నేను పని చేస్తున్న పత్రిక ఎడిటర్ ను చంపేశారు…రామోజీరావు అక్షింతలు వేసేవారు…పడుపు వృత్తి చేసుకునే వాళ్ల ఇంటికి వెళ్లాను…!

  • సీనియర్ పాత్రికేయులు బుడమల మునిరత్నం రెడ్డి చెబుతున్న జ్ఞాపకాలు

పదో తరగతిలో అందరూ మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీషు ఫెయిలవుతుంటారు. నేను మాత్రం అవన్నీ పాసై, తెలుగులో ఫెయిలయ్యాను. అటువంటి నేను….ఆ తరువాతి కాలంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికలో డెస్క్‌ ఇన్‌ఛార్జిగా పని చేశానని చెబితే…. ఆశ్చర్యంగా ఉండొచ్చుగానీ ఇది వాస్తవం. పదో తరగతి తెలుగు ఫెయిలయ్యాక, తెలుగు బాగా నేర్చుకోవాలన్న కసి పెరిగింది. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు సంపాదిం చాన్నంత పట్టుదలతో భాష నేర్చుకోవడం మొదలుపెట్టాను. సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించలేదు గానీ…. అంతకంటే ఎక్కువగా భావించే ఈనాడు దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌, డెస్క్‌ ఇన్‌ఛార్జి కాగలిగాను.

అరంగేట్రమే సంచలన పత్రికలో…
డిగ్రీ అయిన తరువాత ఖాళీగా ఉంటే విజయవాడలో ఉంటున్న ఎర్రంశెట్టి రాజా అనే మిత్రుడు నన్ను అక్కడికి వచ్చేయమన్నారు. ఏ పనో కూడా చెప్పలేదు. సంచలన పత్రికగా మార్మోగుతున్న‌ ఎన్‌కౌంటర్‌ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్‌ గారితో నా మిత్రునికి పరిచయం ఉంది. దీంతో నన్నూ ఆ పత్రికలో పని చేయమన్నారు. డెస్క్‌లో ఉంటూ నాకు చేతనైనది రాస్తూ వచ్చాను. పత్రికలో వచ్చిన సంచలన వార్తల కారణంగా దశరథరామ్‌ హత్యకు గురయ్యారు. ఇందులోనే పనిచేసే మరో జర్నలిస్టు కూడా హత్యగావించబడ్డారు. అందులో పనిచేస్తున్నవారంతా చెల్లాచెదురయ్యారు. నేనూ తిరుపతికి వచ్చేశాను. 1985లో తిరుపతి కేంద్రంగా ‘తెలుగు పత్రిక’ అనే పేరుతో ఓ దినపత్రికను తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నించారు. ఆ పత్రికలో చేరాను. ఆ పత్రిక డమ్మీలు వచ్చాయిగానీ….రెగ్యులర్‌ పత్రిక వెలువడ లేదు.

ఆనాడే ఈనాడులోకి…
మా గ్రామానికి చెందిన, మా బావగారైన కళత్తూరు సుధాకర్‌ రెడ్డి అప్పటికే ఈనాడులో సబ్‌ఎడిటర్‌గా పని చేస్తున్నారు. నన్ను సబెడిటర్‌ ఉద్యోగం కోసం ఈనాడుకు తీసుకెళ్లారు. అప్పుడు తిరుపతి ఎడిషన్‌ న్యూస్‌ ఎడిటర్‌గా పతంజలి గారు ఉన్నారు. ఆయన నాకు ఓ ఇంగ్లీషు వార్త ఇచ్చి తెలుగులోకి అనువదించమన్నారు. అందులో నేను ఫెయిలయ్యాను. ఆ తరువాత కొన్నాళ్లకే, 1986లో ఈనాడులో జనరల్‌ డెస్క్‌, మఫిషియల్‌ డెస్క్‌ వేరువేరు అయ్యాయి. అప్పుడు మళ్లీ నన్ను పిలిచారు. ఈనాడు డైరెక్టర్‌గా ఉన్న మోటూరు గారు ఇంటర్వ్యూ చేశారు. సబ్‌ ఎడిటర్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. రూ.600 వేతనంతో, ఎన్‌ఎంఆర్‌గా అపాయింట్‌ చేశారు. అనంతపురం డెస్క్‌లో వేశారు. త్రిపురనేని శ్రీనివాస్‌, ఇంకొందరు ఆ డెస్క్‌ చూసేవాళ్లం. ఆ తరువాత కొంతకాలానికే చిత్తూరు జిల్లా డెస్క్‌కు ఇన్ ఛార్జిగా నియమించారు. అప్పుడు ఆరుగురు సబ్‌ ఎడిటర్లు, నలుగురు ఫ్రూప్‌ రీడర్లు ఉండేవారు.

రామోజీరావు వచ్చి సమీక్షలు చేసేవారు…
రెండు నెలకు ఒకసారి విలేకరుల సమావేశాలు ఎడిషన్‌ ఆఫీసులో జరిగేవి. ఈ సమావేశాలకు స్వయంగా రామోజీరావు గారే హాజరయ్యేవారు. ఆయన ప్రతి విలేకరికి సంబంధించిన లైన్‌ అకౌంట్‌ వివరాలను తెచ్చుకుని సమీక్షించేవారు. తక్కువ లైన్‌ అకౌంట్‌ ఉన్న విలేకరులను గుర్తించి….ఇంకా బాగా రాయాలని చెప్పేవారు. ఆ తరువాత డెస్క్‌లో ఉన్న అందరు సబ్‌ ఎడిటర్లతో (చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం డెస్కులు) సమావేశమయ్యేవారు. గడచిన రెండు నెలల్లో పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేవారు. బాగా ఉన్నవాటిని మెచ్చుకుంటూ ఆ వార్త రాసిన లేదా శీర్షికలు పెట్టిన వారిని అభినందించేవారు. జరిగిన తప్పులపై అక్షింతలు వేసేవారు. ఇవన్నీ ఈనాడు పత్రిక ప్రతిష్టను కాపాడటం కోసమే తప్ప…విలేకరులనో, సబ్‌ ఎడిటర్లనో కించపరచడానికి కాదని పదేపదే చెప్పేవారు. ఆ విధంగా రామోజీరావు గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను.

ఈనాడు ఆఫీసులోనే పేపర్లు పరచుకుని పడుకునేవాళ్లం….
డెస్క్‌కు వచ్చిన వార్తను మెరుగుపరచడం, సూపర్‌ లీడ్‌ రాయడం, మంచి శీర్షిక పెట్టడంపై డెస్క్‌లో విశేషమైన కసరత్తు జరిగేది. ఈ క్రమంలోనే పత్రిక ప్రింట్‌ అయ్యేదాకా ఆఫీసులోనే ఉండి, ఇక ఆ సమయంలో ఇంటికి వెళ్లలేక…. నేను, మా బావ సుధాకర్‌ రెడ్డి ఆఫీసులోనే పేపర్లు పరచుకుని పడుకున్న రోజు ఎన్నో..! అప్పట్లో ‘చిత్తూరు ఆనాడు ` ఈనాడు’ శీర్షికన ప్రతి బుధవారం ఇచ్చిన కథనాలు పత్రికకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

ఆ కోరికే ఉదయం వైపు నడిపించింది…
ఈనాడులో ఎంత కీలక స్థానంలో ఉన్నా బైలైన్‌తో (పేరుతో) వార్తలు రాసే అవకాశం ఉండేది కాదు. నాకు మాత్రం ఫీల్డ్‌కు వెళ్లాలని, ప్రత్యక్షంగా సమాచారం సేకరించి కథనాలు, ప్రత్యేకించి జీవన శైలికి సంబంధించిన కథనాలు రాయాలన్న కోరిక బలంగా ఉండేది. ఈ కోరిక నెరవేర్చుకునేందుకే….సజావుగా సాగుతున్న ఈనాడు ఉద్యోగాన్ని వదిలేసి ఉదయంలో చేరాను. నేను రాసే కథనాలను బైలైన్‌తో ప్రచురిస్తామన్న హామీతోనే అటువైపు వెళ్లాను. డెస్క్‌లో పని చేస్తూనే…వీలు చేసుకుని క్షేత్రస్థాయికి వెళ్లి రాసిన అనేక కథనాలు స్టేట్‌ ఫస్ట్‌ పేజీలో ప్రచురితం అయ్యాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది….మన రాష్ట్ర సరిహద్దుల్లో, కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని ఓ ఊరు గురించి రాసిన కథనం. అక్కడ పడుపు వృత్తి బహాటంగా సాగేది. మూఢాచారాలతో బసివినులుగా మారిన యువతులు చాలామంది ఆ ఊర్లో ఉండేవారు. ఒళ్లు అమ్ముకోవడమే వారి జీవనాధారం. ఇందుకు ఇంట్లోని వారు కూడా సహకరించేవారు. ఏజెంట్లు ఉండేవారు. విటులను ఇంటింటికీ తీసుకెళ్లి బసివినులను చూపించేవారు. వెళ్లిన విటులు ఒప్పందం కుదుర్చుకుని ఆ ఇంట్లో గడిపేవారు. ఇదో పెద్ద సామాజిక సమస్య. ‘బందీలం…బానిసలం…బతికివున్న శవాలం’ అనే శీర్షికతో ఎనిమిది రోజులు ధారావాహికంగా రాసిన కథనాలు ఉదయం స్టేట్‌ పేజీలో ప్రచురితమయ్యాయి. ఇవి రాష్ట్ర వ్యాపితంగా తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రాంతంలో ఓ గిరిజన తెగలో…భార్యను, గర్భవతి‌గా ఉంటే బిడ్డతో సహా అమ్ముకునే సంప్రదాయం ఉండేది. దీనిపైనా ప్రత్యేక కథనం రాశాను. ఇక శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాట య్యేటప్పుడు….వేల ఎకరా విస్తీర్ణంలో కంచెవేశారు. దీంతో బంగాళాఖాతం దీవుల్లో నివసిస్తున్న గిరిజన తెగకు దిక్కుతోచలేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియక భయంతో చనిపోయిన వాళ్లు ఉన్నారు. దీనిపైన ప్రపంచం మరచిన ప్రజలు, శాస్త్ర సాంకేతిక రంగాలు ఆకాశానికి…ఒక నాగరికత పాతాళానికి అని రాసిన కథనాలు ఆ తెగ ప్రజలకు ఆ తరువాత ఎంతో మేలు చేశాయి. ఇంకా నగరి సమీపంలోని ఓజీ కుప్పం దొంగల జీవనం గురించి, కరువుతో ముంబై రెడ్‌లైట్‌ ఏరియాకు చేరుతున్న రాయలసీమ యువతుల గురించి…ఇలా అనేక అంశాలపై రాసిన కథనాలు ఎంతో సంతృప్తిని కలిగించాయి.

ఉదయం అస్తమించాక…
ఉదయం మూతపడిన నేపథ్యంలో వార్త దినపత్రికలో చేరాను. వరంగల్‌, కడప జిల్లాల్లో ఇన్‌ఛార్జిగా పని చేశాను. ఉదయం పున:ప్రారంభించడానికి ప్రయత్నాలు జరగడంతో తిరిగి ఉదయంలోకి వెళ్లి కొన్ని నెలలు పని చేశాను. ఉదయం పత్రిక ప్రారంభం కాలేదు. దీంతో హైదరాబాద్‌ కేంద్రంగా వెలువడే మన ఎంఎల్‌ఏ అనే పత్రికలో చేరాను. ఆపై 1998లో తిరుమల వాణి పేరుతో ఓ స్థానిక పత్రిక ప్రారంభించాను. తెలుగునాడి, అలిపిరి, వేమన, ఛానల్‌ 8 వంటి స్థానిక పత్రికలు ప్రారంభించి నడిపాను. మధ్యలో మళ్లీ వార్తలో కొంతకాలం పని చేశాను. అయితే…సంపాదకునిగా ఉన్న ఏబికే ప్రసాద్‌ గారిని తొలగించిన యాజమాన్యం, అప్పుడు రాయలసీమ రోమింగ్‌ కరస్పాండెంట్‌గా ఉన్న నన్ను కూడా ఒక ఫోన్‌ కాల్‌తో తీసేసింది. ఇటువంటి చేదు జ్ఞాపకాలూ అనేకం ఉన్నాయి. ఆంధ్రప్రభలోనూ కొంతకాలం పని చేశాను. మొదటి పేజీలో బ్యానర్ కథనాలు, ఎడిట్ పేజీ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

కవితలు రాసే అవాలటు…
నాకు మొదటి నుంచి కవితలు రాసే అవాటు ఉంది. ఈనాడులో పని చేస్తున్నప్పుడే ‘రుషి’ అనే కలం పేరుతో రాసిన కవిత ఓ ప్రముఖ సాహిత్య పత్రికలో ప్రచురితం అయింది. అటువంటి కవితలు 10 దాకా ప్రచురితం అయ్యాయి. వివిధ పత్రికల్లో కథలూ ప్రచురితమ య్యాయి. ఇప్పటికీ పాత మిత్రులు నన్ను ‘రుషి’ అనే పేరుతోనే పిలుస్తారు. మునిరత్నం రెడ్డిలోని మునికి పర్యాయపదంగా రుషిని కలం పేరుగా మిత్రులు పెట్టారు. చిత్తూరు జిల్లా తూర్పు మండలాల మాండలిక పదాలను కూర్చి పదకోశం రాయాలన్న ఆలోచనలో భాగంగా… గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వినిపించే చాలా పదాలు సేకరించాను. ఆ పని కొనసాగుతోంది.

డెస్క్‌లోనే పని చేయడానికి కారణం ఏమంటే….
డెస్క్‌లో కాకుండా ఫీల్డ్‌లో ఉండివుంటే…. ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చేదేమో! అయితే…ఈనాడులో ఉన్నప్పుడే డెస్క్‌ లేదా ఫీల్డ్‌ అనే అప్షన్‌ ఒకాకొన సందర్భంలో వచ్చింది. అప్పుడు మా బావ కళత్తూరు సుధాకర్‌ రెడ్డి నన్ను డెస్క్‌లో ఉండమని సహా ఇచ్చారు. అందుకే డెస్క్‌లో ఉండిపోయాను. వాస్తవంగా డెస్క్‌ పని చాలా విశిష్టమైనది. శిలను శిల్పాలుగా మలిచే పని డెస్క్‌లో జరుగుతుంది. విలేకరి ఇచ్చే సమాచారాన్ని తీసుకుని, మంచి పదాలతో, ఆసక్తిదాయకంగా కథానాన్ని మలచి, మంచి శీర్షిక పెట్టి, మంచి లీడ్‌ రాసి, మంచి మేకప్‌ ఇచ్చి ప్రచురిస్తే…..ఆ వార్త పాఠకులను ఆకట్టుకుంటుంది. ఇదంతా డెస్క్‌లో సబెడిటర్‌ చేసినా…పేరు మాత్రం విలేకరికే వస్తుంది. విలేకరికి తన పరిధిలోని వార్త మాత్రమే రాసే అవకాశం ఉంటే… డెస్క్‌లోని వారికి ఎన్నో ప్రయోజకర కథనాలను రాయించే అవకాశం లభిస్తుంది. నా కెరీర్ లో అటువంటి వార్తలు కోకొల్లలుగా రాయించాను. అందుకే దీర్ఘకాలం పాటు డెస్క్‌లో ఎంతో సంతృప్తిగా పని చేయగలిగాను. ఎందరో గ్రామీణ విలేకరుల అభిమానాన్ని చూరగొనగలిగాను. పాత్రికేయునిగా గాక మరే ఇతర వృత్తిలో ఉన్నా ఇంత సంతృప్తి  పొందలేనని అనేక సార్లు అనిపిస్తుంది. – బుడమల మునిరత్నం రెడ్డి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*