పవన్ కళ్యాణ్ కు సీమ పౌరుషం గురించి మాట్లాడే అర్హత వుందా?

ఇటీవల కర్నూలు జిల్లా నందికొట్కూరు నంద్యాల ఆదోని సభల్లో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ తనలోనూ సీమ పౌరుషం ఉందని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. అదే పవన్ కళ్యాణ్ అంత క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ప్రసంగించుతూ వైసిపి నేత జగన్ ను విమర్శించదలచి పులివెందుల నుండి రౌడీలను తీసుకు వస్తే తాను తాట తీస్తానని హెచ్చరించారు. గతంలో కూడా తునిలో రైలు దహనం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విధంగా మాట్లాడారు. తుదకు ఒక్కరిపై కేసు నమోదు చేయలేక పోయారు.

విపక్ష నేత జగన్ ను అటు ముఖ్యమంత్రి గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని రాజకీయంగా ఎన్ని విమర్శలు అయినా చేసుకోవచ్చు. వైసిపి పార్టీ గూండాలు రౌడీలు అని తూలనాడ వచ్చు. కాని దుర్మార్గ మేమంటే జగన్ మీద ఎవరు విమర్శ చేయదలచినా సీమ లోనే రౌడీలు హంతకులు వుంటారని, రాష్ట్రంలో ఎచ్చట ఏ దుస్సంఘటన జరిగినా సీమ కు సింబాలిక్ గా పులివెందుల పేరు చెప్పడం రివాజు అయింది. వీరంతాగతించిన సీమ చరిత్ర దృష్టిలో పెట్టుకుని పులివెందుల పేరు ప్రస్తావించుతున్నారు. ఆలా కాకుండా ఏప్పుడో గతించిన చరిత్రను సింబాలిక్ గా తీసుకుని రాయలసీమలోనే రౌడీలు హంతకులు వుండే విధంగా మాట్లాడడం మంచిది కాదు.
ఈ జాబితాలో జన సేన అథినేత కూడా చేరడం దురదృష్టకం.

పవన్ కళ్యాణ్ భీమవరంలో చేసిన ప్రసంగంపై సీమలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీమ అంశంలో మాని పోతున్న గాయం కెలకడం భావ్యం కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు సాగాయి. ఇంత జరిగిన తరువాత తిరిగి సీమ లో పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తూ తన లోనూ సీమ పౌరుషం వుందని చెప్పుకోవడం నేతి బీర కాయ కథను గుర్తుకు తెస్తోంది. ఒక వేళ పవన్ కళ్యాణ్ లో నిజంగానే సీమ పౌరుష ముంటే భీమవరం ప్రసంగం తదుపరి సీమ యువతలో తలెత్తిన నిరసనలు గమనంలోనికి తీసుకొని పశ్చాత్తాపం ప్రకటించి వుండాలి. జనసేనకు చెందిన సీమ నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం తీసుకెళ్లారో లేదో తెలియదు.
తిరిగి సీమలో పర్యటించుతూ తనలోను సీమ పౌరుషం వుందని చెప్పడం పుండుపై కారం రాసినట్లు వుంది.

ఆ మాట కొస్తే రాయలసీమ యెడల పవన్ కళ్యాణ్ వైఖరి సరిగా లేదు. ప్రప్రథమంగా అనంతపురంలో సభ నిర్వహించారు. సీమనుండే తన రాజకీయ ప్రస్థానం వుంటుందని చెప్పారు. సీమ ప్రజలు నిజమేనని నమ్మారు. తిరిగి ఆ ఊసే లేదు. మరల సీమకు చెందిన తిరుపతిలో సభ నిర్వహించారు. అంతే….అచ్చటితో ఆగి పోయింది. తీరా ప్రస్తుతం ఎన్నికలు వస్తే కోస్తా జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తే గెలుపొందు తాననే నమ్మకం లేదని ఆ మధ్య అసలు విషయం బయటపెట్టారు.

పవన్ కళ్యాణ్ ఎచ్చట నుండి పోటీ చేసేది ఆయన ఇష్టం. కానీ అనంతపురం లో సభ నిర్వహించి సీమ వెనుక బాటుతనం చూస్తే తన గుండె తరుక్కు పోతోందని ఆవేదన వెలిబుచ్చిన పవన్ కళ్యాణ్ తదుపరి కాలంలో సీమ సమస్యలపై ఆయన చేసిన కృషి ఏమీ లేదు. ప్రభుత్వం అవలంభిస్తున్న కేంద్రీకృత విధానాల గురించి కరవు వలసలు గురించి పోరాడిన సందర్భం లేదు. తుదకు సీమలో హైకోర్టు న్యాయ మైన నీటి వాటా గురించి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సందర్భం లేదు.

మరి ఏమిచూసి సీమ ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించుతారు? కేవలం మాటతోనే సరిపుచ్చునట్లయితే సీమ లోనే లెక్కలేనంత మంది నేతలు వున్నారు. శత కోటి లింగాలలోఒక లింగంగా మిగిలి పోయినారు కాబట్టే సీమ ప్రజలు గెలిపించే భరోసా ఇవ్వ లేక పోయారు.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*