నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేది లేదు…ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు..!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం తిరిగి ప్రారంభించామ‌ని తెలిపారు. స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తో క‌లిసి వైవి.సుబ్బారెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

 • గ‌త 28 రోజులుగా భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నాం. స్వామివారి ద‌య‌వ‌ల్ల ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని నిర్ధార‌ణ అయింది.
 • దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ర‌క‌మైన ప‌రిస్థితి ఉంద‌ని, ప్ర‌ధాన‌మంత్రి, ముఖ్య‌మంత్రి చెప్పిన‌ట్టు క‌రోనా ఒక‌రోజులో పోయే ప‌రిస్థితి లేదు. అందుకే తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు క‌ల్పించాల్సిన ద‌ర్శ‌నం విష‌యంతోపాటు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కోసం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించాం. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌నాల సంఖ్య‌ను పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించాం.
 • టిటిడి ఆర్థిక వ‌న‌రులు పెంచుకోవ‌డం కోస‌మే రోజువారీగా భ‌క్తుల ద‌ర్శ‌నాల సంఖ్య‌ను పెంచుతూ పోతోంద‌ని కొంత‌మంది దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఈ విష‌యంలో ఆదాయ వ్య‌యాలు చూసే ఆలోచ‌నే ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి లేదు.
 • భ‌క్తులు ఎక్కువ మంది స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుని ఆశీస్సులు పొందితే క‌రోనా త్వ‌ర‌గా దూర‌మ‌వుతుంద‌నే ఉద్దేశంతోనే తొలుత రోజుకు 6 వేల‌తో ప్రారంభించిన ద‌ర్శ‌నం టికెట్ల‌ను 12 వేల‌కు పెంచాం.
 • గ‌త 28 రోజులుగా అనేక ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా టిటిడిలో 17 మంది సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వీరంద‌రినీ క్వారంటైన్‌కు పంపి అత్యుత్త‌మ వైద్య‌సేవ‌లు అందించ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశాం. వీరికి వారి నివాస ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, కుటుంబ స‌భ్యుల ప్ర‌యాణాల కార‌ణంగానే క‌రోనా వ్యాధి వ‌చ్చింద‌ని నిర్ధార‌ణ అయింది.
 • ఉద్యోగుల్లో మ‌నోధైర్యం పెంచ‌డానికి ఎంత ఖ‌ర్చు అయినా వెనుకాడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధికారుల‌ను ఆదేశించింది. ఉద్యోగుల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అండ‌గా ఉంటుంది. ఉద్యోగుల‌తో చ‌ర్చించి, అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ భ‌క్తుల‌కు సేవ చేయ‌డం కోసం శాస‌న‌స‌భ్యులు శ్రీ భూమ‌న క‌రుణాక‌రరెడ్డి, శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి బాధ్య‌తలు అప్ప‌గించాం.
 • తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులకు ప్ర‌స్తుతం వారానికోసారి షిఫ్టు అమ‌లు చేస్తున్నామ‌ని, ఉద్యోగుల ఆరోగ్యసంర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఇక‌పై షిఫ్టు విధుల‌ను రెండు వారాల‌కు పెంచాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేయిస్తాం.
 • క‌ల్యాణ‌క‌ట్టలో క్షుర‌కులు, త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే భ‌క్తుల ఆరోగ్యసంర‌క్ష‌ణలో భాగంగా క్షుర‌కులు ఒక భ‌క్తుడి త‌ల‌నీలాలు తీయ‌డానికి ఒక‌ గ్లౌజు చొప్పున వినియోగించేలా, క్షుర‌కుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండే పిపిఈ కిట్లు అందిస్తాం. ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీ కేంద్రాల వ‌ద్ద కూడా మ‌రిన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించాం.
 • శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం త‌రువాత ఉత్స‌వ‌మూర్తుల వాహ‌నాన్ని మోసే వాహ‌న‌బేర‌ర్ల‌కు మాస్కులు, గ్లౌజులు త‌ప్ప‌నిస‌రి చేస్తాం. వాహ‌నాన్ని మోసేందుకు వాడే తండ్ల‌ను(క‌ర్ర‌లు) ప్ర‌తిరోజూ శానిటైజ్ చేయాలని నిర్ణ‌యం.
 • భ‌క్తుల నుంచి వ‌స్తున్న విన్న‌పాల మేర‌కు క‌ల్యాణోత్స‌వ సేవ‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగిన నిర్ణ‌యం తీసుకుంటా ము. ఆన్‌లైన్ ద్వారా క‌ల్యాణోత్స‌వం టికెట్ తీసుకున్న భ‌క్తుల గోత్ర‌నామాలు అర్చ‌కులు చెబుతారు. త‌పాలా శాఖ ద్వారా భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపే ఏర్పాట్లు చేయాల‌ని అధికారులకు సూచించాము. ఈ సేవను మొద‌లుపెట్టే తేదీని అధికారులు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.
 • భ‌క్తులు ఇప్ప‌టివ‌ర‌కు దేవ‌స్థానానికి పూర్తిగా స‌హ‌క‌రించి క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ‌కు అన్ని ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటిస్తూ ఎవ్వ‌రికీ ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. ఇక‌మీద‌ట కూడా ఇలాగే స‌హ‌క‌రించి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని కోరుతున్నాం. తిరుప‌తిలోని స్థానిక ఆల‌యాల్లో కూడా తిరుమ‌ల త‌ర‌హాలో అన్ని జాగ్ర‌త్తలు తీసుకుని భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తాం.
 • భ‌క్తులంద‌రూ ముందుగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ద‌ర్శ‌నానికి రావాలి. దేశంలోని రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ జోన్ల‌లో ఉన్న భ‌క్తులు ద‌య‌చేసి ద‌ర్శ‌నానికి రాకూడ‌దు.

శ్రావ‌ణ‌మాసంలో క‌ర్ణాట‌క స‌త్రాల స‌ముదాయాల‌కు శంకుస్థాప‌న‌

తిరుమ‌ల‌లోని క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో టిటిడి లీజుకు ఇచ్చిన 7.05 ఎక‌రాల భూమిలో యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, క‌ల్యాణ‌మండ‌పం నిర్మాణానికి శ్రావ‌ణ‌మాసంలో తాను, ఎపి ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శంకుస్థాప‌న చేస్తామ‌‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప చెప్పారు.

 • సిఎం శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం, క‌ర్ణాట‌క సిఎం శ్రీ య‌డ్యూర‌ప్ప ఆహ్వానం మేర‌కు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల నిర్మాణాల వ్య‌వ‌హారంపై శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశంలో అవ‌గాహ‌న వ‌చ్చాం.
 • క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం టిటిడికి రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే టిటిడి నిబంధ‌న‌ల మేరకు టెండ‌ర్లు పిలిచి ఈ నిర్మాణాలు పూర్తి చేసేలా ఒప్పందం కుదిరింది.
 • తిరుమ‌ల‌లో అతిథిగృహాల నిర్మాణానికి స్థ‌లాల కేటాయింపు విష‌యంలో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఉండేందుకు సిఎం శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం మేర‌కు విరాళాల ప‌థ‌కం కింద ఆన్‌లైన్‌లో టెండ‌ర్ బిడ్డింగ్ ద్వారా స్థ‌లాలు కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ఈ స‌మావేశంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి, శేఖ‌ర్‌రెడ్డి, కె.పార్థ‌సార‌ధి, శ్రీ సి.ప్ర‌సాద్‌ కుమార్‌, గోవింద‌హ‌రి , ముర‌ళీకృష్ణ , జె ఈ ఓ పి.బసంత్ కుమార్ , సివి ఎస్ ఓ గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*