పత్రికలు, టివి ఛానళ్లు బాగానే బాగుపడుతున్నాయి….

ఆంధ్రప్రదేశ్‌ను పేద రాష్ట్రమని ఎవరైనా అంటే అంగీకరించకూడదు. విభజన అనంతరం రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉందని ఎవరైనా చెబితే ఒప్పుకోకూడదు. రాజధాని నిర్మాణానికి నిధుల కొతర ఉందని ఎవరైనా మాట్లాడితే కరెక్టే అని అనకూడదు. ఇది పేద రాష్ట్రం కాదు. సుసంప్నమైన రాష్ట్రం. నెలకోసారి కోట్లాది రూపాయలు ఖర్చుచేసి పేజీలకు పేజీలు ప్రకటనలు ప్రకటనలు ఇవ్వగల ఆర్థిక పుష్టివున్న రాష్ట్రం. రోజుకో పథకాన్ని ప్రకటించి….టివి ఛానళ్లలో ప్రకటనలు హోరెత్తించగల సత్తావున్న రాష్ట్రం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులయిందట…ఆ సందర్భంగా ప్రగతి పేరుతో పత్రికల్లోనూ, టివి ఛానళ్లలోనూ ప్రకటనలతో హడావుడి చేస్తున్నారు. మొన్న లక్షల సంఖ్యలో ఎన్‌టిఆర్‌ గృహాలు ప్రారంభించారంటూ ప్రకటనలు హోరెత్తాయి. నిన్న ఎన్‌టిఆర్‌ క్యాంటీన్ల పేరుతో ప్రకటనలు, అంతకు ముందు నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రకటనలు. మొలకల పున్నమి పేరుతో ప్రకటనలు. రేపు జన్మభూమి పేరుతో ప్రకటనలు, ఆపై ప్రగతి నివేదికల పేరుతో ప్రకటనలు….ఇదీ రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్‌లో ఉందని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరు. ప్రభుత్వం 1500 రోజులు పూర్తిచేసుకుంటే…అది తిరుగులేని విజయం సాధించినట్లు చెప్పుకోవాల్సిన సందర్భమా? కోట్లకు కోట్లు ఖర్చుచేసి ప్రచారం చేయాల్సిన అవసరమా? ప్రజాధనం ఇలా వృథా చేయడం సమంజసమా?

ఇదేకాదు..అన్న క్యాంటీన్ల విషయంలోనూ ఇటువంటి దుబారానే జరిగింనిపిస్తోంది. తెలంగాణలో ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి రూ.4.60 లక్షలు ఖర్చయితే…ఇక్కడ రూ.36 లక్షలు ఖర్చు చేస్తున్నారట. అయినా సరసమైన ధరల్లో భోజనం పెట్టే క్యాంటీన్‌కు అంతటి హంగులు అవసరమా? ఇది జనం కోసమా? కాంట్ట్రార్ల కోసమా? ఈ క్యాంటీన్లలో ఏసిలు కూడా పెడతామంటున్నారు మంత్రి నారాయణ. ప్రతి పట్టణంలోనూ ఫాస్ట్‌ఫుట్‌ సెంటర్లు ఉన్నాయి. ఎన్నిట్లో ఏసిలు ఉన్నాయి, ఇంతటి హంగులున్నాయి. తీరా ఇంతచేసి అక్కడ గంటలో భోజనం ఖాళీ అవుతోంది. వీలైతే ఇంకో గంట ఎక్కువ సమయం భోజనం దొరికేలా చేయగలిగితే మేలుగానీ….ఏసిలు, షోకులు ఎందుకు?

ప్రభుత్వాలు తాము చేసిన పనుల గురించి చెప్పుకోవడలో తప్పులేదుగానీ…అది హద్దులు దాటకూడదు. ప్రతి కార్యక్రమానికీ పేజీల కోద్దీ ప్రకటనలు ఇవ్వడం, గంటల కొద్దీ టివి ఛానళ్లలో యాడ్స్‌ ఇవ్వడం వల్ల అమితమైన ప్రచారం లభించవచ్చుగానీ….ఆచరణ కంటే ప్రచారం ఎక్కువగా ఉంటే అభాసుపాలయ్యేది ప్రభుత్వమే. ఈ ప్రచారం వల్ల పత్రికలు, టివి ఛానళ్లు మాత్రం బాగానే బాగుపడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*