పండగపూట పస్తులే…అందని వేతనాలు.. అవస్తల్లో సెక్యూరిటీ గార్డులు…శివయ్యా…నీవైనా కరుణించయ్యా…!

  • రవి, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి
  • తెల్లవారుజామున గుడి తెరవకముందే వెళ్లి కాపలాకాస్తున్న వారి బతుకులు జీతం భత్యం లేక చీకట్లోనే ఉండిపోతున్నాయి. కాళ్లు వాచేలా నిలబడి కాపలా కాస్తున్న వారు కూటి కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేక ఇంటి అద్దెలు చెల్లించలేక, నిత్యావసర సరుకులు కొనుక్కోను డబ్బులు లేక అవస్తలు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తుండటంతో పండగపూట కూడా పస్తులు తప్పవా అని మదనపడుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో వారు పడుతున్న వేదన ఇది.

జీతాలు రాక సెక్యూరిటీ గార్డుల అవస్తలు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సుమారు180 మంది సెక్యూరిటీగార్డులు ఓ ప్రయివేటు కాంట్రాక్టు ద్వారా పని చేస్తున్నారు. వీరు ఉదయం 5గం.ల నుంచి మధ్యాహ్నం1గంట వరకు కొందరు, ఒంటి గంటనుంచి రాత్రి 9గంటల వరకు మరికొందరు రెండు షిప్టులుగా పని చేస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వ రాలయంతోపాటు అనుబంధ ఆలయాలు ,దేవస్తానం వసతిగృహాలు, తదితర ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్నారు. ముక్కంటి ఆలయ పరిధిలో పనిచేసే అత్యధిక మంది గార్డులు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో అద్దెఇళ్లలో ఉంటూ డ్యూటీలు చేస్తున్న వారే. వీరికి ఒక డ్యూటీకిగాను 250 రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే గత మూడు నెలల క్రితం కొత్త ఏజెన్సీకి సెక్యూరిటీ కాంట్రాక్టు బాధ్యత అప్పగించారు. అప్పటి నుండి గార్డులకు జీతాలు చెల్లించలేదు. దీంతో గార్డులు నానా అవస్తలు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే కొందరు గార్డులు ధర్మచక్రంతో మాట్లాడుతూ జీతాలు లేక మూడు నెలలుగా అవస్తలు పడుతున్నట్లు తెలిపారు. ఇంటిఅద్దెలు లు చెల్లించలేక ,సరుకులు కొనేందుకు డబ్బులు లేక అవస్తలు పడుతున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ వృత్తే జీవనాధారంగా పెట్టుకుని ఉన్న తమకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు.

గత ఏజెన్సీ నిర్వాహకమే కారణమా..?
ముక్కంటి ఆలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీలకు జీతాలు సక్రమంగా రాకపోవడానికి గతంలో ఉన్న ఏజెన్సీ కారణమనే తెలుస్తోంది. గతంలో సెక్యూరిటీలకు పిఎఫ్ ,ఇఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించకుండానే జీతాలు చెల్లించేవారని చెబుతున్నారు. అయితే తాజాగా ఉన్న దేవస్తానం ఇఓ సెక్యూరిటీలకు పిఎఫ్, ఇఎస్ఐ కడితేనే తాజా ఏజెన్సీ కి దేవస్థానం నుంచి రావాల్సిన డబ్బులు చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో తాజా ఏజెన్సీ సెక్యూరిటీలకు పిఎఫ్, ఇఎస్ఐ కట్టినట్లు తెలిసిందే. ఈ కారణంగానే జీతాలు చెల్లింపు ఆలస్యమయినట్లు సమాచారం.

రెండు రోజుల్లో జీతాలు చెల్లింపు.. ఏజెన్సీ
దేవస్థానంలో పనిచేస్తున్న సెక్యూరిటీలకు జీతాలు చెల్లించని విషయమై సంబందిత ఏజెన్సీ ని ధర్మచక్రం వివరణ కోరగా పిఎఫ్, ఇఎస్ఐ కట్టడం ఆలస్యమైందని తాజాగా అన్నీ సిద్దంచేసి ఫైల్ దేవస్థానం అధికారులకు పంపినట్లు తెలిపారు. రెండురోజుల్లో జీతాలు చెల్లిస్తామని పేర్కొన్నారు. గతంలో లేని విధంగా సెక్యూరిటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అందుకే జీతాలు చెల్లింపు ఆలస్యమయిందని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*