ముక్కంటీ మూడో కన్ను తెరువు..! శ్రీకాళహస్తీశ్వర ఆలయం దళారుల రాజ్యం..! మామూళ్ల మత్తులో అధికార గణం..!!

  • వలిపి శ్రీరాములు,
  • ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

అధికారం…అవకాశం కలిసివచ్చినపుడు, ఆపై అడిగేవాళ్లు కరువైనపుడు…అవినీతికి అంతే ఉండదు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఆలయానికి వచ్చే భక్తులను దళారులు నిలువునా దోచేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారు. అవినీతిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇదే అదునుగా సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇక ఆలయంపై రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో…ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేకున్నారు. రాజకీయ నాయకులను ఎదురిస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారు.

దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్షేత్రం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతిగాంచింది. ఈ పూజలు చేయించుకునేందుకు దేశ విదేశాలకు చెందిన భక్తులు పోటెత్తుతున్నారు. ఇక స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులు నానాటికీ పెరుగుతున్నారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయాన్ని సగటున రోజుకు 30 వేల మందికిపైగా సందర్శిస్తున్నారు. సెలవు, వారాంతపు రోజుల్లోనైతే ఈ సంఖ్య 40 వేలకు మించుతోంది.

ఆలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి…భక్తులు ఆలయంలో అడుగుపెట్టినప్పటి నుంచి దళారులు, వ్యాపారులు మోసం చేస్తున్నారు. భిక్షాల గాలిగోపురం వైపు నుంచి వచ్చే భక్తులకు…రాహు-కేతు పూజ సామగ్రిని బలవంతంగా అంటగడుతున్నారు. గరిక, పూలు, టెంకాయ…ఇలా పలు రకాల వస్తువులను భక్తులకు విక్రయించి రూ.200 నుంచి రూ.500 దాకా గుంజుతున్నారు. తీరా ఆలయం మండపాల వద్దకు వెళ్లాక…ఈ పూజా సామగ్రి పనికిరాదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. భిక్షాల గాలిగోపురం పక్కన ఉన్న కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో రాహు-కేతు సర్ప దోష నివారణ పూజలు చేయించి భక్తులను మోసం చేస్తున్నారు. ఇదే మార్గంలోని రావిచెట్టుకు దారాలు కట్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మోసాలను అడ్డుకోవాల్సిన భద్రతా సిబ్బంది కూడా నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారు.

లగేజీ కౌంటర్లలో మోసం…ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తులు పాదరక్షకులు, సెల్‌ఫోన్లు, లగేజీ భద్రపరిచడానికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను టెండరు ద్వారా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగింగారు. ఇంతవరకు బాగానే ఉంది. భక్తుల వస్తువులు భద్రపరిచేందుకు నిర్ణీత ధరలు ఉన్నాయి. అయితే ఈ కౌంటర్లలో నిర్ణీత ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. అసలు ఇక్కడ ధరల పట్టిక కనిపించదు. ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇదంతా ఆలయ అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.

రాహు-కేతు మండపాల్లో… శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతు పూజలు చేయించుకోడానికి రూ.500, రూ.1500, రూ.2,500, రూ.5,000 టికెట్లు ఉన్నాయి. ఇందులో భక్తులు తమకు నచ్చిన టికెట్టు కొనుగోలు చేసి పూజలు చేయించుకోవచ్చు. పూజ కోసం అర్చకులకు, ఆలయ సిబ్బందికి ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే…పూజలు చేయించుకునే భక్తుల నుంచి యథేచ్ఛగా డబ్బులు గుంజుతున్నారు. దక్షిణ రూపంలో రూ.116 నుంచి రూ.1000 దాకా వసూలు చేస్తున్నారు. దక్షిణ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రూ.2,500, రూ.5,000 టికెట్టు కొనుగోలు చేసి పూజలు చేయించుకునే భక్తుల నుంచి పెద్ద మొత్తంలో ‘దక్షిణ’ డిమాండ్‌ చేస్తున్నారు. సామాన్య భక్తులు ఎక్కువగా చేయించుకునే రూ.500, రూ.750 మండపాల్లో వసూళ్ల దందా ఎక్కువగా కొనసాగుతోంది. రాహు-కేతు మండపాల్లో ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ విధుల కోసం సిబ్బంది, అర్చకులు పోటీపడుతున్నారు. ఆలయ అధికారులపై ఒత్తిడితెచ్చి…ఈ మండపాల్లో డ్యూటీలు వేయించుకుంటున్నారు. ఇక్కడ వచ్చే ఆదాయాన్ని అందరూ పంచుకుంటున్నారు. రాహు-కేతు పూజల మండపాల్లో పనిచేసే వారికి రోజు ఆదాయం వేలల్లో ఉంటోంది.

దళారులే…దళారులు..: ముక్కంటి ఆలయంలో ఇటీవల కాలంలో దళారుల బెడద ఎక్కువయింది. ఆలయ ఉద్యోగులే దళాగులే దళారుల అవతారం ఎత్తారు. వీరికి తోడు వివిధ రంగాలకు చెందిన వారు కూడా దళారుల అవవారం ఎత్తారు. దళారుల కారణంగా సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ ఉద్యోగులు కూడా దళారులకే ప్రాధాన్యమిస్తున్నారు. స్వామి, ఆమ్మవార్ల ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో దళారుల బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు శీఘ్రదర్శనం, అంతరాలయ దర్శనం చేయిస్తామంటూ దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆలయంలోనే తిష్టవేసి దళారీ పని చేస్తున్నారు. ఇక కొందరైతే రాజకీయ నాయకులు పేర్లు చెప్పుకుని దళారీపని చేస్తున్నారు. దళారుల కారణంగా ఆలయ ఆదాయానికి గండిపడుతోంది.

అవినీతిని అరికడతాం…ముక్కంటి ఆలయంలో అవినీతిని అరికడతాం. భక్తులను మోసగిస్తున్న దళారులపై చర్యలపై చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే శాఖాపరమైన చర్యలుంటాయి. భక్తులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే నాకు ఫిర్యాదు చేయవచ్చు. భక్తులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటా. రాహు-కేతు మండపాల్లో కానుకలు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. …… శ్రీరామ రామస్వామి, కార్యనిర్వహణాధికారి,

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*