నా పోలీసు నా ఇష్టం : బాబుగారి వింత నిర్ణయం

ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో పలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో నిర్వహించిన సోదాలతో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమంటుందోంది. రాజకీయ కక్షతో తెలుగుదేశం నాయులనే లక్ష్యంగా చేసుకుని ఐటి దాడుల చేస్తున్నారని టిడిపి నేతలంతా ముక్తకంఠంతో గగ్గోలుపెడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న తీరు కాస్త వింతగానూ, అసంబద్ధంగానూ కనిపిస్తోంది. ఇంతకీ అదేమంటే…

రాష్ట్రంలో ఐటి సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు పోలీసు భద్రత కల్పించకూడదని నిర్ణయించారట. శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి…ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఐటి అధికారులకు పోలీసు భద్రత కల్పించాలన్న నిబంధన ఏదీ లేదని న్యాయ శాఖ అధికారులు చెప్పారట. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న సోదాలకు ఎందుకు రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ వాదన.

ఇవి రాజకీయ కక్షలతో చేస్తున్న సోదాలే కావచ్చు. మరి దాన్ని ఏవిధంగా ప్రభుత్వం నిర్ధారిస్తుంది? కేంద్ర ప్రభుత్వ అధికారులకు భద్రత కల్పించాలని ప్రత్యేకంగా ఎక్కడైనా రాయాల్సిన అవసరం ఉందా? రాష్ట్రంలో ఉన్న ఎవరికైనా రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. శాంతిభద్రతల అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండటమంటే…కేంద్ర ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదనా దానర్థం? అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల కోసం కేంద్రం అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసులను నియమించుకోవాలా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి ఎన్‌ఎస్‌జి భద్రత కల్పిస్తోంది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి…కేంద్రం ఆ భద్రతను ఉపసంహరించుకోవచ్చా? ఢిల్లీలో ఏపి భవన్‌ ఉంది. ఆ భవన్‌కు ఏదైనా రక్షణ అవసరమైతే ఏపి పోలీసులు వెళతారా?

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత ఇవ్వకపోతే…కేంద్రమే బలగాలు పంపిస్తుంది. అవి రాష్ట్ర పోలీసులకంటే శక్తివంతమైనవి. ఆ భద్రతా సిబ్బందిని నియమించుకుని సోదాలు, దాడులు నిర్వహిస్తే ఫర్వాలేదా? అయినా….పోలీసు భద్రత ఉపసంహరించుకున్నంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం తన పనిని ఆపేస్తే…ఇక దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అవుతుంది? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సిన తీరు ఇదేనా?

గతంలో పన్నుల విషయంలోనూ ఇదే ధోరణితో మాట్లాడారు బాబు. మా పన్నులు మేమే వసూలు చేసుకుంటాం….మా రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం…అని మాట్లాడారు. ఇదే లాజిక్‌ అయితే….ప్రతిపక్ష శాసన సభ్యులున్న నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిధులు కేటాయించడం లేదు. అలాంటప్పుడు…మా నియోజకవర్గంలో మేమే పన్నులు వసూలు చేసుకుంటామని అక్కడి ఎంఎల్‌ఏ చెప్పవచ్చా? ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల నాయకులు గౌరవం కోల్పోవడం మినహా ప్రయోజనం ఉండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*