నాలుగో ఐదో కిరిటాలున్నాయి! ఇదీ బోర్డు సభ్యుల పరిశీలన!

శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ ఆలయంలోకి వెళ్లిన టిటిడి పాలక మండలి సభ్యులు మొక్కుబడిగా ఆ కార్యక్రమం ముగించారు. అసలు తిరువాభరణ రిజిస్టర్‌లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా సభ్యులు తెలుసుకోలేదనిపిస్తుంది. రిజిస్టర్‌లో 1200కుపైగా ఆభరణాల వివరాలుంటే…అర్థగంట కంటే తక్కువ సమయంలో వాటి పరిశీలన ముగించుకుని బయటకు వచ్చారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ…’నాలుగో ఐదో కిరిటాలున్నాయి….చిన్నచన్నవి, పెద్దపెద్దవి చాలా ఉన్నాయి’ అన్నారు. ఇదీ ఆయన పరిశీలన. చిన్నచిన్న ఆభరణాల సంగతి అలావున్నా…కిరీటాలు ఎన్ని ఉన్నాయో కూడా వివరంగా తెలుసుకోలేదనిపిస్తోంది. ఆరు బంగారు కిరీటాలు, ఆరు వజ్రకిరీటాలు ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో ఆభరణాల పరిశీలన ఎలా జరిగింది…తూతూమంత్రంగా చేశారా…అని విలేకరులు ప్రశ్నించగా….మేము చూశాం…ఆభరణాలన్నీ ఉన్నాయి అని ఓ సభ్యుడు చెప్పడం విశేషం. ఇంకో సభ్యుడు మాట్లాడుతూ….రిజిస్టర్‌ ప్రకారం అన్నీ పరిశీలించడం సాధ్యంకాలేదు. అందుకే ర్యాండమ్‌గా కొన్ని ఆభరణాలను చూపమని పరిశీలించాం అని చెప్పారు. సభ్యులంతా ఒకేసారి వెళ్లలేదు. విడదలవారీగా వెళ్లారు.

అయినా…తిరువాభరణ రిజిస్టర్‌లో రాసిన ప్రకారం ఆభరణాలు లేవని ఎవరూ ఆరోపించడం లేదు. సంఖ్యను సరిపోల్చడం వల్ల ఉపయోగం లేదు. అసలు ఉన్న ఆభరణాలు, అదులోని వజ్రాలు, విలువైన రాళ్లు అసలైనవేనా అనేది పరిశీలన జరగాల్సినది. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లోని సారాంశం కూడా అదే. హారంలో వజ్రం వుండేదని, ఆ తరువాత దాన్ని ఎవరో మాయం చేసి ఆ స్థానంలో రాయి పెట్టారని, అందుకే అది గరుడసేవలో నాణేల తాకిడికే పగిలిపోయిందని చెబుతున్నారు. తిరువాభరణ రిజిస్టర్‌ ప్రకారం ఆభరణాల సంఖ్య సరిపోయినప్పటికీ….పింక్‌ డైమండ్‌ వంటివి మాయం అయ్యాయన్నది దీక్షితులు చేస్తున్న ఆరోపణ. తిరుపతి రాములవారి ఆలయంలోనే ఒరిజినల్‌ ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. అందుకే ఇందులోని నిజానిజాలు తేలాలంటే….ఎగ్జిబిషన్‌లో చూసివచ్చినట్లు చూసివస్తే ప్రయోజనం లేదు. ప్రతి ఆభరాణాన్ని నిశితంగా పరిశీలించాలి. అందులోని రాళ్ల ఒరిజినాలిటీని తనిఖీ చేయాలి. అంతేతప్ప…బోర్డు సభ్యులు చేసిన పరిశీలన వల్ల ఉపయోగం లేదు.

ఆభరణాల నిర్వహణ, భద్రత అన్నీ పక్కాగా ఉన్నాయని సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఇటీవల కాలంలో పకడ్బందీ వ్యవస్థను రూపొందించిన మాట వాస్తవం. దీన్ని ఎవరూ కాదనలేరు. అయితే….గతంలో ఏదో జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకుంటే…శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు చాలా లేవని టిటిడి అధికారులే చెబుతున్నారు. ఆభరణాలను టిటిడికి అప్పగించిన తరువాత అక్రమాలు జరిగాయన్నది రమణ దీక్షిలు ఆరోపణ. దీక్షితులు చెబుతున్నదాంట్లో వాస్తవం ఎంతో తేలాలంటే శ్రీవారి ఆభరణాలను నిపుణులతో నిశితమైన పరిశీలన చేయించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*