పత్రికలు, ఛానళ్లు ఉన్నాయా..!

– పార్టీల కరపత్రాలుగా పత్రికలు

– పార్టీల మైకులుగా ఛానళ్లు

2014 ఎన్నికల తర్వాత విజయవాడలో ఒక సెమినార్ జరిగింది. ఈ సెమినార్లో హిందూ పత్రిక మాజీ సంపాదకులు ఒకరు ప్రసంగిస్తూ ఎపిలో పాపులర్ మీడియా వ్యవహార సరళి గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాపులర్ మీడియా సామాన్య ప్రజల కష్టాలు కన్నీళ్లు ప్రతిబింబించడం లేదని పాలక వర్గాల సేవలో తరిస్తోందని అన్నారు. ఆయన ఆరోపించినట్లు తదుపరి ఈ అయిదు ఏళ్ల కాలం ఈ పాపులర్ మీడియా ప్రభుత్వాధి నేతకు పోటీ కాళ్ళుగా పని చేయడం అందరికి తెలిసిందే. ఈ కథ అంతటితో ఆగ లేదు. కట్టుబట్టలతో వచ్చినామని నిరు పేద రాష్ట్ర మని ముఖ్యమంత్రి ఒకవేపు ఊదర గొడుతూ మరో వైపు కోట్లాది రూపాయలు ప్రచారం కోసం మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. అందులో భాగంగా ఈ పాపులర్ మీడియాతనకు పోటీ కాళ్ళుగా వున్నందుకు
ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నజరానాల గురించి ఇటీవల “కాగ్” తన నివేదికలో ఫినాయిల్ వేసి నిర్భయంగా కడిగి పారేసింది.

ఈ నివేదిక ప్రకారం ఒక తెలుగు దిన పత్రికకు మూడు ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 33.05 కోట్ల రూపాయలు, మరో దిన పత్రికకు 21.09 కోట్ల రూపాయలు ప్రకటనలరూపంలో ప్రజాధనాన్ని సమర్పించారు. మొత్తం మూడు ఏళ్ల కాలంలో 125.42 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఖర్చు చేస్తే 44 శాతం రెండు దిన పత్రికకే ముఖ్యమంత్రి ఆదేశానుసారం కేటాయించినట్లు రాష్ట్ర సమాచార శాఖ అధికారులు “కాగ్” కు వివరణ ఇచ్చు కున్నారు. మరో పత్రికకు సర్క్యులేషన్ వున్నా ఆమేరకు ఎందుకు ఇవ్వ లేదనే అంశం లేవదీసిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
.ఈ కథనం తిరిగి తెర మీదకు ఎందుకు తీసుకు రావాలసి వస్తున్నదంటే ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ఈ పాపులర్ మీడియా అధికార పార్టీకి కర పత్రాలుగా మారి పోవడంతో సమస్య ప్రముఖంగా తెర మీదకు వచ్చింది.

ఈ పాపులర్ మీడియా ఏ పార్టీ కొమ్ము కాచినా ప్రజలకు సంబంధించి నిమిత్తం లేదు. అది వారి స్వంత విధానం. అయితే గత కొంతకాలంగా పాపులర్ మీడియా పేరుతో వార్తా పత్రికలుగా వ్యవహరింపబడి ప్రజాధనాన్ని ప్రకటనల ద్వారా కొల్ల గొట్టి ప్రస్తుతం ఎన్నికలు వచ్చే సరికి అధికారుల పార్టీకి మాత్రమే కొమ్ము కాయడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో సదరు మీడియాను కూడా ప్రజలు నిలదీసే హక్కు కలిగివున్నారు.
ఈ మీడియా ప్రజా జీవితంలో ఒక భాగ మైనపుడు ప్రజల నిలదీతకు బద్దులై వుంటారు.
ప్రజాధనాన్ని “నీకింత నాకింత” కింద పంచుకు తిన్న అధికార పార్టీని దానితో జట్టు కట్టిన మీడియా విధిగా ప్రజలకు జవాబుదారులే.

ప్రస్తుతం ఎపిలో వార్తా పత్రికలు లేవు. ఛానల్స్ అంత కన్నా లేవు. అధికార పార్టీకి కొమ్ము కాచే కర పత్రాలుగా మిగిలి పోయాయి. ఏ ఛానెల్ పెట్టినా ముఖ్యమంత్రి ప్రసంగాలు పత్రికల పుటలు తిప్పితే ప్రతి పక్షంపై శాప నార్దాలు తప్ప మరో వార్త కనిపించడం లేదు. ఇన్నాళ్లు ప్రజాధనంతో బొజ్జలు నింపుకొన్నందుకు కృతజ్ఞత తీర్చుకొంటున్నారు.
మరో వైపు ప్రధాన ప్రతిపక్షం మీడియా కూడా ఆ పార్టీ కరపత్రంగా మిగిలిపోయింది. వేసవి ఎండలు మండిపోతున్నాయి. తాగు నీటి కొరత విశ్వ రూపం దాల్చింది. పశువులకు గ్రాసం దొరకడం లేదు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరి వలన ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. మొత్తం నిధులు పసుపు కుంకుమ కే సరిపోయింది.

ఆర్థిక స్థితి ఘోరంగా తయారైంది. ఈ లాంటి అంశాలు ఇన్నాళ్లు ప్రజా ధనం ప్రకటనల రూపంలో బొజ్జలు నింపు కున్న పాపులర్ మీడియా కు పట్టక పోగా అధికార పార్టీకి కర పత్రాలుగా మిగిలి పోయాయి.

– వి. శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*