పత్రికలకు వారాని ఒక రోజు సెలవు ఇచ్చేస్తే పోలా..!

న్యూస్‌ ప్రింట్‌ (పత్రికలు ముద్రించే కాగితం) విపరీతంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. జిఎస్‌టి వచ్చిపడింది. అన్నింటికీ మించి రూపాయి ధర పతనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పత్రికల నిర్వహణ భారమవుతోంది. ఈ పరిస్థితుల్లో పత్రిక ధర పెంచడం లేదంటూ ఈనాడు దినపత్రిక ప్రకటించింది.

ఇప్పటిదాకా సాధారణ రోజుల్లో రూ.5గా ఉన్న ధరను రూ.6.50 చేశారు. ఆదివారం నాడు రూ.6గా ఉన్న ధరను రూ.8కు పెంచారు. పాఠకులపై నెలకు రూ.50 దాకా అదనపు భారం పడుతుంది.

ఈనాడు బాటలోనే ఆంధ్రజ్యోతి, నవతెలంగాణ పత్రికలూ ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. మిగిలిన పత్రికలు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సివుంది. తాను ధర పెంచడం లేదని సాక్షి ప్రకటించింది. ఎన్నికల తరువాత సాక్షి కూడా ధర పెంచొచ్చు.

ఒకప్పుడు తెలుగు దినపత్రికల ధర రూ.2 (ఆదివారం రూ.2.5) ఉండేది. చాలా ఏళ్లు ఈ ధర పెరగలేదు. పేపర్‌ బిల్లు రూ.70తో అయిపోయేది. దీంతో ఒక దశకు వచ్చే సరికి సర్క్యులేషన్‌ బాగా పెరిగింది. ఒకప్పుడు ఊరికి ఇకరిద్దరు మాత్రమే పత్రిక కొనుగోలు చేసేవారు. ఆ తరువాత చిన్నపల్లెలోనూ 20 నుంచి 30 ఇళ్లవారు పత్రికలు కొనుగోలు చేయడం మొదలు పెట్టారు.

అప్పట్లో ఒక పత్రికకే పరిమితం అయ్యేవాళ్లు. ఇప్పుడు పత్రికలూ రాజకీయ రంగు పులుముకోవడంతో…ఒక పత్రిక చూస్తే సరిపోవడం లేదు. కనీసంగా రెండు పత్రికలు చూడాల్సిన పరిస్థితి. అందుకే చాలామంది రెండు పత్రికలు వేసుకుంటున్నవారు ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో ఆ మధ్య పత్రికల ధరను రోజువారీ రూ.5, ఆదివారాల్లో రూ.6కు పెంచారు. ఇప్పుడు మళ్లీ ధర పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ఒక పత్రిక కొనేవారు రూ.200, రెండు పత్రికలు కొనేవారు రూ.400 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

న్యూస్‌ప్రింట్‌ ధర భారీగా పెరిగిన మాట వాస్తవం. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగాయనడంలో సందేహం లేదు. రూపాయి విలువ పతనం, జీఎస్‌టి మరింత భారమయ్యాయనడంలో సందేహం లేదు.

అందుకని…పత్రికల ధరలు పెంచుకుంటూపోవడం సమంజసమా? ఇది ఇతర వినియోగ వస్తువు వంటిది కాదు. సాధారణ ప్రజలకూ అందుబాటులో ఉండాల్సిన వస్తువు. అందుకే సాధ్యమైనంత వరకు పత్రికల ధర పెరగకుండా చూడాలి. ఇందుకు మార్గాలు లేవా? కచ్చితంగా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రధాన దినపత్రికలు అనవసరమైన పోటీకి, ఆర్బాటానికి పోతున్నాయి. దీంతో అవసరానికి మించిన పేజీలు ఇస్తున్నాయి. మెయిన్‌ 16, జిల్లా టాబ్లాయిడ్‌ 16 పేజీలు ఇస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గనికి 2 పేజీలు ఇస్తున్నాయి. అన్ని పేజీలు అవసరమా? ఆ పేజీల్లో ఎంత ప్రయోజనకర సమాచారం ఇస్తున్నారు? అనేది పత్రికా యాజమాన్యాలు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికలకు వారానికి ఒక రోజు సెలవు ప్రకటించినా మునిగిపోయేది లేదు. టివిలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్‌ మీడియా వచ్చింది. దీంతో ఎప్పటి సమాచారం అప్పుడు వచ్చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రోజూ పత్రికలు ముద్రించి న్యూస్‌ప్రింట్‌ వృథా చేయాల్సిన అవసరం లేదు. భారం మోయాల్సిన పనిలేదు. వారానికి ఒకరోజు సెలవు ఇవ్వడం వల్ల పత్రికా నిర్వహణ వ్యయం తగ్గుతుంది. పేజీలు తగ్గించడం, వారానికి ఒక రోజులు సెలవు ప్రకటించడం గురించి యాజమాన్యాలు ఆలోచించాలి.

ధర పెరిగిందన్న కారణంగా ఒక్క కాపీ కూడా ఆగిపోకుండా చూడండి…అంటూ ఈనాడు యాజమాన్యం తన ఏజెంట్లను కోరింది. ప్రస్తుతం పెరిగిన ధర ప్రభావం ఆ పత్రిక సర్క్యులేష్‌పై తీవ్రంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*