పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆ వ్యాఖ్యల్లోని అర్థం ఏమిటి..?

జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యాఖ్య చేశారు. దీన్ని తరచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజలకు సేవ చేయాలనుకునే వారు మాత్రమే జనసేనలో చేరాలని చెప్పిన ఆయన…తనకు ఏ పార్టీతోనూ శత్రుత్వం లేదన్నారు. అంతటితో ఆగితే ఆయన వ్యాఖ్యల్లో రొటీన్‌ మాటలుగానే వదిలేయొచ్చు. అయితే…తనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా బద్ధ శుత్రువు కాదని అన్నారు. ఈ మాటల వెనుక అర్థాలేమిటనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపికి మద్దతు ఇచ్చి, ఆ పార్టీల గెలుపు కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన పవన్‌ కల్యాణ్‌….వైసిపిని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏళ్లు గడిచిన తరువాత…ప్రత్యక్షంగా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్‌… తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతిలో కూరుకుపోయిందని మండిపడుతున్నారు. ఒకప్పుడు కాటన్‌ దొర కరువును పాలద్రోలడానికి ప్రాజెక్టులు నిర్మిస్తే…తెలుగుదేశం ప్రభుత్వం డబ్బుల సంపాదన కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. రోజూ టిడిపి ప్రభుత్వంపైన, నాయకులపైన ధ్వజమెత్తుతూనే ఉన్నారు.

ఎన్నికల్లో పవన్‌-జగన్‌ కలుస్తారని మొదట్లో వార్తలొచ్చాయి. ఎందుకో తెలియదుగానీ ఆ దశలో పవన్‌పై జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని కూడా ఇదే స్థాయిలో స్పందించారు. ఇద్దరి మధ్య పొత్తువుండదనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికే అలా మాట్లాడుకున్నారన్న చర్చ జరిగింది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తనకు టిడిపి, వైసిపి సమాన ధూరమేనని వ్యాఖ్యానించారు. తాజాగా వైసిపి తనకు బద్ధ శత్రువేమీ కాదనే వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఎవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రాకుంటే…సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈసారి జనసేన సహకారం లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని పవన్‌ చెబుతూవస్తున్నారు. ఇటువంటి సంకీర్ణం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులే వస్తే…టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే…గత ఎన్నికల్లో పవన్‌ మద్దతు తీసుకున్న టిడిపి…ఆయన కాస్త ఎదురుతిరిగే సరికి బద్ధ శత్రువులా చూస్తోంది. పవన్‌ దాడి కూడా తెలుగుదేశంపైనే ప్రధానంగా ఉంది. అందుకే టిడిపిని మళ్లీ అధికారంలోకి తీసేకొచ్చే పనిని పవన్‌ చేయకపోవచ్చు. ఇక మిగిలింది వైసిపి మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్‌ తాజా వ్యాఖ్యలను చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*