పవన్‌ తవ్వకాల్లో ఏమి బయటపడుతాయో!

తెలుగుదేశం పార్టీపైన, కొన్ని టివి ఛానళ్లపైన మనస్తాపంతోనూ, ఆగ్రహంతోనూ ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అదేపనిగా….లోగుట్టులను తవ్వితీసే పనిలో ఉన్నారు. టివి ఛానళ్ల అధిపతులకు సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే దొరకబుచ్చుకుని జనంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లున్నారు. ఇలాంటి విషయాలను బహిర్గతం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో…ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చేసిన ట్విట్‌ ఉదాహరణగా ఉంది.

శ్రీనివాసరాజు చలపతి, ప్లాట్‌ నెం. 1317, రోడ్‌ నెం.66, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌-500032 అనే చిరునామా కలిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లు పవన్‌ ఓ ట్విట్‌ చేశారు. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టిడిపికి విరాళాలు ఇచ్చిన వారి జాబితా తీసుకుని, ఈ చిరునామానాను మాత్రమే హైలెట్‌ చేసి (మిగిలినవి కనిపించకుండా బ్లర్‌ చేశారు)… ‘ఎవరు?’ అని ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. టివి 9 అధినేత పేరు శ్రీనిరాజు. ఆ శ్రీనిరాజే ఈ శ్రీనివాసరాజు అనే అనుమానంతో ఈ పోస్టు చేసినట్లున్నారు. ఇదేవిధంగా నేను తెలుగుదేశం నాయకులను విమర్శిస్తే శ్రీనిరాజు నాకు లీగల్‌ నోటీసులు పంపడం ఆశ్చర్యంగా ఉందంటూ మరో ట్విట్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు పవన్‌. అదేవిధంగా ‘ఈ ఆరు నెలలు ఆ మూడు ఛానళ్లు నిర్వహిస్తున్నవారు చేస్తున్న భావేద్వేగ అత్యాచారాల నుంచి రక్షించడానికి ఎలాంటి నిర్భయ చట్టం తేవాలి?’ అంటూ ఎద్దేవా చేస్తూ ఉదయమే ఒక ట్విట్‌ చేశారు.

ఇలాంటి ట్విట్‌ల ద్వారా పవన్‌ కల్యాణ్‌ ఏంసాధించాలనుకుంటున్నదీ అర్థం కావడం లేదు. తన అభిమానులను ఉత్సాహపరచడానికి మాత్రం ఇవి బాగానే ఉపయోగపడుతున్నాయి. పవన్‌ చేసిన ట్విట్‌లను వేలాది మంది రీ ట్విట్‌ చేస్తున్నారు. అయితే…ఒకటి మాత్రం అర్థమవుతోంది. ఆయన కొన్ని మీడియా సంస్థలను ఢీకొనడం ద్వారా తన ఇమేజ్‌ను పెంచుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలను అనుకూలంగా మలచుకునేందుకూ కృషి చేస్తున్నారు. ఈ తేడాలు ఆయన ట్విట్‌లలోనూ, ఛానళ్ల ప్రసారాలలోనూ కనిపిస్తోంది. కొసమెరుపు ఏమంటే…పవన్‌ సొంతంగా ఛానల్‌ పెడతారన్న ప్రచారమూ ఊపందుకుంటోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*