పవన్‌ మీరు ధ్యానం చేసుకోండి….అక్కడ తన్నుకుపోతున్నారు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు వెళ్లి, ఓ మఠంలో ఏకాంతంగా, ధ్యానం చేస్తూ గడిపారు. ఇదే సమయంలో బిజెపి కన్నా లక్ష్మీనారాయణను తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. ఈ రెండింటికీ లింకేమిటని అనుకోవచ్చు. లింకు ఉంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ పార్టీ స్థాపించి, కుదిరితే ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తున్నారు. పార్టీ పెట్టారుగానీ…దాని భవిష్యత్తు ఏమిటో ఇప్పటిదాకా అంతుచిక్కడం లేదు. ఆయన వెనుక నిలబడే సామాజికవర్గమేదో కూడా తెలియడం లేదు. కులాలతో పని లేదని, అన్ని కులాలూ కావాలి అని ఎంత చెప్పుకున్నా…రాష్ట్రలోని మూడు ప్రధాన కులాల్లో ఏదో ఒక కులం సంపూర్ణ మద్దతు లేకుండా రాజకీయ పార్టీ రాణించడం కష్టతరమైపోయింది. రెడ్డి సామాజికవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌తో ఉండేవాళ్లు. వైసిపి ఆవిర్భవించాక అటువైపు మొగ్గారు. కమ్మ సామాజికవర్గం మొదటి నుంచి టిడిపితోనే ఉంది. ఇక కాపు సామాజికవర్గమే ఎటూకాకుండా ఉంది. అటు టిడిపి, ఇటు వైసిపిల్లో ఉన్నారు. అయితే…తమకూ ఓ పార్టీ ఉండాలని కాపులు కోరుకుంటున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినపుడు కాపులు పూర్తి అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే….బిజెపి రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపైన కన్నేసింది. తమకూ ఒక పార్టీ ఉండాలని భావిస్తున్న కాపులకు పెద్దపీఠ వేయడం ద్వారా ఆ సామాజిక తరగతిని ఆకర్షించాలని భావిస్తోంది. అందులో భాగంగానే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించింది. 2014లో బిజెపిలో చేరిన ఆయన….ఇటీవలే పార్టీ మారాలని అనుకున్నారు. రేపు ఉదయం వైసిపిలో చేరతారనగా….తెల్లవారిజామున ఆనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైసిపిలో చేరికకు బ్రేక్‌పడింది. బిజెపి అధిష్టానం నిలువడించడం వల్లే కన్నా అనారోగ్యం హైడ్రామా నడిపారని విమర్శలు వచ్చాయి. అప్పుడే బలమైన హామీ ఆయనకు ఇచ్చారు. ఆ హామీ మేరకే అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. సోము వీర్రాజు ఈ పదవి కోసం పోటీపడినా….కాపు సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వడం ద్వారా ఒక సంకేతాన్ని కాపుల్లోకి పంపడం కోసమే…పార్టీ నిబంధనలను కొన్నింటిని పక్కనపెట్టి మరీ కన్నాను అధ్యక్షున్ని చేశారు. ముద్రగడ పద్మనాభం వెంటనే కన్నాను కలిసి చర్చించారు. ఇదంతా చూస్తుంటే…కాపులు బిజెపికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పవన్‌ జనసేన పరిస్థితి ఏమటనేది ప్రశ్న.

రాజకీయ పార్టీలకు అన్ని పార్టీలూ కావాలనేది ఎంత వాస్తవమో….దేశంలో ఏ పార్టీని తీసుకున్నా (కమ్యూనిస్టులు మినహా) ఏదో ఒక సామాజికవర్గం ప్రధానంగా పార్టీలతో నిలబడిన వైనం కనిపిస్తుంది. అదీ అధినేత సొంత సామాజికవర్గమే అయివుంటుంది. పవన్‌ సొంత సామాజికవర్గాన్ని బిజెపి తన్నుకుపోతుంటే….పవన్‌ ఏమో ముక్కుమూసుకుని ధ్యానం చేసుకుంటున్నారు. బిజెపికి ఆ అవకాశం లేకుండా…ఇప్పటికే బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుని, ఒక ముద్ర వేయగలిగివుంటే కాపులు అంత తేలిగ్గా బిజెపివైపు వెళ్లేవారు కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాపితంగా చాలామంది కాపు నాయకులు బిజెపితో కనిపిస్తున్నారు. ఖాళీ ఉన్నప్పుడు వదిలేసి…భర్తీ అయిపోయాక వెళ్లినా పవన్‌ చేసేదేమీ ఉండదు. అసలు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ వ్యూహం ఏమిటో కూడా అంతుబట్టడం లేదు. వామపక్షాలతో కలిసి పనిచేస్తానని చెప్పినప్పటికీ…ఆ పార్టీలతో సమన్వయం చేసుకుంటున్న దాఖలాలు లేవు. టిడిపి ఏమో పవన్‌ను బిజెపి పార్టనర్‌గా ప్రచారం చేస్తోంది. బిజెపి ఏమో పవన్‌ కిందకు నీళ్లు తెస్తోంది. ఏం జరుగుతుంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*