పక్క రాష్ట్రాల్లో రాజకీయాలు .. ప్రమాదకర ధోర‌ణులు..!

వర్తమాన రాజకీయాల్లో కొన్ని విపరీత, ప్రమాదకర పోకడలు పొడచూపుతున్నాయి. భాష పేరుతో పక్క రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేయడం చూస్తుంటే ఇది ప్రమాదకర ధోరణిగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అదీ సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పోటీ చేసింది. చంద్రబాబు నాయుడు సీమాంధ్రులు స్థిరపడిన ప్రాంతంలోనే ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తానూ వేలుపెడతానని కెసిఆర్‌ ప్రకటించారు. ఇటీవల కర్నాకటలో ఎన్నికలు జరిగితే….బిజెపిని ఓడించాలంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు గతంలో పలు పర్యాయాలు చెప్పారు.

ఈ ధోరణి ఏ మాత్రం ఆహ్వానించదగినది కాదు. కాంగ్రెస్‌, బిజెపి, సిపిఎం, సిపిఐ వంటి జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయవచ్చు. ప్రచారం చేయవచ్చు. అర్థముంటుంది. అయితే…. పాంతీయ పార్టీలకు పరిమితులు, హద్దులు ఉంటాయి. వాటిని ఎప్పుడూ దాటకూడదు. బెంగుళూరులో స్థిరపడిన తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగువారైనా…ఇక వారు కర్నాటక వాసులే. అక్కడి రాజకీయాల ఆధారంగానే ఓటు ఎలా వేయాలో నిర్ణయించు కుంటారు. అంతేగానీ….తెలుగు రాష్ట్రంలోని రాజకీయాల ఆధారంగా అక్కడి ప్రజలను ఓట్లేయమని చెప్పడం వల్ల సరైనది కాదు. ఈ విధంగా స్పందించి అక్కడ ఓట్లు వేస్తే….కన్నడిగులకు, అక్కడ స్థిరపడిన తెలుగువాళ్లకు మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. తెలంగాణ విషయంలోనూ అంతే. తెలంగాణ రాజకీయాల ఆధారంగా అక్కడి సీమాంధ్రులు నిర్ణయం తీసుకోవాలి తప్ప….ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను బట్టి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని సెటిలర్లు ఈ కోణంలో ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. కానీ నాయకులకే అర్థం కావడం లేదు. స్వప్రయోజనాల కోసం భాషను, ప్రాంతీయభావాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధిపొందాలని చూస్తున్నారు.

ఈ అంశాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే….ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో తమిళ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉంటారు. అందుకని…ఏనాడూ తమిళనాడు పార్టీలు ఇక్కడికి వచ్చి ఫలానా పార్టీకి ఓట్లేయండి…ఫలానా పార్టీని ఓడించండి అని చెప్పిన ఉదంతాలు లేవు. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న తమిళులు కూడా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఓట్లు వేస్తారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కన్నడిగులూ ఉన్నారు. కన్నడ పార్టీలూ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. తెలుగువారు ఎక్కడున్నా అక్కడికెళ్లి ప్రచారం చేస్తానంటోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని తెలుగువారిపై స్థానికంగా కక్ష పెరగడం తప్ప అక్కడి వారికి ప్రయోజనం ఉండదు.

కెసిఆర్‌కూ ఇదే సూత్రం వర్తిస్తుంది. చంద్రబాబుపై కోపంతో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాజకీయాలు చేస్తానని ఆయన ప్రకటించడంలో తప్పులేదుగానీ… సావధానంగా ఆలోచించినపుడు ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం అంత పరిణతితో కూడిన నిర్ణయం అనిపించుకోదు. టిఆర్‌ఎస్‌ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ. అది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాజకీయాలు చేయడమనేది….తెలుగు ప్రజల మధ్య విభేదాలకు ఉపయోగపడుతుంది తప్ప…ఎవరికీ మేలు చేయదు. కెసిఆర్‌ తాత్కాలిక కోపతాపాలను పక్కనపెట్టి….విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*