నీడను చూసినా భయం….ఆకు చప్పుళ్లు విన్నా భయం…!

రాంగోపాల్‌ వర్మ హర్రర్‌ సినిమాల్లో చూస్తుంటాం…అప్పటికే ఏదో ఒక భయంలో ఉన్నవాళ్లకు తన నీడను తాను చూసినా భయం, గాలికి కిటికీ తలుపు తెరచుకున్నా భయం, చెట్టు కదలినా భయం, ఆకు మెదిలినా భయం….ఇది సినిమాకే పరిమితం కాదు. భయంతో భయపడుతున్న వాళ్ల మానసిక స్థితి అలాగేవుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలాగేవుందేమోనన్న అనుమానం కలుగుతోంది.

బిజెపితో స్నేహ సంబంధాలు తెంచుకున్న తరువాత చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. తనకు కేంద్రం హాని తలపెట్టవచ్చని, ఏదైనా జరిగితే అందరూ తన చుట్టూ ఉండాలని పదేపదే చెబుతూ వచ్చారు. గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలిసినా…తనపైన ఫిర్యాదు చేయడానికే గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయంలో కనిపించడంపైనా తెలుగుదేశం పార్టీ ఇటువంటి కుట్ర వ్యాఖ్యలే చేసింది. ఇప్పుడు బిజెపి ఎఎల్‌ఏ సత్యనారాయణ, వైసిపి ఎంఎల్‌ఏ బుగ్గున కలవడంపైనా తీవ్రమైన చర్చ సాగుతోంది. ‘వైసిపి ఎంల్‌ఏ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలను కలవడం కుట్రకు పరాకాష్ట’ అని స్వయంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిచారు. రెండు పార్టీల నేతలు కలవడం కుట్ర అవుతుందా? రాజేంద్రరెడ్డి, సత్యనారాయణ స్పష్టంగా చెబుతున్నారు. మిత్రత్వం వల్లే తాము కలిశామని అంటున్నారు. అయినా….టిడిపి నాయకులు కుట్ర కోణంలోనే వ్యాఖ్యలు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడి తీరు చూసి ఆ మధ్య బిజెపి నాయకులు ఓ విమర్శ చేశారు. ఆయన ‘ఫియార్‌ సైకోసిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. దీని ఆధారంగా చంద్రబాబు తీరును విశ్లేషిస్తూ ఓ సీనియర్‌ పాత్రికేయుడు ఓ పత్రికలో వ్యాసం రాశారు. అందులో ఆయన చెప్పిన విషయాలు ఏమంటే…’సామాన్యుల సంగతి ఏమోగానీ రాజకీయ నాయకులకు ఈ వ్యాధి లక్షణాలు అబ్బితే….కంటిమీద కునుకు ఉండదు. నిద్రలో కూడా ఏదో చెప్పలేని భయం వెంటాడుతూ ఉంటుంది. తనకేదో ముప్పువాటిల్లుతుందని, అందరూ తనను కాపాడాలని కలవరిస్తుంటారు. ఓటమి పెను భూతంలా కళ్లెదుట నిల్చుంటే ఏమేమో మాట్లాడేస్తుంటారు’ అని రాసుకొచ్చారు. ‘తరచూ ముఖ్యమంత్రి ప్రసంగాల్లో తడబాటు కనిపిస్తోంది. తన నీడను చూసి తానే భయపడుతున్నారు. తనకు వాటిల్లే ప్రమాద నివారణకు ప్రజలు రక్షణ కవచంగా ఉండాలని నిర్వేదం వెలుబుచ్చుతున్నారు. ఎందుకొచ్చిన ఆవేదన ఇది? ఏం నేరం జరగనిదే ముఖ్యమంత్రి ఇంతగా ఎందుకు జడుసుకుంటున్నారు?’ అని ఆ పాత్రికేయుడు ప్రశ్నించారు.

ఏదో భయం చంద్రబాబును వెంటాడుతోంది. అయినా దిగజారిన రాజకీయాల్లో ఏదైనా జగరొచ్చు. తాను నీతివంతమైన పాలన అందించానని చంద్రబాబు చెప్పుకోవచ్చుగానీ…ఇటీవల మన ఊళ్లో ప్రవహించే నదిలోని ఇసు నుంచి పోలవరం దాకా అక్రమాలకు కొదవే లేదు. ఎక్కడ అవినీతి జరుగుతోందో చంద్రబాబుకు ఎంత తెలుసో….ఆయన ప్రభుత్వంలో కలిసి పని చేసిన బిజెపికి ఇంకా ఎక్కువ తెలుసు. ఇంటిగుట్టు తెలిసిన వ్యక్తులు ఏమైనా చేయగలరు. నీరుచెట్టు, గృహనిర్మాణం వంటి పథకాల్లో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై సిబిఐకి ఫిర్యాదు చేస్తానని బిజెపి నేత సోము వీర్రాజు బహిరంగంగానే చెబుతున్నారు. ఇలాంటి విచారణ భయమేదో చంద్రబాబులోనూ, తెలుగుదేశం నాయకుల్లోనూ కనిపిస్తోంది. అందుకే నీడను చూసినా ఉలిక్కిపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*