ్యమంత్రి స్వగ్రామం ఎలా అభివృద్ధి అయిందో చూసొస్తామని చెప్పినా వెళ్లడానికి అనుమతివ్వలేదు.

పోలీసుల తీరుకు నిరసనగా అక్కడై బైఠాయించడానికి సిద్ధమవగా… చంద్రగిరి సిఐ ఉన్నతాధికారులతో మాట్లాడి…ఐదుగురు నేతులు మాత్రం నారావారిపల్లికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అయితే నాయకులతో పాటు పాత్రికేయులు వెళ్లకూడదని షరతు విధించారు. దీంతో పాత్రికేయులు తమను ఎందుకు అనుమతించంటూ నిరసనకు వ్యక్తం చేశారు. ఆఖరికి వామపక్షాల నేతలు…మీడియాను అనుమతించనిదే తామూ వెళ్లబోమని ప్రకటించి వెనక్కి వచ్చారు. అక్కడే జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

బాబు అభివృద్ధి బండారం బయటపడుతుందనే…: వి.శ్రీనివాసరావు
సిఎం స్వగ్రామంలో దాదాపు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో డాక్టర్లు లేరని, వైద్య పరికరాలూ అందుబాటులో లేవని, దీంతో ఒకరిద్దరు రోగులు కూడా రావడం లేదని…..ఈ బండారమంతా బయటపడుతుందనే తమను పోలీసులతో అడ్డుకున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. స్వగ్రామంలో నిజంగా అభివృద్ధి జరిగివుంటే చంద్రబాబాబు నాయుడే స్వయంగా తమవంటి వారిని ఆహ్వానించి గ్రామాన్ని చూపించాలన్నారు. తాము గ్రామాన్ని చూస్తామని వచ్చినా అడ్డుకోవడం దారుణమన్నారు.

నారావారిపల్లికి మళ్లీవస్తాం : రామకృష్ణ
అనంతపురంలో మొదలైన బస్సుయాత్రలో భాగంగా చేనేత కార్మికులు, ఉల్లిరైతుల సమస్యలు….ఇటువంటివన్నీ పరిశీలిస్తూ వస్తున్నాం. ప్రజల సమస్యలపైన ముఖ్యమంత్రికి లేఖలు కూడా రాస్తున్నాం. తిరుపతి నుంచి పీలేరుకు వెళుతూ నారావారిపల్లి ఆస్పత్రిని చూద్దామనుకుంటే పోలీసులతో అడ్డుకుంటారా? ఆస్పత్రిని చూడటం ఏమైనా నేరమా? అధికార పక్షం ఎందుకు అంతగా భయపడిపోతోంది. పోలీసులతో ఎంతకాలం నెట్టుకొస్తారో చూస్తాం. సెప్టెంబర్‌ 15వ తేదీ విజయవాడ మహాగర్జన సభ తరువాత మళ్లీ నారావారిపల్లికి వస్తాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా అడ్డుకుంటారో అడ్డుకోండి మేమూ చూస్తాం…అని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*