పవన్‌ కల్యాణ్‌ ‘అరే ఓ సాంబ…హుకుం సర్దార్‌’ ప్రోగ్రాం!

మీడియా సంస్థలతో మొదలైన వైరాన్ని కొనసాగించాలనే భావిస్తున్నట్లున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ప్రధానంగా ఏబిఎన్‌, ఆంధ్రజ్యోతిపైన; టివి 9కు వ్యతిరేకంగా తీసుకున్న ధోరణిలోనే సాగుతున్నట్లున్నారు. ఏబిఎన్‌ వ్యానుపై దాడి చేయడంతో….పవన్‌ అభిమానులపై హైదరాబాద్‌లో పోలీసు కేసుపెట్టారు. అదేవిధంగా ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆర్‌కె వీకెండ్‌ కామెంట్‌లో పవన్‌పై ఘాటుగానే విమర్శించారు. ఇదిలావుండగా టివి 9 అధినేత శీనురాజు పవన్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. కొన్ని పాత్రికేయ సంఘాలు కూడా మీడియాపై పవన్‌ అభిమానుల దాడిని ఖండించాయి. మీడియాతో విరోధం పెట్టుకోవొద్దని చాలా మంది పవన్‌కు సూచనలు కూడా చేశారు.

అయినా పవన్‌…తన ఆలోచన మార్చుకున్నట్ల లేదు. ఆదివారం ఉదయం నుంచి ట్విట్టర్‌ ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. త్వరలోనే సరదాగా, కాలక్షేపం కోసం ‘అరే ఓ సాంబ…హుకుం సర్దార్‌’ ప్రోగ్రాం మీ ముందుకు రాబోతోందని ట్విట్‌ చేశారు. అంతకు కొంత సేపటికి ముందు….ఏబిఎన్‌ అధినేత ఆర్‌కెని ఉద్దేశించి, ‘చొక్కా విప్పి మాట్లాడుకుందాం…చొక్కా విప్పి కొడదాం’ అంటూ ఒక ట్విట్‌ చేశారు. త్వరలోనే గబ్బర్‌ సింగ్‌ ప్రపంచం నుంచి చిన్న గుసగుసలు, సంభాషణలు, ఫొటోలు, వీడియోలు వస్తాయి…అని పేర్కొన్నారు. దీనికి మునుపే టివి 9 రవి ప్రకాష్‌కు సంబంధించి పాత వీడియో ఒక దాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

పవన్‌ స్పందన చూస్తుంటే…మీడియా సంస్థల లోగుట్టులను వెలికి తీసేపనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఏం బయటపెట్టబోతున్నారు, అవి ఎంత ప్రభావం చూపుతాయి, అవి పవన్‌ రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది వేచి చూడాలి. అయితే…మీడియాకు పవన్‌ భయపడిపోయాడు అనే భావన తన అభిమానుల్లో, జనసేక కార్యకర్తల్లో కలగకుండా ఉండేందుకు ఈ ట్విట్లు ఉపయోగపడతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*