పవన్‌ లక్ష్యం ఒకచోట…గురి ఇంకోచోట

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలను ఇంకా పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు అనిపించడం లేదు. నిన్న జరిగిన పరిణామాలు, ఆయన స్పందించిన తీరు ఇందుకు నిదర్శనం. అధికార పార్టీ కొన్ని మీడియా సంస్థలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని పవన్‌ ఆరోపించారు. అంతటితో ఆగకుండా మీడియా సంస్థలను బహిష్కరించమని పిలుపునిచ్చారు. ఇందులో ఇందులో ఆవేశం తప్ప…ఆలోచన కనిపించడం లేదు. నిన్న జరిగిన పరిణామాలను కాస్త వివరంగా విశ్లేషించాలి.

ఎవరో శ్రీరెడ్డి ఏదో అన్నారని, శ్రీరెడ్డిని దర్శకుడు రాంగోల్‌ వర్మ ఎగదోశారని ఆగ్రహంతో ఊగిపోతూ ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి హడావుడి చేశారు పవన్‌. ఇదే సమయంలో తనపై ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ కుట్రలు చేస్తున్నారని ఆరపించారు. ప్రభుత్వంలోకి రావడానికి కారణమైన తన చేతిని నరికేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందారు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి సినీ పరిశ్రమకు సంబంధించినది, రెండోది రాజకీయాలకు సంబంధించినది. ప్రభుత్వమే తనపై కుట్ర చేస్తన్నది అని అనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఆ విషయాన్ని చెప్పాలి. తన పార్టీ శ్రేణులకు పిలునిచ్చి ఆందోళనలు చేపట్టమనాల్సింది. అలాంటిది లేకుండా ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి, రాంగోపాల్‌ వర్మను టార్గెట్‌గా పెట్టుకుని మాట్లాడారు. లోకేష్‌ అంతా చేయిస్తున్నారనుకున్నప్పుడు….ఫిలిం ఛాంబర్‌కు వెళ్లడంలో అర్థం లేదు. పవన్‌ కల్యాణ్‌ సినీ నటుడు మాత్రమే అయితే….అప్పుడు ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి సమస్య పరిష్కరించుకోవచ్చు. ఆయన రాజకీయ నాయకుడు. ఒక పార్టీకి అధ్యక్షుడు. లక్షలాది మంది కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. రాజకీయంగా జరుగుతున్న కుట్రలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప….అదేదో సినీ వివాదంలా తీసుకుని, ఫిలిం ఛాంబర్‌కు వెళ్లడం, పోలీసులు సర్ధిచెప్పడంతో వెనుదిరిగి రావడం….ఇవన్నీ ఏదో ఆవేశంలో చేసినట్లు అనిపిస్తుంది. ఇంకా సినిమా హీరోలాగా ఆవేశపడటం కాదు. రాజకీయ నాయకుడిలా ఆలోచించడం పవన్‌ నేర్చుకోవాలి.

ఇంకో విషయం ఏమంటే…రాజకీయాలన్నాక ఎత్తుకు పైఎత్తులు ఉంటాయి. కుట్రలు కుతంత్రాలూ ఉంటాయి. దీన్ని ఎంత దీటుగా ఎదుర్కోగలమో ఆలోచించాలి తప్ప….అలాంటివి జరుగుతున్నాయని ఆవేశపడిపోతే ప్రయోజనం లేదు. రాజకీయాలు, మీడియా కలగలిసిన నేటి పరిస్థితుల్లో…మీడియా గతి తప్పుతోందన్నమాట వాస్తవం. అంతమాత్రాన మీడియాను బహిష్కరించమని పిలుపునివ్వడం రాజకీయ నాయకునిగా పవన్‌ ఎదుగుదలకు ఆటంకమే తప్ప కాస్త కూడా మేలు చేయదు. అందుకే జనసేన అధినేతగా పవన్‌ ప్రతి మాట, చర్య ఆలోచనతోనే ఉంటేనే రాజకీయాల్లో రాణించగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*