నిమ్మగడ్డ గారూ, ఇది‌ రాజకీయం కాదా..!

వివాదాస్పద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగ గవర్నర్ కు ఒక లేఖ రాశారు. అందులో‌ ఆయన ప్రస్తావించిన అంశాలు హాస్యాస్పదంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉన్నాయి.‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు తనను భయకంపితున్ని చేయడం ద్వారా తన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. తన 84 సంవత్సరాల తల్లిని కలవడానికి కూడా విజయవాడకు వెళ్ళలేక పోతున్నాయని ఆ లేఖలో ఆరోపించారు. హైదరాబాదులోని తన ఇంటి వద్ద ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లతో నిరంతర నిఘా పెట్టారని కూడా ఆయన అందులో పేర్కొన్నారు.

అయినా…విజయవాడకు వెళ్లడానికి, తల్లిని చూడటానికి‌ ఇబ్బంది ఏముంటుంది.. ! ఎవరైనా అడ్డుకుంటారా…ఆ అవసరం ఎవరికి ఉంటుంది..? ఈ మాట చెప్పడం ద్వారా సానుభూతి పొందడానికి, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ప్రచారం చేయడానికి తప్ప దేనికి దోహదపడుతుంది. దీన్ని రాజకీయం చేయడంగాక… ఇంకేమంటారు.. !

ఇక నిరంతరం తనపైన నిఘా పెట్టారన్నది మరో విమర్శ. తనకు‌ భద్రత కరువయిందని కేంద్రానికి లేఖ రాసింది నిమ్మగడ్డ రమేష్ కుమారే. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు జరగరానిది జరిగితే…ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పడదా..! ఆయన భద్రత దృష్ట్యా…కదలికలపై నిఘా ఉండదా..! సాధారణంగా ఉన్నత స్థానాల్లోని వ్యక్తులకు సంబంధించి…వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా, ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం నిఘా, భద్రత ఉంటాయి. అటువంటిది తనకు భద్రత కరువయిందని…ఫిర్యాదు చేశాక నిఘా పెట్టకుండా ఎలావుంటారు..!

తనకు భద్రత కరువయిందని కేంద్రానికి లేఖ రాసినట్లు తానే ఒప్పకున్నా…ఆ లేఖ ఫోర్జరీదంటూ సిఐడి పోలీసులు విచారణ జరుపుతున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. అసలు ఈ లేఖ వెలువడిన నెల రోజుల తరువాతగానీ ఆయన నోరు విప్పలేదు. ఆ లేఖలో..సిఎం జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలూ ఉన్నాయి. అందుకే అది నిమ్మగడ్డ రాసిన లేఖగా నమ్మకం కుదరడం లేదు. అదేవిధంగా… అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందన్నది ప్రశ్న. అసలు నిమ్మగడ్డ రాసినట్లు చెబుతున్నదీ, మీడియాలో వచ్చినదీ రెండూ ఒకటేనా అనేదీ అనుమానమే. ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో లేఖపై విచారణ జరుగుతుంటే… విచారణ ఎందుకని నిమ్మగడ్డ ప్రశ్నిస్తున్నారు.

అయినా…ఇంత వివాదం జరుగుతుంటే గవర్నర్ ని కలవాలన్న ఆలోచన నిమ్మగడ్డకు కలగలేదు. వాస్తవంగా ఎన్నికల కమిషనర్ ని నియమించేది గవర్నరే. తనకు అన్యాయం జరిగిందనుకున్నపుడు తొలుత గవర్నర్ ని కలిసి ఉండాలి. కానీ ఇప్పటి దాకా కలవలేదు. ఇప్పుడు లేఖ మాత్రం రాశారు. అదీ కోర్టుకు చెప్పుకోడానికి రాసినట్లుంది. తాను గవర్నర్ దృష్టికీ‌ తీసుకెళ్లినా ప్రయోజనం లేదని కోర్టుకు చెప్పడానికే లేఖ రాసినట్లు అనిపిస్తుంది.

మొత్తంగా చూస్తే…నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని‌ అడ్డుపెట్టుకుని రాజకీయాలు నడపాలన్న ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోంది. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*