నీలకంఠేశ్వర స్వామి కల్యాణం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం అనుబంధంగా మండలంలోని ఊరందూరులో వెలసిన అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామి, అమ్మవార్ల కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ ప్రధాన పూజారులు జనార్దనశర్మ, గిరిధరశర్మ సారథ్యంలో ఉదయం మూలవిరాట్లకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో హోమపూజలు నిర్వహించారు. పగలు కేడిగంపై ఊరేగిన స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను అలంకార మండపానికి చేర్చారు. కల్యాణోత్సవం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి తీసుకొచ్చిన సారెను గ్రామపెద్దలు బొజ్జల హరినాథరెడ్డి, ఆలయాధికారులు ఆలయ ప్రధాన అర్చకులకు అందజేశారు.

అలంకార మండపంలో కొలువుదీరిన స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను నవ వధూవరులుగా ముస్తాబు చేసి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కరిచర్మాంబధారి అయిన ఆ పరమశివుడు దవళ వస్త్రాలు ధరించి కల్యాణ మండపానికి చేరుకోగా అమ్మవారు పట్టుచీరె, వాలుజడతో సిగ్గులొలికిస్తూ మండపానికి చేరుకున్నారు. వేదపండితులు కల్యాణ క్రతువును వైభవంగా నిర్వహించారు. అనంతరం నవదంపతులు గజవాహనంపై గ్రామంలో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*